మిస్టరీగా మంగళగిరి యువతి గ్యాంగ్ రేప్, మర్డర్‌ కేసు

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 11:36 AM IST
మిస్టరీగా మంగళగిరి యువతి గ్యాంగ్ రేప్, మర్డర్‌ కేసు

గుంటూరు : మంగళగిరిలోని ప్రేమ జంటపై దాడి కేసులో మిస్టరీ వీడటం లేదు. రోజులు గడుస్తున్నా కొద్ది అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక హత్య కేసులో మంగళగిరి పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది.  ఎవరైనా అనుమానాస్పదంగా మృతి చెందితే పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించడం పోలీసుల విధి. కానీ.. అమరావతి టౌన్‌షిప్‌లో జరిగిన జ్యోతి హత్య కేసులో మాత్రం చాలా అలసత్వంగా వ్యవహరించారు. కనీసం, ఆమె దుస్తులను కూడా సేకరించకుండానే.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో తమ సంప్రదాయాల ప్రకారం నిన్న జ్యోతి మృతదేహాన్ని ఖననం చేశారు కుటుంబ సభ్యులు. ఇవాళ ఆధారాలను సేకరించలేదని గుర్తించిన పోలీసులు హడావుడిగా.. జ్యోతి మృతదేహాన్ని బయటకు తీయించారు. దీనిపై జ్యోతి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 

ఈ కేసు విచారణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ జ్యోతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మీడియా కంట పడకుండా మృతదేహంపై వస్త్రాలు తీసుకురమ్మని మంగళగిరి పోలీసులు చెప్పారని…దీనిపై తమకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. న్యాయం చేస్తారనే నమ్మకంతో మృత దేహాన్ని బయటికి తీశామని చెప్పారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులే హత్య చేశారంటూ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నేతలు గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావును కలిశారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని…ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. జ్యోతి కేసు దర్యాప్తులో అనేక అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు, గిరిజన సంఘాల నేతలు అన్నారు. 

 

3 రోజులు గడుస్తున్నా.. జ్యోతి మర్డర్ కేసు మిస్టరీ వీడలేదు. అసలు జ్యోతిని చంపిందెవరు..? ప్రేమికులపై దాడి చేసిందెవరు..? అటుగా వెళ్లిన ఆకతాయిలే అడ్డగించి దాడి చేశారా..? లేక బ్లేడ్‌ బ్యాచ్‌లాంటి దొంగలు వీరిని అటకాయించి నగల కోసం దాడి చేశారా..? లేకుంటే శ్రీనివాసరావే జ్యోతిని హత్య చేసి నాటకమాడుతున్నాడా..? ప్రేమ ఇష్టం లేని జ్యోతి సోదరుడే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడా..? ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. మంగళగిరి మర్డర్‌ అంతా పెద్ద మిస్టరీగానే కనిపిస్తోంది.

హత్య కేసులో కీలకమైన ఆధారం ఇంత వరకు లభించలేదు. అసలు హత్యకు ఉపయోగించిన ఆయుధమేంటి? కర్రతో దాడి చేశారా.. లేక పదునైన ఆయుధాన్ని ఉపయోగించారా..? హత్యకు ఉపయోగించిన ఆయుధం ఎక్కడుంది..? దీనిపై పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఘటనా స్థలం నుంచి కూడా ఎలాంటి ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. తాగుబోతులు దాడి చేసినట్టుగా ప్రచారం జరిగింది. బీర్‌ బాటిల్స్‌తో దాడి జరిగినట్టుగా అనుమానించారు. అయితే అక్కడ ఉన్న బీర్‌ బాటిల్స్‌కు ఎలాంటి రక్తపు మరకలు లేవు. అవి కూడా ఎప్పుడో తాగిన బాటిల్స్‌ లాగానే కనిపించాయి. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందా అనే సందేహాన్ని కలిగిస్తోంది.

 

హత్యలో మరో మిస్టరీ ఏంటంటే.. ఘటనా స్థలంలో పెనుగులాట జరిగిన దాఖలాలే లేవు. గడ్డి అణిగినట్టు కానీ.. మట్టి చెదిరినట్టు కానీ ఆనవాళ్లు లేవు. అంటే ప్రతిఘటన లేకుండానే హత్య జరిగిందా..? ఎవరైనా దాడి చేస్తే.. శ్రీనివాసరావు గానీ, జ్యోతి గానీ వారిని ఎదిరించడానికి ప్రయత్నించి ఉండాలి. కానీ.. అలాంటి సీన్‌ అక్కడ కనిపించడం లేదు. దుండగులు ఇద్దరి పై దాడి చేస్తే.. జ్యోతి మాత్రమే చనిపోయేంత గాయపడింది. అంటే శ్రీనివాసరావు.. దాడిని ఆపే ప్రయత్నం చేయలేదా..? ఆపి ఉంటే అతన్ని కూడా తీవ్రంగా గాయపరిచి ఉండాలి కదా..? మరి స్వల్ప గాయాలతో శ్రీనివాసరావు ఎలా బయట పడ్డాడు? లేదంటే పథకం ప్రకారం శ్రీనివాసరావే దాడి చేయించాడా..? తనను తక్కువ గాయపరిచి.. జ్యోతిని హత్య చేయాలని కిరాయి హంతకులతో డీల్‌ కుదుర్చుకున్నాడా..? ఈ అనుమానాన్నే వ్యక్తం చేస్తున్నారు జ్యోతి కుటుంబ సభ్యులు.

