Maheshwaram Land Scam : మహేశ్వరం తహసీల్దార్ భూ దందా.. రూ.200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి ఎసరు

ధరిణి వచ్చింది తెలంగాణలో భూ సమస్యలకు చెచ్ పడుతుంది. పూర్తి పారదర్శకతతో భూముల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధరణి వచ్చి రేండేళ్లవుతున్నా ఇప్పటికీ భూసమస్యలు వెక్కిరిస్తున్నాయి.

Maheshwaram Land Scam : ధరిణి వచ్చింది తెలంగాణలో భూ సమస్యలకు చెక్ పడుతుంది. పూర్తి పారదర్శకతతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధరణి వచ్చి రేండేళ్లవుతున్నా ఇప్పటికీ భూ సమస్యలు వెక్కిరిస్తున్నాయి. కొంతమంది అధికారులు కోట్ల రూపాయల భూ దందాకు పాల్పడుతున్నారు. దీనికి నిలువెత్తు సాక్ష్యంగా మహేశ్వరం మండంలోని సర్కారు భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో ఎమ్మార్వో పాత్రధారిగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. రాజధాని శివారు.. అది కూడా త్వరలోనే ప్రారంభం కానున్న ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఫార్మాసిటీ ప్రాంతానికి సమీపంలో భూ దందాకు తెరలేపారు.

నాగారం గ్రామంలోని సర్వే నెంబర్ 181లో మొత్తం 101 ఎకరాలు భూమి ఉంది. దీనిలో 52 ఎకరాల గైరాన్ భూమి కాగా, మిగతాది భూదాన్ ల్యాండ్. గైరాన్ భూమి ప్రభుత్వ రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉంది. ధరణి వచ్చిన తర్వాత ఇది ప్రొహిబిటెడ్ లిస్టులో కొనసాగింది. అయితే ఈ సర్వే నెంబర్ లోని గైరాన్ భూమి అహ్మద్ జబర్దస్త్ ఖాన్ పేరుతో ఉందని ఆయన కుమారుడు మున్వర్ ఖాన్ కొన్ని పత్రాలను తెర మీదకు తీసుకొచ్చి గతంలో రంగారెడ్డి కలెక్టర్ కు పిటిషన్ పెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో దీనిపై విచారణ చేసిన మహేశ్వరం తహసీల్దార్ జ్యోతి అవి పట్టా భూములని రిపోర్టు ఇచ్చారు.

TS High Court: మంచిరేవులలో ఆ 142 ఎకరాల భూమి ప్రభుత్వానిదే: పదేళ్ల తరువాత హైకోర్ట్ తీర్పు

అంతేకాదు ఆ భూములను ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారింది. పీవోబీ లిస్టులో ఉండే కోట్ల విలువైన సర్కార్ భూమిని ఎలా రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెడతారంటూ రంగారెడ్డి జిల్లా 17వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారించిన కోర్టు.. ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసిన వారిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. దీంతో కందుకూరు ఎమ్మార్వో జ్యోతి, రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ యజమాని శ్రీధరెడ్డిపై మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

అంతేకాదు దీనిపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు సైతం సీఎస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో ఈ భూ దందా ఇప్పుడు రెవెన్యూ వర్గాలను వణికిస్తోంది. దశాబ్ధాలుగా నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? పీవోబీ లిస్టు నుంచి తొలగించే అధికారం లేని తహసీల్దార్ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్న దానిపై చర్చ నడుస్తోంది. ఇందులో ఎమ్మార్వో జ్యోతి పాత్రధారి కాగా, దీని వెనక ఎవరున్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Lord Shiva: ప్రభుత్వభూమిని ఆక్రమించారంటూ “పరమశివుడికే” కోర్టు నోటీసు

కేవలం జిల్లా కలెక్టర్ కు మాత్రమే పీవోబీని తొలగించే అధికారం ధరణిలో కట్టబెట్టింది తెలంగాణ సర్కార్. ఈ వ్యవహారం జరిగినప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా అమోయ్ కుమార్ ఉన్నారు. దీంతో ఈ భూదందా ఎపిసోడ్ ధరణిపైనే పలు కొత్త అనుమానాలకు తావిస్తోంది. దాదాపు రూ.2 వందల కోట్లు విలువ చేసే సర్కార్ భూమి చేతులు మారటం వెనుక రెవెన్యూ శాఖలో పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు కోట్ల అవినీతి జరిగివుండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు