9నెలల పాప హత్యాచారం కేసులో వరంగల్‌ పోలీసులు సంచలన నిర్ణయం

దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ తర్వాత జనం నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో వరంగల్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 నెలల చిన్నారి హత్య కేసులో దోషి ప్రవీణ్‌కు శిక్ష

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 01:53 AM IST
9నెలల పాప హత్యాచారం కేసులో వరంగల్‌ పోలీసులు సంచలన నిర్ణయం

దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ తర్వాత జనం నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో వరంగల్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 నెలల చిన్నారి హత్య కేసులో దోషి ప్రవీణ్‌కు శిక్ష

దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ తర్వాత జనం నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో వరంగల్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 నెలల చిన్నారి హత్య కేసులో దోషి ప్రవీణ్‌కు శిక్ష తగ్గించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. మానవ మృగానికి మరణ శిక్షే విధించేందుకు అప్పీల్‌ చేస్తామని ప్రకటించారు.

తెలంగాణలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల పాపపై హత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్‌కు శిక్ష తగ్గింపుపై వరంగల్ పోలీసు కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రకటించారు. 2019 జూన్‌లో హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. జూన్‌ 17 రాత్రి చిన్నారి కుటుంబ సభ్యులు నిద్రించేందుకు డాబాపైకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత తల్లి రచనకు మెలకువ రాగా… పక్కనే కుమార్తె లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్‌ బైక్‌పై వెతకడానికి బయలుదేరాడు. ఇంటి పక్క గల్లీలో ప్రవీణ్‌ భుజాన టవల్‌లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ప్రవీణ్‌ పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోయే ప్రయత్నం చేశాడు.

అయితే, ప్రవీణ్‌ను పట్టుకున్న భరత్‌ చితకబాదాడు. అప్పటికే చిన్నారిలో ఎలాంటి కదలికా లేదు. శరీరం నుంచి అధికంగా రక్తస్రావమైంది. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా రోదించారు. ప్రవీణ్‌.. చిన్నారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పసికందు హత్యతో హన్మకొండ అట్టుడికిపోయింది. ప్రవీణ్‌ను ఉరి తీయాలంటూ జనం ఆందోళనకు దిగారు.

చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో రెండు నెలల లోపే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. ఈ కేసులో ముద్దాయి ప్రవీణ్‌… గత జూన్‌ 18న రాత్రి తల్లి పొత్తిళ్లలో పడుకొన్న పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చినట్లు హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి జూన్‌ 24 ప్రారంభమైన విచారణ… ఆగస్టు 2న ముగిసింది. పోలీసులు కూడా సవాల్‌గా తీసుకొని 20 రోజుల్లోనే కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 51 మంది సాక్షుల్లో అవసరమున్న 30 మందిని కోర్టులో హాజరుపర్చారు. ప్రవీణ్‌ను దోషిగా నిర్ధారించిన వరంగల్‌ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒక కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఇంత త్వరగా తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి.

చిన్నారిపై హత్యాచారం కేసులో ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో ఈ కేసును విచారించిన ధర్మాసనం… ప్రవీణ్‌కు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా సవరిస్తూ తీర్పునిచ్చింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులతో పాటు సమాజంలోని చాలా వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రవీణ్‌ కూడా అలాగే చంపేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.