భార్యా రూపవతి శత్రువు – పెళ్లైన ఆర్నెల్లకే భార్యను హత్య చేసిన భర్త

భార్యా రూపవతి శత్రువు – పెళ్లైన ఆర్నెల్లకే భార్యను హత్య చేసిన భర్త

Kozhikode : Husband beheads sleeping wife, Suspecting infidelity : భార్యా రూపవతి శత్రువు అన్నట్లు అందంగా ఉన్న భార్యపై అనుమానం పెంచుకున్న ఒక భర్త, పెళ్లైన ఆర్నెల్లకే భార్యను కిరాతకంగా నరికి హత్య చేసాడు.

కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కం మున్సిపాలిటీ, కొడియత్తూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని చెరువాడి పజంపరంబులో నివసించే సహీర్ కుట్టియాలి(30)కి ముహ్సిలా(20)తో గతేడాగది సెప్టెంబర్ 5వతేదీన వివాహం అయ్యింది. తల్లి తండ్రులు, నలుగురు సోదరులు. ఒక సోదరితో కలిసి సహీర్  ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాడు.

ఫిబ్రవరి 16, మంగళవారం తెల్లవారు ఝూమున అతని పడక గదిలోంచి పెద్ద శబ్దం వచ్చింది. అనంతరం అతని భార్య ఏడుపు వినిపించింది. పక్క గదిలో నిద్రిస్తున్న  తల్లి తండ్రులు ఆ శబ్దం విని, కుమారుడి గదికి వచ్చి తలుపు తీయమని కోరినా అతను తలుపు తీయలేదు. కొద్దిసేపటి తర్వాత తలుపు తీసుకుని రక్తపు మరకలున్న కత్తిచేత బట్టి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.

లోపలికి వెళ్లిన అతని తల్లి తండ్రులకు తమ కోడలు రక్తపు మడుగులో పడిఉండటం గమనించారు. అప్పటికే వారు తలుపు తీయమంటూ గట్టిగా అరవటం, తలుపులు బాదటంతో చుట్టు పక్కల ఉన్న బంధువులు, ఇంట్లోని మిగతా వారు నిద్రలేచారు. ఏం జరుగుతోందో అర్ధంకాక అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు.

ఇంట్లోంచి కత్తితో బయటకు వచ్చి పారిపోతున్న సహీర్ ను కొందరు బంధువులు వెంటపడి పరిగెత్తి పట్టుకున్నారు. సహీర్ తల్లి తండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపడిన అతని భార్య ముహ్సిలాను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గల్ఫ్ లో డ్రైవర్ గా పని చేసే సహీర్ కరోనా లాక్ డౌన్ కష్టాలతో భారత్ కు తిరిగి వచ్చాడు. భారత్ కు తిరిగి వచ్చిన సహీర్ పెయింటర్ గా పని చేస్తున్నాడు.  గతేడాది  సెప్టెంబర్ లో  ముహ్సిలాను వివాహం చేసుకున్నాడు. చూడచక్కని జంటగా అందరూ మెచ్చుకున్నారు. ఏనాడు భార్యా భర్తలిద్దరూ గొడవపడిన దాఖలాలు లేవు.

కానీ ఎందుకో సహీర్ కు భార్య ప్రవర్తనపై అనుమానం పెరిగిపోయింది. క్రమేపి అది అతడికి నిద్రలేకుండా చేయసాగింది. భార్య పై అనుమానం రాను రాను మరింత పెరిగి పోయింది. భార్యను హత్యచేసే ముందు సోమవారం రాత్రి కూడా అతను నిద్రపోలేదు.

పెళ్లైనప్పటి నుంచి అతను తన స్నేహితులను కూడా దూరం పెట్టసాగాడు. అతని ఫోన్ లోంచి తన స్నేహితుల నెంబర్లు కూడా డిలీట్ చేసినట్లు అతని స్నేహితులు చెప్పారు. పెళ్లికాక ముందు చాలా హ్యాపీగా ఉండేవాడని, అతను భార్యను హత్య చేశాడంటే నమ్మలేకుండా ఉన్నామని అతని స్నేహితులు వాపోయారు.

గత కొంతకాలంగా అతను మానసికంగా బాధపడుతున్నాడని, స్నేహితులతో కూడా ఎక్కువగా మాట్లాడటంలేదని, మమ్మల్ని తప్పించుకు తిరుగుతున్నాడని సహీర్ స్నేహితుడు రషీద్ చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.