రిసార్ట్ లో రేవ్ పార్టీ-పోలీసుల అదుపులో 60 మంది

రిసార్ట్ లో రేవ్ పార్టీ-పోలీసుల అదుపులో 60 మంది

Kerala Police busts rave party  : కేరళ వాగామోన్ లో ఆదివారం రాత్రి ఒక రిసార్ట్ లో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేసి 9 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ పార్టీకి 60 మంది హాజరైనట్లు తెలిసింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో కట్టపన డీఎస్పీ రాజ్ మోహన్ నేతృత్వంలోని పోలీసుల బృందం రిసార్ట్ పై దాడి చేసి మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకుంది.

ఈ దాడిలో   మాదక ద్రవ్యాలైన … ఎండీఎమ్ఏ, ఎస్టేసీ టాబ్లెట్, ఎస్టేసీ పౌడర్, ఎల్ఎస్టీ, చరస్, హషీష్, ఎల్ఎస్టీ స్టాంప్, మెత్ క్రిస్టల్, గంజాయి వంటి రకాలను స్వాధీనం చేసుకున్నారు. దాడి తర్వాత పార్టీకి హాజరైన 25 మంది మహిళలతో సహా మొత్తం 51 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ రిసార్ట్ ను స్ధానిక సీపీఐ నాయకుడు, ఎలప్పర పంచాయచీ మాజీ అధ్యక్షుడు షాజీ కుట్టక్కాడ్ నడుపుతున్నట్లు తెలిసింది. కాగా రిసార్ట్ లో మాదకద్రవ్యాల వాడకం గురించి తనకు తెలియదని ఆయన పోలీసులకు చెప్పాడు. నిర్వాహకులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో రేవ్ పార్టీ గురించి ప్రచారం చేశారు. అది గమనించిన పోలీసులు 100 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రిసార్ట్ పై దాడి చేశారు.

పోలీసులు అరెస్ట్ చేసిన నిర్వాహకులు  9మంది గతంలోనూ రేవ్ పార్టీలు నిర్వహించి అరెస్టైనట్లు పోలీసులు తెలిపారు. రిసార్ట్ నిర్వహిస్తున్న సీపీఐ నాయకుడిపై చర్యలు తీసుకుంటామని, ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తామని సీపీఐ తెలిపింది. రేవ్ పార్టీకి బెంగుళూరు, చెన్నైల నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా అయినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించుకున్నారు. పార్టీకి హజరైన వారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి హాజరయ్యారని పోలీసులు తెలిపారు.