వీడిన మిస్టరీ : ఇంటర్ విద్యార్ధిని హత్య కేసులో తండ్రే కాలయముడు

  • Published By: chvmurthy ,Published On : March 2, 2020 / 07:36 PM IST
వీడిన మిస్టరీ : ఇంటర్ విద్యార్ధిని హత్య కేసులో తండ్రే కాలయముడు

20 రోజులకు పైగా ఉత్కంఠకు తెరపడింది. ఇంటర్‌ విద్యార్థిని మర్డర్‌ కేసులో మిస్టరీ వీడింది. ఓ వైపు డీఎన్ఏ టెస్ట్‌తో పాటు అత్యాధునిక టెక్నాలజీ…మరోవైపు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేపట్టిన పోలీసులు హంతకులెవరో తేల్చారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి కన్న తండ్రే కడతేర్చినట్లు నిర్ధారించారు. మరి తండ్రే..ఎందుకు హతమార్చాడు..? ఎలా చంపాడు..? కన్న తండ్రే హంతకుడని పోలీసులు ఎలా తేల్చారు..? మర్డర్‌ వెనక మిస్టరీ ఏంటి..?

కరీంనగర్‌ జిల్లాలో దారుణ హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్థిని హత్య కేసులో మిస్టరీ వీడింది. దాదాపు 20 రోజుల పాటు 8 బృందాలుగా ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు…జర్మన్‌ టెక్నాలజీని ఉపయోగించి..కన్నతండ్రే హంతకుడని తేల్చారు. అనారోగ్యంగా ఉన్న కూతురికి డబ్బు ఖర్చు పెట్టలేకే హతమార్చినట్లు నిర్ధారించారు. 

విద్యానగర్‌లో నివాసం ఉంటున్న కొమురయ్య..కూతురు రాధిక..ఫిబ్రవరి 10వ తేదిన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారం, పాత నేరస్తుల విచారణ, బంధువులు, స్థానికుల విచారణ, అప్పులు తీసుకున్న వారి ప్రమేయం, ఇతర రాష్ట్రాల నేరస్తులు, సైకో వ్యక్తుల ప్రమేయం..ఇలా రకరకాలుగా 21 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా దర్యాప్తు చేపట్టిన పోలీసులు..చివరకు కన్నతండ్రే హంతకుడని తేల్చారు.

మృతురాలు రాధికకు పోలియో వ్యాధి. కూతురి ఆరోగ్యం కోసం కుటుంబసభ్యులు చాలా ఆస్పత్రులు తిప్పి చికిత్స చేయించారు. దాదాపు 6 లక్షలు ఖర్చు పెట్టారు. సంవత్సరం క్రితం శస్త్ర చికిత్స చేయించడంతో ఆరోగ్యం కుదుటపడింది. కానీ కొద్ది రోజుల క్రితం మళ్లీ అనారోగ్యం పాలైంది. అయితే మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్తే…ఎంత డబ్బు ఖర్చవుతుందోనని తండ్రి కొమురయ్య భయాందోళనకు గురయ్యాడు. డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక…కన్నపేగునే కడతేర్చాలనుకున్నాడు. హత్యకు నాలుగు రోజులు ముందుగానే పథకం రచించాడు.

ప్లాన్‌ ప్రకారం ముందుగా…ఇంట్లో కిరాయికి ఉన్న కుటుంబాన్ని బలవంతంగా ఖాళీ చేయించాడు. ఫిబ్రవరి 10న ఎలాగైనా కూతురుని చంపాలని నిర్ణయించుకున్నాడు. భార్యను కూలి పనికి పంపించాడు. బయట పరిస్థితులు గమనించడానికి కిరాణం షాప్‌కి వెళ్లాడు. తిరిగి వస్తుండగా తన ఇంటిపక్కన ఫంక్షన్ హాల్‌కి వాచ్‌మెన్‌గా ఉన్న వీరేశం కుక్క చనిపోగా కాసేపు అతనితో మాట్లాడాడు. అనంతరం ఇంటికి వచ్చాడు. 

కూతురు బెడ్‌పై దుప్పటి కప్పుకొని పడుకోవడం చూసి అదే అదునుగా భావించాడు. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి దిండును ముఖంపై పెట్టి ప్రాణం తీశాడు. మృతిపై పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని బెడ్‌పై నుంచి కింద పడేసి…కిచెన్‌లోని కత్తితో గొంతు కోశాడు. అనంతరం ఆ  కత్తిని కడిగి..రక్తం పడిన బనియన్‌ను ఉతికి ఆరేశాడు. ఇంట్లో వాళ్ళకి కూడా అనుమానం రాకుడా అన్నం తిని, టిఫిన్ బాక్స్ పెట్టుకొని పనికి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ మరోసారి కుక్క చనిపోయిన బాధలో ఉన్న వాచ్‌మెన్ వీరేశంతో కాసేపు మాట్లాడాడు. 

