చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య… గత నెలలో యువతికి వేరే అబ్బాయితో వివాహం

10TV Telugu News

యువతియువకుడు ప్రేమించుకున్నారు. కానీ ఇరు కుటుంబాల పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. యువతికి ఆమె కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో పెళ్లి చేశారు. విడిపోయి బతకలేమనుకున్న ఆ ఇద్దరూ ఒకే చెట్టుకు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ఈ విషాధ ఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పూలపల్లి శివారులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన సార్ల కార్తీక్ (21), సారా మీనా (21) ఇంటర్ వరకు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో కలవొద్దని మందలించారు. 

అనంతరం మహేశ్వరం మండలం గట్టుపల్లికి చెందిన యువకుడితో మీనాకు గత నెలలో పెళ్లి చేశారు. అయినా కార్తీక్, మీనా ప్రేమ వ్యవహారం కొనసాగించారు. కార్తీక్  మంగళవారం బంధువు వివాహానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బైక్ పై వెళ్లారు. అత్తగారింట్లో ఉన్న మీనా కూడా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వెళ్లి పోయింది. సాయంత్రమైనా కోడలు ఇంటికి రాకపోవడంతో అత్తింటివారు యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 

కార్తీక్ కూడా రాత్రికి ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు అంతా వెతికారు. బుధవారం ఉదయం పూలపల్లి శివారులో యువతీయువకుడు చెట్టుకు ఉరి వేసుకున్నట్లు రైతులు గుర్తించారు. గ్రామ సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి వద్ద లభించిన గుర్తింపు కార్డులు, సెల్ ఫోన్స్ ఆధారంగా కార్తీక్, మీనాగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. రెండు కుటుంబాలకు సంబంధించిన సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. 

Read: మ‌రో నిర్భ‌య : AC బ‌స్సులో ఇద్దరు పిల్లలతో వెళ్తున్న మ‌హిళ‌పై అత్యాచారం