తెలుగు రాష్ట్రాల్లో కంజర్‌భట్‌ ముఠా. విలువైన వస్తువుల లోడుతో వెళ్లే లారీలు, కంటైనర్లే టార్గెట్.. ఒక్కో ముఠాలో కనీసం 20 నుంచి 25 మంది

10TV Telugu News

తెలుగు రాష్ట్రాల్లో కంజర్‌భట్‌ ముఠా మకాం వేసిందా..? విలువైన వస్తువుల లోడుతో వెళ్లే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతోందా..?

మొన్న చిత్తూరు..తాజాగా గుంటూరు దోపిడీ ఘటనలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. గతంలోఈ ముఠా నేరాలకు పాల్పడిన తీరు, తాజా ఘటనలు జరిగిన క్రమాన్ని విశ్లేషిస్తే ఇది వారి పనేనని స్పష్టమవుతోంది. ఇంతకీ ఈ గ్యాంగ్‌ దోపిడీ ఎలా ఉంటుంది..?

మొన్న చిత్తూరు.. నిన్న గుంటూరు..తాజాగా మెదక్.. ప్లేస్‌లు మాత్రమే వేరు..జరిగిన దోపిడీ ఒక్కటే..కంటెయినర్‌లను టార్గెట్‌ చేసుకున్నారు.. లక్షలు, కొట్ల సొత్తు దోచుకెళ్లారు.. మూడు చోట్ల ఒకే గ్యాంగ్ చేసిందా..? దోపిడీ చేసింది కంజర్‌భట్‌ గ్యాంగేనా..? తెలుగు రాష్ట్రాల్లో కంజర్‌భట్‌ పంజా విసురుతోందా..?

పక్కాగా రెక్కీ చేస్తారు, కావాల్సినంత దోచుకుంటారు, చిక్కకుండా ఉడాయిస్తారు:
భారీ సరుకుతో రహదారిపై రయ్‌మంటూ దూసుకెళ్లే కంటైనర్లే ఆ దోపిడీ దొంగల టార్గెట్‌. ఆ సరుకును కొట్టేసేందుకు చాలా పక్కాగా రెక్కీ చేస్తారు. కంటైనర్‌ను హైజాక్‌ చేసి కావాల్సినంత సొత్తును దోచుకుని ఉడాయిస్తారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఆ సొత్తును ఏం చేస్తారో తెలియదు. కానీ పోలీసులకు మాత్రం అసలు చిక్కరు.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు మూడు వెలుగులోకి వచ్చాయి. ఏపీలో రెండు చోట్ల, తెలంగాణలో ఒక చోట…కంటైనర్‌ దోపిడీకి పాల్పడిన దుండగులు…కోట్ల విలువైన మొబైల్స్‌ను దోచుకున్నారు.

మెదక్ లో భారీ చోరీ, కంటైనర్ నుంచి రూ.2.5కోట్ల విలువైన సెల్ ఫోన్లు చోరీ:
తాజాగా…మెదక్‌ జిల్లా చేగుంట సమీపంలో కంటైనర్ లారీలో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. రెండున్నర కోట్ల రూపాయల విలువైన సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న కంటెయినర్‌ నుంచి రూ.2.5కోట్ల విలువ చేసే 2 వేల 442 సెల్‌ఫోన్లను నిమిషాల వ్యవధిలో అపహరించారు. ప్లాన్ ప్రకారం ముందు నుంచే లారీని ఫాలో చేసిన కిలాడీలు..డ్రైవర్ హోటల్‌ దగ్గర లారీని ఆపిన సమయంలో చోరీకి పాల్పడ్డారు.

80 లక్షల విలువ చేసే 980 సెల్‌ఫోన్లు చోరీ:
సెప్టెంబర్ 16న గుంటూరు జిల్లాలో సేమ్ టూ సేమ్ దోపిడీ జ‌రిగింది. మ‌ంగ‌ళ‌గిరి స‌మీపంలో జాతీయ ర‌హ‌దారిపై సెల్‌ఫోన్లు త‌ర‌లిస్తున్న కంటెయినర్‌ను దొంగలు టార్గెట్ చేశారు.

శ్రీసిటీ నుంచి కోల్‌క‌తాకు వెళ్తుండ‌గా..కంటెయినర్‌ వెనుక భాగాన్ని బ్రేక్ చేశారు. ఆ తర్వాత అందులోని ఫోన్లు ఎత్తుకెళ్లారు. దాదాపు 80 లక్షల విలువ చేసే 980 సెల్‌ఫోన్లు చోరీ చేశారు.

నగరి-పుత్తూరు మధ్య కంటైనర్ ను అడ్డగించి రూ.7 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు దోపిడీ:
అంతకుముందు..ఆగస్టు 27న తమిళనాడులోని శ్రీపెరంబుదూరు నుంచి ముంబైకి వెళ్తున్న కంటైనర్‌ను నగరి-పుత్తూరు మధ్య అడ్డగించి 7 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు దోచుకున్నారు దుండగులు. ఈ మూడు ఘటనలే కాదు గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. 2018 చివరిలో అనంతపురం జిల్లా కనగానపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ లారీని అటకాయించి డ్రైవర్‌ను చంపేశారు.

