కేరళ ఏనుగు మృతి కేసు : ముగ్గురి అరెస్ట్

  • Published By: murthy ,Published On : June 5, 2020 / 02:01 AM IST
కేరళ ఏనుగు మృతి కేసు : ముగ్గురి అరెస్ట్

కేరళలోని పాలక్కాడ్ జిల్లా సరిహద్దుల్లో  పైనాపిల్ లో పేలుడు పదార్ధాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును దారుణంగా చంపిన ఘటనలో   ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. ఏనుగు మృతి చెందిన ఘటనను సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏనుగు మృతి ఘటనపై కేంద్రమంత్రి జవడేకర్, ఎంపీ మనేకాగాంధీ, రతన్ టాటాతోపాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 

ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. పాలక్కాడ్ పోలీసులు, జిల్లా అటవీశాఖ అధికారులతో కూడిని ప్రత్యేక బృందం సంఘటన స్థలంలో దర్యాప్తు ప్రారంభించింది. ఏనుగు నది నీటిలో మునిగి ఊపిరితిత్తులు ఫెయిల్ అయి మరణించిందని పశువైద్యులు కళేబరానికి జరిపిన పోస్టుమార్టంలో తేల్చారు. 

కాగా కేరళలోని కొల్లం జిల్లా పతానపురం అటవీప్రాంతంలో గత ఏప్రిల్‌లో కూడా ఇలాంటి ఘట నే జరిగిందని అధికారులు తెలిపారు. దవడ విరిగి ఓ ఏనుగు మరణించడాన్ని తాము గుర్తించామన్నారు. పేలుడు పదార్థం తినడం వల్లే అది మరణించినట్టు భావిస్తున్నామని తెలిపారు. జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ గురువారం మరోసారి స్పందించారు. దోషులకు తగిన శిక్ష పడేలా చేస్తామన్నారు. పేలుడు పదార్థాలను ఆహారంగా ఇచ్చి మూగ జీవాలను చంపడం మన సంప్రదాయం కాదని ట్వీట్‌ చేశారు. అనుమానితుల్ని విచారిస్తున్నారని, న్యాయం గెలిచి తీరుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ట్వీట్‌ చేశారు.

కాగా…..ఈ ఘటనపై కేరళ చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి సురేంద్ర కుమార్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అది అడవి ఏనుగు అని, ఎవరూ దాని వద్దకు వెళ్లే సాహసం చేయకపోవచ్చని తాను భావిస్తున్నట్లు వివరించారు.

Read: ఈ ఏనుగుని కూడా అలాగే చంపేశారా?! ఇంత దారుణంగా గజరాజుల ఉసురు తీస్తున్నదెవరు?