టీవీ సీరియల్ ఇన్స్పిరేషన్ : ఒక నేరం తప్పించుకునేందుకు మరో నేరం

  • Published By: chvmurthy ,Published On : March 29, 2020 / 07:30 AM IST
టీవీ సీరియల్ ఇన్స్పిరేషన్ : ఒక నేరం తప్పించుకునేందుకు మరో నేరం

మహారాష్ట్రలోని హంగార్గ్‌ ప్రాంతంలోని షోలాపూర్‌ రోడ్‌కు చెందిన రసూల్ సయ్యద్ అక్కడి ఓ ఫంక్షన్‌ హాల్‌లో రోజు వారి కూలీగా పని చేసేవాడు. ఎన్నాళ్లిలా కూలీ బతుకుతో జీవితం గడుపుతాం….విలాసవంతంగా బతకాలనుకున్నాడు. డబ్బును తేలిగ్గా సంపాదించాలనుకున్నాడు.  తన మనసులో మాటను మరో ఇద్దరితో పంచుకున్నాడు. అందరిదీ ఒకే ఆలోచన అయ్యేసరికి ఈజీ మనీ కోసం ప్లాన్ చేశారు. ముగ్గురు కలిసి 2016 లో ఒక దోపిడీకి పాల్పడ్డారు.

పెట్రోల్ బంకులో పనిచేసే ఉద్యోగి సంస్ధ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయటానికి వెళుతుండగా అతని వద్ద బ్యాగులో ఉన్న రూ.3.2 లక్షలు తీసుకుని పరారయ్యారు. ఈ  దోపిడీకి సంబంధించి అంబజోగాయ్ పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదయ్యింది.

కేసును పకడ్బందీగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు…..నిందితులను అరెస్టు చేసి…సాక్ష్యాధారాలతో న్యాయ స్ధానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితులు బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ప్రస్తుతం తుది దశలో ఉంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ  దోపిడీ కేసులో తనకు శిక్ష  పడుతుందని భావించిన రసూల్ ఆ శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేయటం మొదలెట్టాడు.  

రసూల్ కి అంబజోగాయ్  ప్రాంతానికే చెందిన అలీ ఇస్మాయిల్ షేక్  తో పరిచయం ఉంది. ఇంచుమించు ఇస్మాయిల్ రసూల్ లాగానే ఉంటాడు.  మనిషి ఒడ్డు, పొడుగు, ఫీచర్స్ అన్నీ రసూల్ లాగానే ఉండే ఇస్మాయిల్ ను చూడగానే రసూల్ కు ఆలోచన మొదలైంది. ఇస్మాయిల్ ను చంపేసి తాను  చనిపోయినట్లు సృష్టించి దేశంలో ఎక్కడికైనా పారిపోదామని నిర్ణయించుకున్నాడు.

మార్చి 17 న మద్యం తాగుదామని ఇస్మాయిల్ ను అక్కడికి సమీపంలోని రైల్వే స్టేషన్ కు  తీసుకువెళ్లాడు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న ఇస్మాయిల్ తలపై బండరాయితో కొట్టి చంపి…మొఖంపై ఆనవాళ్లు లేకుండా చితక్కొట్టాడు రసూల్. ఇస్మాయిల్ చనిపోయాడని నిర్ధారించుకుని తన బట్టలు ఇస్మాయిల్ కు తొడిగి తన సెల్ ఫోన్,  పర్సు ఇతర వస్తువుల్ని ఇస్మాయిల్ శవం వద్ద పడేశాడు. 

నేరుగా ఇంటికి వెళ్లి  చేసిన పని తన భార్యకు చెప్పి  కొన్నాళ్లపాటు ఎక్కడో ఒకచోట తలదాచుకుని వస్తానని చెప్పి రసూల్  ఇంటినుంచి వచ్చేశాడు. అంబజోగాయ్ రైల్వే స్టేషన్ కు చేరుకుని  అక్కడ కనిపించిన పరిచయస్తుడి  సెల్ ఫోన్ ద్వారా హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉండే  మరోక పరిచయస్తుడికి ఫోన్ చేసి …హైదరాబాద్ వస్తున్నానని… తనకు ఉద్యోగం కావాలని  కోరాడు.

ఆ వ్యక్తి సరేననటంతో హైదరాబాద్ వచ్చి రాజేంద్రనగర్ లోని స్నేహితుడి వద్దకు చేరుకున్నాడు. స్నేహితుడి రికమెండేషన్ తో సంతోష్ నగర్  పోలీసు స్టేషన్ పరిధిలోని రియాసత్ నగర్ గ్రేవ్ యార్డు సమీపంలోని ఒక ఫంక్షన్ హాలులో పనికి చేరాడు. 

ఇలా ఉండగా మార్చి18 వ తేదీన అంబజోగాయ్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు పట్టలేని శవం పడి ఉందని సమాచారం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. శవం వద్ద లభించిన ఆధారాలతో రసూల్ భార్యను పిలిచి శవాన్ని చూపించారు.

విషయం ముందే తెలిసిన ఆమె తన భర్త శవమేనని అంగీకరించంటతో పోస్టు మార్టం అనంతరం శవాన్ని ఆమెకు అప్పగించారు. రసూల్ భార్య శవానికి అంత్యక్రియలు కూడా నిర్వహించటంతో అంతా రసూల్ మరణించాడనే అనుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకు ఇస్మాయిల్ కనిపించటం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇస్మాయిల్ ఫోటో పట్టుకుని విచారణ ప్రారంభించారు. ఇస్మాయిల్ ఫోటో చూడగా..చూడగా.. ఇటీవలే మరణించిన రసూల్  పోలికలు కనిపెట్టాడు అంబాజోగాయ్ ఇన్స్ పెక్టర్ హర్షపొద్దార్ . వెంటనే రసూల్ భార్యపై నిఘా పెట్టాడు.  భర్తను కోల్పోయిన భాధ రసూల్ భార్యలో కనిపించకపోవటంతో అనుమానం మరింత బలపడింది.

వెంటనే రైల్వే స్టేషన్ పరిసరాల్లోని  సీసీ కెమేరాలను  పరిశీలించారు. అక్కడ రసూల్ కు ఫోన్ ఇచ్చిన వ్యక్తిని గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆరోజు రైల్వే స్టేషన్ నుంచి రసూల్ కాల్ చేసిన నెంబరు గుర్తించారు. అది హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లోని వ్యక్తిదిగా గుర్తించారు. కేసు విచారణ కోసం ఒక ప్రత్యేక బృందం మార్చి 25, బుధవారం నాడు హైదరాబాద్ వచ్చింది.

హైదరాబాద్ టాస్క్‌ ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తి సహాయంతో…  సౌత్‌జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలోని టీమ్‌ రాజేంద్రనగర్‌లోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో గురువారం రియాసత్‌నగర్‌కు వెళ్లి రసూల్‌ను అరెస్టు చేశారు.  అక్కడి నుంచి అంబజోగాయ్ తీసుకువెళ్లిన పోలీసులు శుక్రవారం రసూల్ ను కోర్టులో హజరు పరిచారు. న్యాయమూర్తి అనుమతితో నాలుగు రోజులు రసూల్ ని విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు.  

విచారణలో రసూల్ చెప్పిన విషయం విని పోలీసులు  ఆశ్చర్యపోయారు. ఇస్మాయిల్ ను హత్య చేయటానికి తనకు ఓ ప్రముఖ హిందీ చానల్‌లో వచ్చిన సీరియల్‌లోని సన్నివేశాలే స్ఫూర్తి ఇచ్చాయని, వాటిలో చూసినట్టే ఇస్మాయిల్ ను చంపి తన స్థానంలో ఉంచానని చెప్పుకొచ్చాడు. రసూల్ ని పట్టుకోవడానికి సహకరించిన హైదరాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ సౌత్‌ జోన్‌ టీమ్‌కు అంబజోగాయ్‌ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.