న్యాయవాదుల దంపతుల హత్య : ఏ 1 వెల్ది వసంతరావు, ఏ 2 కుంట శ్రీనివాస్

న్యాయవాదుల దంపతుల హత్య : ఏ 1 వెల్ది వసంతరావు, ఏ 2 కుంట శ్రీనివాస్

Lawyer couple murdered : న్యాయవాదుల దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో వామనరావు స్వగ్రామమైన గుంజపడుగు గ్రామానికి చెందిన వెల్ది వసంతరావు ఏ1 నిందితునిగా ఉన్నారు. ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా అక్కపాక కుమార్‌ పేర్లను ఎఫ్‌ఐర్‌లో నమోదు చేశారు పోలీసులు. వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమ స్వగ్రామం గుంజపడుగులో రామాలయం కమిటీ విషయంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి వామనరావు దంపతులు సంతకాలు సేకరించారని ఫిర్యాదులో తెలిపారు. కొడుకు, కోడలు హత్యపై మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత సమాచారం అందిందని తెలిపారు.

వామనరావు దంపతుల హత్యకు ఆయన స్వగ్రామం గుంజపడుగులో నెలకొన్న వివాదాలే కారణంగా భావిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కుంట శ్రీనివాస్‌ది కూడా ఈ గ్రామమే. ఇటీవల గ్రామంలో ఓ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు శ్రీనివాస్. అయితే పంచాయతీ అనుమతులు లేకుండానే ఇల్లు నిర్మాణం జరుగుతోందంటూ…అక్కడ ఓ ఫ్లెక్సీ వెలిసింది. అయితే ఫ్లెక్సీపై ఎలాంటి పేరు లేదు. ఇంటితో పాటు ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా ఓ కులదైవం ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నాడు శ్రీనివాస్. సంబంధిత కులానికి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. శ్రీనివాస్ ఇంటితో పాటు ఆ గుడి నిర్మాణం దగ్గర కూడా ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఈ ఫ్లెక్సీలపై కుంట శ్రీనివాస్ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. బుధవారం మంథని కోర్టుకు వచ్చిన వామనరావు దంపతులు..ఈ నిర్మాణాలకు సంబంధించి కొందరితో పిటిషన్లపై సంతకం తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

మరోవైపు…వామనరావు దంపతుల హత్య విషయంలో పోలీసుల శాఖ విచారణలో వేగం పెంచింది. హత్య జరిగిన స్థలంలో క్లూస్‌ సేకరించేందుకు ప్రత్యేక టీం రంగంలోకి దిగింది. మంథని – పెద్దపల్లి రూట్‌లో మారుతి నగర్‌ బస్టాప్‌ సమీపంలో హత్య జరిగిన స్థలాన్ని సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ బృందం పరిశీలించింది. హత్యకు సంబంధించిన క్లూస్‌ను వారు ఘటన స్థలం నుంచి సేకరించారు.