టార్గెట్ ఏంటీ : తిరుమల చైర్మన్‌ పుట్టాపై ఐటీ దాడులు

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 04:51 AM IST
టార్గెట్ ఏంటీ : తిరుమల చైర్మన్‌ పుట్టాపై ఐటీ దాడులు

ఏపీలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్తానం చైర్మన్, కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్ ఇంటిపై ఐటీ శాఖ దాడి చేసింది. మూడు గంటలకు పైగా తనిఖీలు చేశారు. ఏయే డాక్యుమెంట్లు పరిశీలించారు.. ఏం సీజ్ చేశారు.. ఏం దొరికింది అనేది మాత్రం వెల్లడించలేదు ఐటీ డిపార్ట్ మెంట్. ఇదంతా కుట్ర అంటున్నారు పుట్టా. బీజేపీ, వైసీపీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

ఐటీ అధికారులు వచ్చిన సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఇంట్లో లేరు. మైదుకూరు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. వారి సమక్షంలోనే తనిఖీలు చేశారు అధికారులు. కడప నుంచి వెళ్లిన ఐటీ అధికారి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. సుధాకర్ యాదవ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల క్రమంలో.. ఈ సోదాలు జరిగాయి.

రెండు గంటలు కడప, ప్రొద్దుటూరుకు చెందిన ఐటీ అధికారులు పుట్టా నివాసంలోనే ఉన్నారు. ఎలాంటి పత్రాలు, వస్తువులు, నగదు లభ్యం కాకపోవడంతో ఖాళీ చేతులతో వెళ్లినట్లు సమాచారం. విషయం తెలిసి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ పుట్టా నివాసానికి చేరుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ప్రచారం చేసుకుంటున్న సమయంలో.. ఎందుకు రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎవరు పంపించారు.. ఎందుకు పంపించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు రమేష్.

టీడీపీపై జగన్, మోడీ కుమ్మక్క కుట్రలు చేస్తున్నారని.. అందులో భాగంగానే ఐటీని ఉసిగొల్పారని పుట్టా సుధాకర్ ఆరోపించారు. తమ కంపెనీలు చట్టానికి లోబడే పనిచేస్తున్నాయని.. ఒక్క రూపాయి కూడా అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.

పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నివాసంలో ఐటీ సోదాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఐటీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఆదేశాలతో టీడీపీ నేతలే టార్గెట్‌గా లోటస్‌పాండ్‌లో కుట్ర జరిగిందని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలను టార్గెట్‌ చేసి ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ అధికారులతో కావాలనే తమ ఇళ్లపై దాడులు చేయిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మంత్రి నారాయణ ఇంట్లో, నారాయణ మెడికల్ కళాశాలల్లో కూడా ఐటీ దాడులు జరిగాయని గుర్తు చేస్తున్నారు.