ఆమెకు 42, అతడికి 32, పెళ్లి చేసుకోమనే సరికి….

  • Published By: Mahesh ,Published On : April 30, 2020 / 10:34 AM IST
ఆమెకు 42, అతడికి 32,  పెళ్లి చేసుకోమనే సరికి….

తాను ప్రేమించిన యువతితో ప్రేమాయణం సాగించి తీరా పెళ్లి చేసుకోమనే సరికి ఆమెను హత్య చేసిన ప్రియుడి ఉదంతం కేరళ లోని పాలక్కడ్‌లో  వెలుగు చూసింది. కొల్లామ్ జిల్లాకు చెందిన సుచిత్ర (42)  ట్రైనీ బ్యూటీషియన్ గా పని చేస్తోంది. గత మార్చి నెల 17 న తన మావయ్యకు ఒంట్లో బాగోలేదని…. తాను వెంటనే అలప్పుజాకు వెళ్ళి ఆయన యోగక్షేమాలు చూసుకోవాలని…తనకు సెలవు మంజూరు చేయాల్సిందిగా తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీకి మెయిల్ చేసింది. సెలవు మంజూరవటంతో సుచిత్ర సెలవు తీసుకుంది. 

తర్వాత మరో 5 రోజుల పాటు సెలవు పొడిగించాల్సిందిగా మళ్లీ మెయిల్ చేసింది. అప్పటికే ఇంటికి చేరుకున్న సుచిత్ర తనను ట్రైనింగ్ కోసం  ఎర్నాకుళం పంపిస్తున్నారని ఇంట్లో వాళ్లకు చెప్పింది.  మార్చి 22 జనతా కర్ఫ్యూ,  24 రాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఎర్నాకుళం వెళ్తున్నా అని చెప్పిన సుచిత్ర 5 రోజులైనా ఇంటికి రాకపోయేసరికి  కుటుంబ సభ్యులు ఆమె పని చేస్తున్న కంపెనీకి ఫోన్ చేయగా ఇక్కడికి రాలేదని…..తన మావయ్యకు ఒంట్లో  బాగోలేదని చెప్పి 5 రోజులు సెలవు తీసుకుందని తెలిపారు.

అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కొట్టాయం పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుచిత్ర భర్తతో విడాకులు తీసుకుని భర్త తరుఫు కుటుంబ సభ్యులకు  దూరంగా ఉంటోందని ఆమె తల్లితండ్రులు వెల్లడించారు. సుచిత్ర కుటుంబ సభ్యులను మరింత లోతుగా ప్రశ్నించిన పోలీసులకు ఒక చిన్న క్లూ దొరికింది.

సుచిత్ర సోషల్ మీడియా ఎకౌంట్ చెక్ చేశారు. మనాలీకి చెందిన కీ బోర్డు ప్లేయర్ ప్రశాంత్ (32) సోషల్ మీడియా ద్వారా సుచిత్రకు పరిచయం అయ్యాడు.  వీరిద్దరి మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు పోలీసులు గమనించారు. సుచిత్ర ప్రశాంత్ ను కలవటానికి  మనాలీ వెళ్లి ఉంటుదని అంచనా వేశారు. వెంటనే కొల్లాయం క్రైమ్ బ్రాంచి పోలీసులు  మనాలీ వెళ్లి ప్రశాంత్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

తన వద్దకు సుచిత్ర వచ్చాక పెళ్లి విషయమై ఇద్దరం పోట్లాడుకున్నామని ఆ తర్వాత సుచిత్ర ఆత్మహత్య చేసుకుందని ప్రశాంత్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు తమదైన స్టైల్ లో ప్రశ్నించే సరికి అసలు విషయం బయట పెట్టాడు ప్రశాంత్. కొన్నాళ్లుగా సుచిత్ర తనను  ప్రేమిస్తోందని.. పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయటంతో ఆమెను  హత్య చేసినట్లు ప్రశాంత్ ఒప్పుకున్నాడు.

తర్వాత ఆమె శవాన్నితాను ఉంటున్న ఇంట్లోనే పూడ్చి పెట్టినట్లు చెప్పాడు. అతడు చెప్పిన చోట తవ్విన  పోలీసులకు కుళ్లిపోయిన స్ధితిలో ఉన్న సుచిత్ర మృతదేహం లభ్యమయ్యింది.  ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా అది సుచిత్ర దేనని తేలింది. ప్రశాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.