పంటను అమ్ముకునేందుకు…6రోజులు క్యూలో నిలబడి రైతు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : May 27, 2020 / 02:17 PM IST
పంటను అమ్ముకునేందుకు…6రోజులు క్యూలో నిలబడి రైతు మృతి

కష్టపడి,చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకునేందుకు ఆరు రోజుల పాటు కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిలిచిన రైతు గుండెపోటుతో మరణించిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. అగర్‌ మాల్వా జిల్లాలోని మల్వాసా గ్రామానికి చెందిన ప్రేమ్ సింగ్ అనే మండు వేసవిలో6రోజుల పాటు తన గోధుమ పంటను అమ్ముకునేందుకు తూకం కోసం క్యూలో వేచిచూస్తూ కుప్పకూలిపోయాడు. సరిగ్గా తన గోధుమలను తూచే సమయానికే ప్రేంసింగ్‌ ప్రాణాలు కోల్పోడం బాధించే విషయం. కొనుగోలు కేంద్రాల వద్ద పొడవాటి క్యూలు, అధికారుల నిర్వహణా వైఫల్యంతో రైతు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

పండించిన గోధుమలను తీసకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జలరా కొనుగోలు కేంద్రానికి రావాలంటూ ప్రేమ్ సింగ్‌ ఫోన్ కు స్థానిక యంత్రాంగం నుంచి ఈ నెల 19న ఓ మెసేజ్ వచ్చింది. దీంతో అక్కడకు చేరుకుని నాలుగు రోజుల పాటు వేచిచూసిన తర్వాత తనోడియా కొనుగోలు కేంద్రానికి వెళ్లాలని అధికారులు సూచించడంతో మే 24 వరకూ అక్కడ పడిగాపులు కాశాడు ప్రేమ్ సింగ్.

25న ఎట్టకేలకు అతడి పంటను తూకం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యే లోగానే తనకు అసౌకర్యంగా ఉందని అంటూ ప్రేమ్ సింగ్‌ కుప్పకూలాడు. అధికారులు స్ధానిక హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మరణించాడని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. గుండె పోటుతో ప్రేంసింగ్‌ మరణించాడని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందని, ప్రభుత్వ పథకం కింద ఆయన కుటుంబానికి రూ 4 లక్షల పరిహారం అందించామని జిల్లా కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.ప్రేమ్ సింగ్‌ తొలి ట్రాలీని తూకం వేశామని, రెండో ట్రాలీ తూకంపై ఉండగానే ఆయన కుప్పకూలి స్పృహ కోల్పోయారని తనోడియా కొనుగోలు కేంద్రం మేనేజర్‌ సంజయ్‌ కార్పెంటర్‌ తెలిపారు.