నేవీ ఆఫీసర్ చెన్నైలో కిడ్నాప్ – ముంబై సమీపంలోని అడవుల్లో సజీవ దహనం

నేవీ ఆఫీసర్ చెన్నైలో కిడ్నాప్ – ముంబై సమీపంలోని అడవుల్లో సజీవ దహనం

Jharkand navy officer kidnapped from chennai, burnt alive by kidnappers in palghar :  తమిళనాడులోని చెన్నై విమానాశ్రయం నుంచి నేవీ ఆఫీసర్ ను కిడ్నాప్  చేసిన దుండగులు వారు అడిగిన రూ.10 లక్షలు ఇవ్వలేదని అతడ్ని సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది.  మహారాష్ట్రలోని  పాల్ఘర్ ఎస్పీ జాన్ దత్తాత్రేయ షిండే చెప్పిన వివరాల ప్రకారం…….

జార్ఖండ్ రాష్ట్రం, పలాము జిల్లా కొల్హువా గ్రామానికి చెందిన సూరజ్ కుమార్ దూబే (26) కోయంబత్తూరులోని ఐఎన్ఎస్ అగ్రానీ కేంద్రంలో 2012 నుంచి ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామంలో రెండు వారాల పాటు సెలవులు గడిపి, విధుల్లో చేరటానికి జనవరి 30న రాంచీ నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చాడు.

కొయంబత్తూరు వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయంలో వేచి ఉండగా  రాత్రి 11 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు అతడికి తుపాకీ చూపించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినట్లు పోలీసు విచారణలో తేలింది. అనంతరం ఆ ముఠా సభ్యులు సూరజ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కుటుంబ సభ్యులు ఆవిషయమై స్పందించక పోవటంతో, 3 రోజులు చెన్నైలో ఉంచి అనంతరం అతడ్ని మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని  పాల్ఘర్ కు తరలించారు. శుక్రవారం ఫిబ్రవరి 5వ తేదీ వరకు అతడి కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వక పోయేసరికి పాల్ఘర్  సమీపంలోని ఘోల్వాడ్ అడవిలో కాళ్లు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఆ సమయంలో అడవిలో కట్టెలు ఏరుకునేందుకు  వచ్చిన కొందరు వ్యక్తులు దూబేను తగల బెట్టటం చూసి,  ఏంచేస్తున్నారు అంటూ గట్టిగా అరిచారు. దీంతో ముగ్గురు దుండగులు   అక్కడినుంచి పరారయ్యారు. వారు వెంటనే స్ధానిక పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్ధలానికి వచ్చిన పాల్ఘర్ పోలీసులు  దుండగుల దాడిలో గాయపడిన దూబేను మొదట స్ధానిక   ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పరిస్ధితి విషమించటంతో ముంబై లోని  నావికాదళానికి చెందిన అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్ధితి విషమించి దూబే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. నావికాదళ ఆస్పత్రికి తీసుకు వచ్చిన సమయంలో దూబై పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చాడని పాల్ఘర్ జిల్లా పోలీసు అధికారి సచిన్ నవద్కర్ తెలిపారు.

జనవరి 30 వతేదీ రాత్రి 10-11 గంటల మధ్య సమయంలో కిడ్నాప్ జరిగినట్లు….. తెల్లటి కారులో తీసుకువెళ్లినట్లు చెప్పాడు. 3 రోజులు చెన్నైలో ఉన్న తర్వాత  ఫిబ్రవరి 4 న దాదాపు  25, 26 గంటలు ప్రయాణం చేసినట్లు వివరించాడు. ఫిబ్రవరి 1న విధుల్లో చేరటానికి రిపోర్టు చేయవలసి ఉండగా అప్పటికి కొయంబత్తూరు   చేరకపోవటంతో అతని తండ్రి మిథిలేష్ దూబై చైన్పూర్ పోలీసు స్టేషన్లో తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు.

పలాము ఎస్పీ సంజీవ్ కుమార్    కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కాగా….దూబే తన తల్లి తండ్రులతో ఆఖరుసారిగా హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మాట్లాడినట్లు అతని తండ్రి తెలిపారు. నిందితులు దూబే సెల్ ఫోన్లను  కూడా అపహరించుకు వెళ్లారు. తన కుమారుడిని కిడ్నాప్   చేసిన దుండగులకు తగిన శిక్షపడాలని ఆయన కోరుతున్నాడు.

దూబే మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 302, కిడ్నాప్, కిడ్నాప్ నుంచి విడుదల చేయటానికి డబ్బు డిమాండ్ 364, దోపిడీకి 392 కింద కేసులు నమోదు చేశారు. దూబేని చెన్నై విమానాశ్రయం నుంచి కిడ్నాప్ చేసినప్పటి నుంచి దాదాపు 1500కిలోమీటర్లు ఎందుకు తీసుకువచ్చారనే అంశంపైనా పోలీసులు  విచారిస్తున్నారు.

ముంబై నుంచి ఒక ప్రత్యేక పోలీసు బృందం విచారణ నిమిత్తం చెన్నై వెళ్లింది. సూరజ్ దూబే ని   ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు ? కేవలం డబ్బుకోసమే కిడ్నాప్ చేశారా ?  తెలిసిన వారే కిడ్నాప్ చేశారా ? కుటుంబ సభ్యులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ? హత్య చేయాలి అనుకుంటే 1500 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం ఎందుకు ఎంచుకున్నారు ? చెన్నైలో కిడ్నాప్ చేసిన వ్యక్తిని ముంబై దాకా ఎందుకు తీసుకువచ్చారనే  పలు అంశాలపై  పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముంబై, చెన్నై పోలీసుల దర్యాప్తులో ఇవన్నీ నిగ్గుతేలనున్నాయి.