ఇన్సూరెన్స్ ఏజెంట్ ను హనీ ట్రాప్ చేసిన మహిళ..17లక్షల నగదు, 5లక్షల బంగారం వసూలు

ఇన్సూరెన్స్ ఏజెంట్ ను హనీ ట్రాప్ చేసిన మహిళ..17లక్షల నగదు, 5లక్షల బంగారం వసూలు

Malyalee woman lays honey trap masquerading as sub collector, dupes Rs.17 Lakh : ట్రైనీ కలెక్టర్ గా పరిచయం చేసుకుని ఇన్సూరెన్స్ ఏజెంట్ ను హానీ ట్రాప్ చేసి 17 లక్షల రూపాయల నగదు, 5లక్షల రూపాయల విలువైన బంగారం దోచుకున్న మహిళను త్రిసూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్టే చేయటానికి వెళ్లిన పోలీసులను కూడా తాను రక్షణశాఖ ఉద్యోగినని చెప్పిబెదరించటం కొసమెరుపు.

త్రిసూర్ కు చెందిన ధన్యాబాలన్(33) అనే మహిళ నోయిడాలో నివసిస్తోంది. ఎంబీఏ పాసైన ధన్యాబాలన్ మలయాళం, హిందీ,ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. కొద్ది నెలల క్రితం ఆమె త్రిసూర్ వెళ్లి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కు ఫోన్ చేసి తాను ట్రైనీ కలెక్టర్ అని, ఇన్సూరెన్స్ చేయించుకోవాలి రమ్మనమని చెప్పి తాను ఉన్న హోటల్ కు పిలిపించుకుంది.

తన వివరాలు అన్నీ చెప్పింది. ట్రైనీ కలెక్టర్ అంది. పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకోవచ్చని అతను ఆమెకు సూచించాడు. అతనితో అన్నివిషయాలు మాట్లాడుతూ…. సన్నిహితంగా  మెలిగింది. ధన్యాబాలన్ తీసుకునే పాలసీతో పెద్ద మొత్తంలో కమీషన్ వస్తుందని ఆశ పడిన ఏజెంట్ కూడా ఆమెతో కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యాడు.

ఇన్సూరెన్స్ విషయాలు మాట్లాడుతూ, అతనితో చనువుగా ఉంటూ కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలను తీసింది. అనంతరం ఇన్సూరెన్స్ ఏజెంట్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను వాట్సప్ కు పంపించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించటం మొదలెట్టింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈక్రమంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ నుంచి 17 లక్షల రూపాయల నగదు, 5లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు వసూలు చేసింది. మళ్లీ,మళ్లీ డబ్బులు డిమాండ్ చేయటంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్నత్రిసూర్ పోలీసులు విచారణ చేపట్టారు.

ధన్యాబాలన్ ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఢిల్లీలో ఉన్న కొంత మంది మళయాళీల సహాయంతో ఆమెను అరెస్ట్ చేయటానికి వెళ్లిన పోలీసులకు తాను రక్షణ శాఖ ఉద్యోగినని చెప్పి వారిని బెదిరించి, తప్పుదోవ పట్టించాలని చూసింది.

ఆమె నివాసం ఉంటున్న ప్రాంతంలో ఆదాయపన్ను శాఖ లో  ఉన్నతోద్యోగినని   చెప్పినట్లు త్రిసూర్ పోలీసులు కనుగొన్నారు. హిందీ,ఇంగ్లీషు, మలయాళ భాషల్లో మాట్లాడుతూ పోలీసులను హడలగొట్టించి వారిని తప్పుదోవ పట్టించాలని చూసింది. కానీ త్రిసూర్ పోలీసులు ఆమెకు సాక్ష్యాలు చూపించి అరెస్ట్ చేసి త్రిసూర్ తీసుకువెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది.