ఆవు కొవ్వు నుంచి కల్తీ నూనె తయారీ

మాంసం మాటున కల్తీ దందా మొదలుపెట్టారు. డబ్బాల్లో అనారోగ్య సమస్యలు నింపేసి.. ప్రజల డైనింగ్ టేబుళ్ల మీదకే జబ్బులను సరఫరా చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 11:19 AM IST
ఆవు కొవ్వు నుంచి కల్తీ నూనె తయారీ

మాంసం మాటున కల్తీ దందా మొదలుపెట్టారు. డబ్బాల్లో అనారోగ్య సమస్యలు నింపేసి.. ప్రజల డైనింగ్ టేబుళ్ల మీదకే జబ్బులను సరఫరా చేస్తున్నారు.

మాంసం మాటున కల్తీ దందా మొదలుపెట్టారు. డబ్బాల్లో అనారోగ్య సమస్యలు నింపేసి.. ప్రజల డైనింగ్ టేబుళ్ల మీదకే జబ్బులను సరఫరా చేస్తున్నారు. ఆవు కొవ్వును కరగబెట్టి.. వంట నూనెల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ కల్తీ దందా.. విశాఖ జిల్లాలో బయటపడింది. అనకాపల్లిలో కల్తీ నూనె కలకలం రేపింది. యథేచ్ఛగా గోవధ చేస్తూ.. మాంసాన్ని అమ్మడమే కాకుండా.. వాటి నుంచి కొవ్వును తీసి.. కల్తీ నూనెను తయారు చేస్తున్నారు. ఈ కేటుగాళ్ల గుట్టుని.. జీవీఎంసీ అధికారులు రట్టు చేశారు. అనకాపల్లిలోని స్లాటర్ హౌస్ దగ్గర వెలుగు చూసిన ఈ కల్తీ నూనె వ్యవహారం.. స్థానికంగా కలకలం రేపింది. కొన్నాళ్లుగా అనకాపల్లిలో గోవులను వధించి.. వాటి మాంసం అమ్ముతున్నారని అందరికీ తెలుసు. కానీ.. ఇప్పుడు వాటి కొవ్వు నుంచి నూనె తయారుచేసి.. కల్తీకి పాల్పడుతున్నారని బయటపడటం విస్మయానికి గురిచేస్తోంది.

అనకాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే దారిలో సుంకరమెట్ట దగ్గర.. ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి స్లాటర్ హౌస్‌ను నిర్మించింది. ప్రస్తుతం.. నిర్వహణ లోపంతో దీనిని మూసివేశారు. నిరుపయోగంగా ఉన్న ఈ భవనంలో.. కల్తీ మాఫియా దిగిపోయింది. అధికారుల కళ్లు గప్పి.. యథేచ్ఛగా గోవధ చేయడంతో పాటు కొవ్వుతో నూనె తయారుచేసి.. డబ్బాల్లో నింపుతున్నారు. ఎవరికీ అనుమానరం రాకుండా ఉండేలా.. భవనం గేట్లను మురికిగా ఉన్న వస్త్రాలతో కప్పేశారు. భవనం నిరుపయోగంగా ఉందని.. లోపలేమీ లేదనుకునేందుకు.. వ్యాపారులు ఇలా చేశారు. వార్డు పర్యటనలో భాగంగా.. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి పరిశీలన చేయగా.. విస్తుపోయే విషయాలు తెలిశాయి. పదేళ్ల క్రితం నిర్మించిన స్లాటర్ హౌస్‌లో ఏం జరుగుతుందో గుర్తించలేని స్థితిలో కిందిస్థాయి అధికారులున్నారు.

గోవధ తర్వాత వచ్చే కొవ్వును ఎండబెట్టి.. దానిని కరిగించి నూనెను తయారుచేసి.. డబ్బాల్లో నింపేస్తున్నారు. దీనిని.. హోటళ్లు, ధాబాలు, వీధుల్లో తినుబండారాలు అమ్మేవారికి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై.. జీవీఎంసీ అధికారులు విచారణ చేపట్టారు. స్లాటర్ హౌస్‌లో చిక్కిన నిందితుడు కొల్లి సూరిబాబును పోలీసులకు అప్పగించారు. ఈ కల్తీ వ్యాపారంలో.. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఈ కల్తీ వ్యవహారంలో.. వేపచేదు రమణ అనే వ్యక్తి ప్రమేయం ఉందని గుర్తించి.. పోలీసులు కేసు నమోదు చేశారు. సబ్బుల్లో.. ఆవు కొవ్వుతో తయారుచేసే నూనె వాడతారని.. ఈ కల్తీ నూనెను వారికే అమ్ముతున్నట్లు నిందితులు విచారణలోతెలిపినట్లు తెలుస్తోంది. ఐతే.. ఎవరెవరికి ఈ కల్తీనూనెను అమ్ముతున్నారన్న కోణంలో.. దర్యాప్తు చేస్తున్నారు.

అనకాపల్లితో పాటు విశాఖలోనూ.. మాంసం అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు జోనల్ కమిషనర్. మేకలను కబేళాకుతీసుకొచ్చి.. పరిశీలించాకే అమ్మకాలు చేసేలాచర్యలు తీసుకుంటామన్నారు. దీనికోసం.. స్లాటర్ హౌస్‌లో వసతులు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు.  ప్రస్తుతానికి ఈ స్లాటర్ హౌస్‌ను సీజ్‌ చేస్తున్నామని.. వసతులు మెరుగుపరిచి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

కల్తీ నూనెతో చేసిన వంటకాలు తింటే.. ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు డాక్టర్లు. గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు త్వరగా ఎటాక్ చేసే అవకాశం ఉందని తెలిపారు. గోవులను వధిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక.. వాటి కొవ్వుతో నూనె తయారుచేయడం దారుణమన్నారు. దీనివల్ల.. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.