 
రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో జ్యోతికి ఫోన్‌ చేస్తే పది నిమిషాల్లో వస్తాను అని చెప్పినట్టు జ్యోతి సోదరుడు చెబుతున్నాడు. అయితే నవులూరు స్టేడియం నుంచి మహానాడుకు పదినిమిషాల్లో వెళ్లే అవకాశం లేదు. మరి పది నిమిషాల్లో వెళ్లగలనని జ్యోతి ఎలా అనుకుంది..? ఆ ఫోన్ కాల్ తర్వాతే.. జ్యోతి హత్య జరిగింది.. స్నేహితురాలు పదే పదే ఫోన్‌ చేయడం వల్లనే జ్యోతి వెళ్లినట్టు సోదరుడు చెబుతున్నాడు. శ్రీనివాసరావు పిలిస్తే రాదు కాబట్టి.. స్నేహితురాలితో ఫోన్‌ చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…? శ్రీనివాసరావు.. జ్యోతి కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదే నిజమైతే.. సర్టిఫికెట్ల కోసం కాలేజ్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన జ్యోతి.. అతనితో కలిసి ఎలా తిరిగింది. అతని బండి ఎలా ఎక్కింది..?  ఇద్దరు కలిసి లంచ్‌ ఎలా చేశారు..? సాయంత్రం నవులూరు వైపుకు ఎందుకు వెళ్లారు..?

 
శ్రీనివాసరావుకు జ్యోతికి మధ్య పెళ్లికి సంబంధించి వాగ్వాదం ఏమైనా జరిగిందా..? పెళ్లి చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి తెచ్చిందా..? దానికి ఒప్పుకోని శ్రీనివాసరావు ఆ కోపంలోనే దాడి చేశాడా..? బలమైన గాయం కావడంతో .. జ్యోతి మరణించిందా..? ఇవే ఈ కేసులో కీలకమైన ప్రశ్నలు. వీటికి సమాధానాలు చిక్కితే.. ఈ కేసు చిక్కుముడి దాదాపుగా విడిపోతుంది.

 

వీరి ప్రేమ ఇష్టం లేక రెండేళ్ల క్రితమే శ్రీనివాసరావుకు జ్యోతి కుటుంబ సభ్యులు వార్నింగ్‌ ఇచ్చారు. అప్పుడు ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్లిన శ్రీనివాసరావు కుటుంబం.. ఇటీవలే తిరిగి మహానాడుకు మకాం మార్చింది. ఈ క్రమంలోనే జ్యోతి, శ్రీనివాసరావు మధ్య సాన్నిహిత్యం మరోసారి బలపడినట్లు తెలుస్తోంది. అయితే.. శ్రీనివాసరావుతో జ్యోతి తిరుగుతుండడాన్ని ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే.. జ్యోతి కుటుంబ సభ్యులే ఈ దాడి చేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…? ఒకవేళ ఇది నిజమైతే..తమ అమ్మాయిని చంపుకొని.. శ్రీనివాసరావును ఎలా వదిలేశారు..?

 

ఇంత సంచలనం రేపిన కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ వివాదాస్పదమవుతోంది. లేకపోతే ఖననం చేసేవరకు కూడా జ్యోతి దుస్తులను కానీ వస్తువులను కానీ ఎందుకు కలెక్ట్‌ చేసుకోలేదు. ఖననం చేసిన తర్వాత కుటుంబ సభ్యులను అడిగి తిరిగి మృతదేహాన్ని వెలికి తీసి.. వాటిని ఎందుకు సేకరించారు. ఈ కేసుపై ఎవరి ప్రభావమైనా ఉందా..? ఉద్దేశ పూర్వకంగా నీరు గార్చే ప్రయత్నం జరుగుతోందా..? హత్య కేసులో కీలక ఆధారాలను సేకరించడంలో పోలీసులు ఎందుకు అలసత్వం వహించారు.? ఇలా అనేకానేక సందేహాలు ఇంకా జ్యోతి మరణం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. సమాధానాలు దొరకని ప్రశ్నలు ఉదయిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధానాలు ఎప్పుడు వస్తాయి. ఈ కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

 

జ్యోతి హత్య కేసులో విచారణ వేగవంతం చేశామని గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు తెలిపారు. ఇప్పటికే  శ్రీనివాస్‌ నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నామని అన్నారు. ఇవే కాకుండా ఆయా ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్, మృతురాలి కాల్‌ డాటాతో టెక్నికల్‌ ఆధారాలు కూడా సేకరిస్తున్నామని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో కేసును ఛేదించి …ఘటనకు కారణమైన నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.