హోటల్‌పై ఆత్మాహుతి దాడి : 15మంది మృతి

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 03:30 AM IST
హోటల్‌పై ఆత్మాహుతి దాడి : 15మంది మృతి

నైరోబి : కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హోటల్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా విదేశీయులే ఉన్నారు. నైరోబీలోని వెస్ట్‌లాండ్స్‌ డిస్ట్రిక్ట్‌లో  ‘డస్టిట్‌డీ2’ హోటల్‌ కాంప్లెక్స్‌‌లోకి టెర్రరిస్టులు ప్రవేశించారు. పార్కింగ్‌ ప్లేస్‌లో వాహనాలపైకి బాంబులు విసిరారు.  తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు.  ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 14మంది స్పాట్‌లోనే మృతి చెందగా.. ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. స్థానిక కాలమానం ప్రకారం 2019, జనవరి 15వ తేదీ మంగళవారం 3గంటల ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది.

ఈ ఘటనకు తామే బాధ్యులమని సోమాలియాకు చెందిన ‘అల్‌-షబాబ్‌’ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. 2013లో నైరోబీలోని వెస్ట్ గేట్ మాల్ పై ఇదే ఉగ్రవాద సంస్థ దాడి చేసింది. ఆ దాడిలో 67మంది చనిపోయారు. ఉగ్రవాదుల దాడితో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. హోటల్‌ కాంప్లెక్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఘటనను ఆ దేశ మంత్రి ఫ్రెడ్‌ ఖండించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే

ఉందన్నారు. ఉగ్రవాదం తమను ఓడించలేదన్నారు. ఫారినర్స్ ఎక్కువగా వచ్చే హోటల్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. డస్టిట్‌డీ2 లో హోటల్ లో రెస్టారెంట్లు, బార్లు, ఆఫీసులు, బ్యాంకులు ఉన్నాయి. అమెరికా, యూరప్, భారత్‌కు చెందిన వారు ఎక్కువగా ఈ హోటల్‌కు వస్తారు.