అనంతరం పనికి వెళ్తున్నా…డోర్ దగ్గరకి పెట్టుకో బిడ్డ అని గట్టిగా స్థానికులకు వినపడే విధంగా చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు ఇంట్లో ఉన్న తన భార్య చైన్‌ని ముందు గానే బియ్యం బస్తాలో కనపడకుండా దాచిపెట్టాడు. పని వద్దకు వెళ్ళాక ఎవరికి అనుమానం రావొద్దని తన భార్య, ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడాడు. అనంతరం మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు.

సీన్‌కట్‌ చేస్తే.. ఆ రోజు సాయంత్రం స్థానికులు…రాధిక హత్యకు గురైందని తెలుసుకుని..కొమురయ్య కొడుక్కి ఫోన్‌ చేసి తెలిపారు. అతడు తండ్రికి ఫోన్‌ చేయగా స్విఛాప్‌ వచ్చింది. వెంటనే తండ్రితో పని చేసే వాళ్లకి ఫోన్‌ చేసి చెప్పాడు. ఆ సమయంలో తనకేమి తెలియనట్లుగా నటించిన కొమురయ్య..కన్నీరుకారుస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక అమాయకంగా నటించాడు. పోలీసులు అడగ్గా…తన కూతుర్ని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి…ఇంట్లో బంగారు ఆభరణాలు, డబ్బులు ఎత్తుకెళ్లారంటూ కొత్త నాటకానికి తెరలేపాడు. అంతేకాదు తన కూతుర్ని హత్య చేసిన వాళ్లకు కూడా అలాంటి శిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. 

తండ్రి చేతిలో హతమైన ఇంటర్ విద్యార్ధిని రాధిక

radhika karimnagar

ఇక హత్య కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు కొమురయ్య చాలా తెలివిగా వ్యవహరిస్తూ అడుగడుగునా అడ్డు తగిలాడు. తప్పుదారి పట్టిస్తూ వచ్చాడు. కుటుంబ సభ్యులను కూడా సరిగ్గా విచారించకుండా…పోలీసులు కావాలనే తమను తప్పు పడుతున్నారని సానుభూతి పొందే ప్రయత్నం చేశాడు. ఆధారాలను రూపుమాపే క్రమంలో నేరానికి ఉపయోగించిన కత్తిని కడగడం, అన్నం తినడం, వాచ్‌మెన్ వీరేశంతో మాట్లాడడం, పనికి వెళ్లాక మొబైల్‌లో భార్యతో పాటు ఇతరులతో మాట్లాడడం, రోజంతా ఫోన్ స్విచ్చాఫ్ పెట్టుకోవడం…ఇలా ప్రతిచోట ఆధారాలు పక్కదారి పట్టిస్తూ… తనను ఇబ్బంది పెడుతున్నారంటూ సానుభూతికి ప్రయత్నించాడు.

ఈ హత్య కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు..8 బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగారు. ముందుగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో మొట్టమొదటి సారిగా ఈ కేసులో జర్మన్‌ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ టీం..మృతురాలి ఇంటిపై ఆరేసిన కొమురయ్య బనియన్లు, అతని చెప్పులపై రక్తపు మరకలను గుర్తించింది. వాటిని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. అతి తక్కువ సమయంలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎనాలిసిస్ చేశారు. అనంతరం మృతురాలి డిఎన్ఎతో సరిపోల్చారు. ఆ రెండు ఒక్కటేనని తేలడంతో కన్నతండ్రే హంతకుడని నిర్ధారించారు. వెంటనే కొమురయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అనంతరం ఇంట్లో బియ్యం బస్తాలో దాచిన బంగారు చైన్‌, రాధిక కప్పుకున్న రగ్గును స్వాధీనం చేసుకున్నారు. 

ఇక గొర్రెలు కోయడంలో కొమురయ్య ఎక్స్‌పర్ట్ అని…అందుకే గొంతు కోసినప్పుడు ఎక్కువ రక్తం రాలేదని పోలీసులు తెలిపారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే ఇలాంటి వ్యక్తిని తామెప్పుడూ చూడలేదన్నారు. మరోవైపు ఇన్ని రోజులు…గుర్తు తెలియని వ్యక్తుల పనిగా భావించిన..బంధువులు, స్థానికులు..అసలు విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు.