పుట్టిన రోజే ఆత్మహత్య : భార్య, కూతురిని సరిగా చూసుకోలేకపోతున్నానే బాధతో

  • Published By: veegamteam ,Published On : November 2, 2019 / 04:03 AM IST
పుట్టిన రోజే ఆత్మహత్య : భార్య, కూతురిని సరిగా చూసుకోలేకపోతున్నానే బాధతో

విజయనగరం జిల్లా సాలూరులో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పుట్టిన రోజే ఓ లారీ క్లీనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యను సరిగా చూసుకోలేకపోతున్నా.. రెండేళ్ల కూతురి కనీస అవసరాలను సైతం తీర్చలేకపోతున్నా అనే బాధతో అతడీ పని చేశాడు. కూతురు ఊయల తాడునే ఉరితాడుగా మార్చుకుని తనువు చాలించాడు. భర్త మృతితో భార్య కన్నీటిపర్యంతం అయ్యింది. ఆ ఇంట్లోనే కాదు స్థానికంగానూ విషాదచాయలు అలుముకున్నాయి. చుట్టుపక్కల వాళ్లు కూడా కంటతడి పెట్టారు.

దాసరివీధిలో నివాసం ఉంటున్న లక్ష్మణరావు(30) లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల లారీకి సరిగా కిరాయిలు రావడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. పూట గడవటం కూడా కష్టంగా మారింది. గురువారం రాత్రి నందెన్న ఉత్సవాలను భార్య సరస్వతి, కుమార్తెతో చూసి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భార్య, కూతురిని బయటకు పంపించాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయాడు. ఇంటికి వచ్చి చూసిన భార్య షాక్ కి గురైంది. ఎంత పని చేశావు అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన స్థానికులను కూడా కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.