బ్లడ్ శాండల్.. పోలీసులకు తలనొప్పిగా ఎర్రచందనం స్మగ్లర్ల మృతి కేసు

  • Published By: sreehari ,Published On : November 8, 2020 / 06:41 PM IST
బ్లడ్ శాండల్.. పోలీసులకు తలనొప్పిగా ఎర్రచందనం స్మగ్లర్ల మృతి కేసు

Kadapa Red Sandal smugglers death case : కడప ఎర్రచందనం స్మగ్లర్ల మృతి పోలీసులకు తలనొప్పిగా మారింది. వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని మృతి చెందిన ఐదుగురు తమిళ కూలీలను గుర్తించడంలో ఆలస్యం జరుగుతోంది. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను బంధువులకు అప్పగించిన పోలీసులు.. మరొక వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడంలో తలలు పట్టుకుంటున్నారు.



ఆ వ్యక్తి బంధువుల జాడ తెలియక.. మృతదేహాన్ని అప్పగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకూ నలుగురు మృతదేహాలు గుర్తించిన తమిళ కూలీల బంధువులు కూడా మృతదేహం వివరాలు తెలపకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

తమిళనాడు నుంచి తమిళ కూలీలను కడపకు తీసుకొచ్చిన మేస్త్రి రామచంద్రన్ ప్రమాదంలో చిక్కుకొని చనిపోవడంతో కూలీల వివరాలు తెలియక పోలీసులు సతమతమవుతున్నారు. పారిపోయిన వ్యక్తి పట్టుబడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది.



అదుపులో ఉన్న అంతర్రాష్ట స్మగ్లర్ బాషా భాయ్‌ను పోలీసుల విచారిస్తున్నారు. కడపలోని ఓ సీక్రెట్ ప్లేస్‌లో రెండు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఈబీ అదనపు ఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.

స్కార్పియో వాహనంలో 18 ఎర్రచందనం దుంగలు తోపాటు ఎనిమిది మంది తమిళ కూలీలు ప్రయాణిస్తుండగా ప్రమాద ఘటనలో ఐదు మంది మంటల్లో సజీవదహనమయ్యారు. మరో ముగ్గురిలో ఒకరు తీవ్రంగా గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.



స్వల్ప గాయాలతో బయటపడ్డ సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కోర్టులో హాజరు పరిచారు. మరోవైపు ప్రమాదం నుంచి తప్పించుకుని పారిపోయిన వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పారిపోయిన వ్యక్తి రిషినా లేక చంద్రన్‌నా తేలాల్సి ఉంది.

ఇక ఇప్పటివరకు గుర్తించని మృతదేహం కూడా రిషిదా లేక చంద్రన్‌దా అన్న అనుమానంతో పోలీసులున్నారు. ఇక ప్రమాదంతో కీలక సంబంధాలున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ బాషా భాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



రెండు రోజులుగా ఓ సీక్రెట్‌ ప్లేస్‌లో అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదాన్ని పక్కా ప్లాన్‌ ప్రకారమే బాషా భాయ్‌ రూపొందించినట్టు పోలీసులు తేల్చారు. తమిళ కూలీలను ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పంపింది.. వారిని వెంబడించమని హైజాక్‌ ముఠాను ఆదేశించింది.. ఇద్దరూ ఒకరేనని.. అది బాషా భాయ్‌ పనిగా పోలీసులు తేల్చారు.



బెంగళూరు ప్రాంతానికి చెందిన ఫయాజ్‌తో బాషా భాయ్‌.. డీల్‌ కుదుర్చు కున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ డీల్‌లో భాగంగానే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు బాషా భాయ్‌ ప్లాన్‌ రూపొందించాడని పోలీసులు తెలిపారు. ఇక ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగు తుండగా.. ఈ కేసుపై రేపు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.