బ్యాంకు చోరీ డబ్బుతో సినిమాలు : లలితా జువెలర్స్ దొంగ గురించి షాకింగ్ విషయాలు

తిరుచ్చిలో జరిగిన లలితా జ్యువెలరీ చోరీ కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న

  • Published By: veegamteam ,Published On : October 6, 2019 / 07:31 AM IST
బ్యాంకు చోరీ డబ్బుతో సినిమాలు : లలితా జువెలర్స్ దొంగ గురించి షాకింగ్ విషయాలు

తిరుచ్చిలో జరిగిన లలితా జ్యువెలరీ చోరీ కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న

తిరుచ్చిలో జరిగిన లలితా జ్యువెలరీ చోరీ కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. ప్రధాన నిందితుడు, దొంగల ముఠా నాయకుడు మురుగన్… భారత సరిహద్దులు దాటి విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు. దొంగిలించిన 10 కోట్ల విలువైన నగలతో ఉడాయించిన మురుగన్.. ఓ తమిళ యువ నటిని కూడా వెంటేసుకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఆ నటితో కలిసి అతడు ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాడని భావిస్తున్నారు.

ముఠా నాయకుడు, కేసు ప్రధాన నిందితుడు మురుగన్‌ నేర చరిత్రను పోలీసులు తవ్వారు. అవాక్కయ్యే విషయాలు తెలిశాయి. మురుగన్‌.. బ్యాంకులు, జ్యువెలరీ షాపుల్లో చోరీ చేసి కోట్లు గడించాడని… అతడికి చెన్నైలో లగ్జరీ బంగళాతోపాటు పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నాయని గుర్తించారు. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు, నగల దుకాణాలు, ఇళ్లలో ఇతడు చోరీలు చేశాడని.. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో చేతివాటం ప్రదర్శించాడని గుర్తించారు. అంతేకాదు… అతడు హెచ్‌ఐవీతో బాధపడుతున్న రోగి అని కూడా గుర్తించారు. అయితే.. ఇతడి వలలో ఆ నటి ఎలా పడిందన్న విషయం ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మరోవైపు… మురుగన్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలను శ్రీలంక పంపించారు పోలీసులు. అంతేకాదు చోరీ చేసిన సొమ్ముతో మురుగన్ సినిమాలు నిర్మించినట్టు పోలీసులకు తెలిసింది. బాలమురుగన్ ప్రొడక్షన్ పేరుతో సినిమా నిర్మాణాలు చేశాడని విచారణలో కనుగొన్నారు.

అక్షరజ్ఞానం లేకపోయినా ప్రణాళిక వేశాడంటే కోట్లు కొల్లగొట్టడమే మురుగన్ కి వెన్నతో పెట్టిన విద్య. తమిళనాడులోని తిరువారూర్‌కు చెందిన మురుగన్‌ అలియాస్‌ బాలమురుగన్‌ గోడలకు కన్నాలు వేసి చోరీ చేయడంలో సిద్ధహస్తుడు. ఏనాటికైనా కోటీశ్వరుడు కావాలని అడ్డదారి తొక్కి బ్యాంకులు, ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డాడు. తమిళనాడుతో పాటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అతడిపై పలు కేసులున్నాయి. 18 ఏళ్లకే సొంతింట్లోని టేప్‌ రికార్డరును ఎలా దొంగిలించాలనే విషయంపై ఆలోచించాడు. అది మొదలు చోరీల ప్రస్థానం కొనసాగింది. 2008లో ముఠాను ఏర్పాటుచేసి బెంగళూరులో తొలిసారి భారీ చోరీ చేశాడు. 2011లో ఓ చోరీ కేసులో బెంగళూరు పోలీసులు అతడిని అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాం మర్చాడు. సొంతిల్లు కొన్నాడు. సినిమాలంటే ఇష్టపడే మురుగన్ సొంతంగా సినిమా తీయాలనుకున్నాడు. రూ.50 లక్షలతో ‘బాలమురుగన్‌ ప్రొడక్షన్‌’ పేరిట సినీ నిర్మాణ కంపెనీ ప్రారంభించాడు. తెలుగులో ‘మనసా వినవే’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడని తెలుస్తోంది. ఆ చిత్రం 70శాతం నిర్మాణం పూర్తయ్యాక ఓ చోరీకేసులో చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీసులు 2016 ఫిబ్రవరిలో మురుగన్‌ను అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ‘ఆత్మ’ అనే మరో చిత్ర నిర్మాణం మొదలుపెట్టాడు.

* 2014 నవంబర్ 16న చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో రూ.2 కోట్లకు పైగా నగదు, పెద్దమొత్తంలో నగలు దొంగిలించాడు. 
* 2014 అక్టోబరులో తెలంగాణలోని ఘట్‌కేసర్‌ గ్రామీణ బ్యాంకులో రూ.35 లక్షలు దోచుకున్నాడు. 
* 2015లో సైబరాబాద్‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి భారీ మొత్తంలో నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.
* కర్ణాటకలోని పలు బ్యాంకుల్లోనూ దోపిడీ
* 2017లో చెన్నై అన్నానగర్‌, తిరుమంగలం ప్రాంతాల్లోని 17 ఇళ్లలో చోరీలు. 

అప్పట్లో మురుగన్‌ ముఠాను అరెస్టు చేసి 5 కిలోల బంగారాన్ని గ్రేటర్‌ చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వస్థలం తిరువారూర్‌కు వచ్చిన ప్రతిసారీ స్థానికులకు భారీగా ఆర్థిక సాయం చేస్తాడని, అందువల్ల అతడి గురించి పోలీసులకు ఎలాంటి సమాచారం అందడం లేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.