మధ్యప్రదేశ్‌లో మొండెం.. బెంగళూరులో తల దొరికింది.. 1300కి.మీ ప్రయాణం

  • Published By: sreehari ,Published On : October 16, 2020 / 08:29 PM IST
మధ్యప్రదేశ్‌లో మొండెం.. బెంగళూరులో తల దొరికింది.. 1300కి.మీ ప్రయాణం

Man Head Recover In Bengaluru : మధ్యప్రదేశ్‌లో రైలుపట్టాలపై మొండెం పడితే.. బెంగళూరులో తల దొరికింది.. దాదాపు 1300 కిలోమీటర్ల దూరం తల ప్రయాణించింది. రైలు ఇంజన్‌లో ఇరుక్కున్న తల బెంగళూరు రైల్వే స్టేషన్‌లో లభ్యమైంది. అక్టోబర్‌ 3వ తేదీన మధ్యప్రదేశ్‌, బెతుల్‌ రైల్వే స్టేషన్‌లోని పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మొండెం కనిపించింది.



అయితే తల లేదు.. కొన్ని శరీర భాగాలు కూడా కనిపించలేదు. ఆ డెడ్ బాడీ ఎవరిదో గుర్తించడం రైల్వే పోలీసులకు కష్టంగా మారింది. అక్టోబర్‌ 4న రైలు ఇంజన్‌లో చిక్కుకున్న ఒక తలను బెంగళూరు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారించగా..



తల లేని మొండెం ఒకటి మధ్యప్రదేశ్‌‌లోని బతుల్‌ రైల్వే స్టేషన్‌లో దొరికినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం వచ్చింది. మధ్యప్రదేశ్‌కు‌ చేరుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేశారు.



మృతుడి శరీర విడి భాగాలు బతుల్‌కు చెందిన 28 ఏళ్ల రవి మర్కామ్‌ అనే వ్యక్తిదిగా తేల్చారు పోలీసులు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు అతడి తల మీదనుంచి వెళ్లటంతో మృతిచెందాడని పోలీసులు ధ్రువీకరించారు. హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.