మాదాపూర్‌లో బాలుడి మిస్సింగ్‌ కేసు సుఖాంతం, అర్థరాత్రి 2 గంటలకు హైవేపై బాబుని గుర్తించిన పోలీసులు

  • Published By: naveen ,Published On : October 6, 2020 / 12:43 PM IST
మాదాపూర్‌లో బాలుడి మిస్సింగ్‌ కేసు సుఖాంతం, అర్థరాత్రి 2 గంటలకు హైవేపై బాబుని గుర్తించిన పోలీసులు

madhapur boy safe: హైదరాబాద్‌ మాదాపూర్‌లో నాలుగేళ్ల బాలుడి మిస్సింగ్‌ కేసు సుఖాంతమైంది. అర్థరాత్రి 2 గంటల సమయంలో మేడిపల్లి దగ్గర నేనావత్ మోక్షా నాయక్ ను గుర్తించారు పోలీసులు. మోక్షా నాయక్ ఆదివారం(అక్టోబర్ 4,2020) మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. కిషన్‌ అనే వ్యక్తిపై బాబు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కిషన్‌ కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలోనే బాలుడి ఆచూకీ లభ్యమైంది. భయంతోనే కిషన్‌… బాబుని మేడిపల్లి దగ్గర వదిలివెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న కిషన్‌ కోసం గాలిస్తున్నారు.

నల్లగొండ జిల్లాకు చెందిన రాములు నాయక్‌ 2019లో మాదాపూర్‌కు వలస వచ్చాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రాములు కుమారుడు నేనావత్‌ మోక్ష(4) ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆడుకుంటూ ఇంటి బయటికి వచ్చాడు. కాసేపటి తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో బాబు కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన పోలీసులు బాబు కోసం గాలింపు చేపట్టారు. కాగా, రాములు నాయక్ ఇంటి పక్కనే భవన నిర్మాణం కోసం ఏడాది క్రితం సెల్లార్‌ గుంత తవ్వి వదిలేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంత నిండింది. బాలుడు ఆ గుంతలో పడి ఉండొచ్చని స్థానికులు, పోలీసులు అనుమానించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు సెల్లార్‌లోని నీటిని తోడి బాబు కోసం గాలించారు. అయినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రుల్లో మరింత ఆందోళ‌న‌ పెరిగింది.

కాగా, తమ బాబుని ఎవరో కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. చివరికి వారి ఆరోపణలే నిజమయ్యాయి. బాబు మిస్సింగ్ గురించి మీడియాలో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు మీడియా.. దీంతో భయపడ్డ కిడ్నాపర్ బాలుడిని వదిలి పరారైనట్టు తెలుస్తోంది. బాలుడిని గుర్తించిన హైవే పెట్రోలింగ్ పోలీసులు, మేడిపల్లి పోలీసులకి అప్పగించారు. బాలుడు క్షేమంగా దొరకడంతో పోలీసులు, కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ప్రస్తుం కిడ్నాపర్ ని పట్టుకునే పనిలో ఉన్నారు.