ఆ తర్వాత చిత్తూరు జిల్లా గంగవరం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ డ్రైవర్‌ను హతమార్చారు. 2019 ప్రారంభంలో తమిళనాడు-నెల్లూరు-చిత్తూరు సరిహద్దుల్లో పలువురు లారీ డ్రైవర్లపై దాడిచేసి దోపిడీలకు యత్నించారు.

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ ప్రాంతానికి చెందిన కంజర్‌భట్‌లు ముఠాలుగా విడిపోయి దోపిడీలు:
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ ప్రాంతానికి చెందిన కంజర్‌భట్‌లు ముఠాలుగా విడిపోయి దోపిడీలకు పాల్పడుతుంటారు. ఒక్కో ముఠాలో కనీసం 20 నుంచి 25 మంది సభ్యులు ఉంటారు. దోపిడీల కోసం బయల్దేరినప్పుడు అత్యంత ఖరీదైన కార్లలో ప్రయాణం సాగిస్తుంటారు. తమ వెంట రెండు, మూడు లారీలను సైతం తీసుకొస్తారు.

జాతీయ రహదారులపై సెల్‌ఫోన్లు వంటి ఖరీదైన వస్తువులతో వెళ్తున్న లారీలు, కంటైనర్లను గమనిస్తారు. జనసంచారం లేని, చీకటిగా ఉండే ప్రదేశాల్లో వాటిని అడ్డగించి..సరకును తమ వెంట తీసుకొచ్చిన లారీల్లోకి మార్చేస్తారు. తర్వాత వాటిని సరిహద్దులు దాటించేస్తారు.

దోపిడీకి పాల్పడే సమయంలో లారీ డ్రైవర్లు ఎవరైనా తిరగబడితే వారిపై తీవ్రంగా దాడి చేసి, కాళ్లు చేతులు కట్టేసి బయట పడేస్తారు. పలు సందర్భాల్లో వారిని హతమార్చిన ఘటనలూ ఉన్నాయి.

గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా రూ.80 కోట్ల విలువైన సరుకు దోపిడీ:
ముఠాలోని సభ్యులు కొంతమంది కార్లలో తిరుగుతుంటారు. మరికొందరు తమ వెంట తీసుకొచ్చిన లారీలను నడిపించే బాధ్యతలు చూస్తుంటారు. ఇంకొందరు జాతీయ రహదారి పొడవునా ఉండే దాబాల్లో గడుపుతుంటారు.

అక్కడకు వచ్చే లారీ, కంటైనర్ల డ్రైవర్లతో మాట కలుపుతారు. సరకు వివరాలు..ఎక్కడి నుంచి వస్తోంది..? ఎక్కడకు వెళ్తోంది..?తదితర వివరాలు తెలుసుకుంటారు.

అంతా అనుకూలం అనుకుంటే.. ఆ సమాచారాన్ని ముఠాలోని ఇతర సభ్యులకు చెబుతారు. పక్కాగా రెక్కీ నిర్వహించాక అంతా కలిసి ఆ వాహనాల్ని అనుసరించి దోచుకుంటారు.

ఒక విడతలో కనీసం 5నుంచి 6 కోట్ల విలువైన సొత్తు కొల్లగొట్టడం ఈ ముఠా అలవాటు. గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా 80 కోట్ల విలువైన సరుకు దోచుకుని ఉంటారని పోలీసుల అంచనా.

దోపిడీ పూర్తయ్యాక ఫోన్‌లను నీటిలో పడేస్తారు, ముఠా సభ్యులందర్నీ పట్టుకోవడం అసాధ్యమే:
ఈ ముఠాను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గానే ఉంటుంది. నేరాలకు పాల్పడిన ప్రతిసారీ కొత్త ఫోన్లు, కొత్త సిమ్‌కార్డులు ఉపయోగిస్తారు. బయట వారికి వాటితో కాల్‌ చేయరు. సిమ్‌కార్డులను సొంత గుర్తింపు కార్డులతో తీసుకోరు. స్మార్ట్‌ఫోన్లు వాడరు.

దోపిడీ పూరయ్యాక ఉపయోగించిన ఫోన్లను నీటిలో పడేస్తారు. తమ లారీల నంబర్‌ ప్లేట్లను తరచూ మార్చేస్తారు. ముఠాలోని ఒకరో, ఇద్దరో తప్ప ముఠా సభ్యులందర్నీ పట్టుకోవటం ఇప్పటివరకూ సాధ్యపడలేదు. మరి ఈ మూడు కేసుల్లో పోలీసులు ఎంతమేరకు చోరీ సొత్తును రికవరీ చేస్తారో చూడాలి.