చంటి బిడ్డ తల్లి రైలులో సీటు అడిగిందని.. కొట్టి చంపారు

చంటి బిడ్డ తల్లి రైలులో సీటు అడిగిందని.. కొట్టి చంపారు

మనదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీల్లో ప్రయాణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. గర్భిణీలకు కూడా సీటు సాయం చేసేందుకు దాదాపు ఎవ్వరూ ముందుకురారు. చాలా తక్కువ మందే పెద్దవారు,గర్భిణీ,చిన్నపిల్లలున్నారు అంటూ తమ సీటుని వదులుకుంటుంటారు. అయితే భార్య, రెండేళ్ల కూతురితో రైలెక్కిన ఓ వ్యక్తి.. పాపను ఎత్తుకుని ఉన్న తన భార్య కోసం సీటు ఇమ్మని మరో ప్రయాణికురాలిని అడిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది.

ముంబైలోని కళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన సాగర్‌(26) తన భార్య, రెండేళ్ల కుమార్తెతో కలిసి ముంబై-లతూర్ మధ్య నడిచే బీదర్ ఎక్స్ ప్రెస్ రైలెక్కాడు. జనరల్‌ బోగీలో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తన భార్య కూర్చునేందుకు కాస్త సీటు సర్దుబాటు చేసుకోవాలని కూర్చుని ఉన్న ఓ మహిళను కోరాడు. ఇందుకు సదరు మహిళ నిరాకరించి సాగర్‌తో వాగ్వాదానికి దిగింది. వాగ్వాదం కాస్త వివాదంగా మారి ఘర్షణ నెలకొంది. ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో మహిళకు సంబంధించిన 12 మంది సాగర్‌పై దాడికి దిగారు.

పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. బాధితుడి భార్య కొట్టొద్దని వేడుకుంటున్నా కనికరించకుండా గంటపాటు విపరీతంగా కొట్టారు. పూణే నుంచి దౌండ్ స్టేషన్ వరకు బాధితుడిపై దాడిని ఆపలేదు. దౌండ్ స్టేషన్‌లో రైల్వే పోలీసులు సాగర్‌ను హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. షోలాపూర్‌ జిల్లాలో బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సాగర్ కుటుంబం వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!