అక్రమ సంబంధంతో హత్య…14 ఏళ్ల జైలు జీవితం తర్వాత డాక్టరైన హంతకుడు

  • Published By: chvmurthy ,Published On : February 16, 2020 / 11:59 AM IST
అక్రమ సంబంధంతో హత్య…14 ఏళ్ల జైలు జీవితం తర్వాత డాక్టరైన హంతకుడు

డాక్టరు కావాలనుకున్న చిన్ననాటి కలను ఆ యువకుడు సాకారం చేసుకున్నాడు. తానోకటి తలిస్తే దైవమొకటి  తలచిందన్న చందంగా యుక్త వయస్సులో ఉండగా చేసిన తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తెలిసీ తెలియని వయస్సులో  ఏర్పడిన స్నేహం అక్రమ సంబంధానికి దారితీసింది. ఎంబీబీఎస్ చదువుతుండగా క్షణికావేశంలో చేసిన తప్పుకు జైలు  శిక్ష పడ్డా… జైలునుంచి తిరిగి వచ్చి తన జీవితాశయాన్నినెరవేర్చుకుని…రోగులకు సేవచేస్తున్న ఓ వైద్యుడి కధ కర్ణాటకలో జరిగింది.కర్ణాటకలోని  కాలబురిగి జిల్లా అఫ్జల్ పూర్ తాలూకా, ఖోసాగా గ్రామానికి చెందిన సుభాష్ పాటిల్ 1997లో ఎంబీబీఎస్ లో చేరాడు. ఆసమయంలో తన ఇంటికి సమీపంలో ఉండే పద్మావతి  అనే మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఒకరినొదిలి ఇంకోకరు ఉండలేనంతగా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అప్పటికే పద్మావతి కి పెళ్లైంది.  వీరిద్దరి వ్యవహారం కొంత కాలానికి పద్మావతి భర్త అశోక్ కు తెలియటంతో పద్దతి మార్చుకోమని పద్మావతిని, పాటిల్ ను  హెచ్చరించాడు. 

తమ ప్రేమకు అడ్డువస్తున్నాడనే కారణంతో ఇద్దరూ కల్సి పద్మావతి భర్త అశోక్ గుత్తేదార్ ను జూన్ 15, 2002 లో హత్య చేసి అడ్డు తొలగించుకున్నారు. కేసు విచారణలో సాక్ష్యాలు నిరూపించబడటంతో ఇద్దరూ దోషులుగా తేలారు. కోర్టు 2002 లో ఇద్దరికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటికి పాటిల్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.  జైలు శిక్ష పడటంతో సుభాష్ పాటిల్  చదువు ఆగిపోయింది. 

అప్పటి నుంచి 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన పాటిల్, పద్మావతిలు  సత్ప్రవర్తన కారణంగానూ 2016 స్వాత్రంత్యదినోత్సవం రోజు జైలునుంచి విడుదలయ్యారు. జైలు శిక్ష అనుభవించే సమయంలో  సెంట్రల్ జైలు ఆస్పత్రి వైద్యులకు  సహాయం చేసేవాడు.
జైలులో క్షయ వ్యాధితో బాధ పడుతున్న ఖైదీలకు అతను చేసిన సేవలకు గాను 2008 లో ఆరోగ్య శాఖ అతడ్ని సత్కరించింది.   జైలు నుంచి బయటకు  వచ్చిన  పాటిల్ తన  చిన్ననాటి కల నెరవేర్చుకోటానికి ఎంబీబీఎస్ పూర్తిచేస్తానని యూనివర్సిటీకి విన్నవించుకున్నాడు. 

పాటిల్ అభ్యర్ధనను పరిశీలించిన యూనివర్సిటీ అధికారులు అందుకు అంగీకరించారు. 2019 లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన పాటిల్ ఇటీవలే ఇంటెర్న్ షిప్ కూడూ పూర్తి చేసి  రోగులకు సేవలందిస్తున్నాడు.  పాటిల్ వయస్సు ఇప్పుడు 40 సంవత్సరాలు.  వైద్యుడిగా ప్రజలకు మంచి సేవలు అందిచటమే తన లక్ష్యమని పాటిల్ చెబుతున్నాడు. యుక్త వయస్సులో క్షణికావేశంలో తప్పులు చేయవద్దని ఆయన యూత్ కు సూచిస్తున్నాడు. జైలులో ఉన్న రోజుల్లో ఎక్కవ సమయం పుస్తకాలు చదవటానికే  కేటాయించేవాడినని సుభాష్ తెలిపాడు. జైలు జీవితం అనుభవించినా అదే జీవితానికి ముగింపు కాదని నిరూపించటానికి డాక్టర్. సుభాష్ పాటిల్  జీవితం ఒక సాక్ష్యంగా నిలిచింది. 

Read More>>ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం