మారుతీరావు ఆత్మహత్యకు వీలునామానే కారణమా ? 

  • Published By: chvmurthy ,Published On : March 9, 2020 / 08:44 AM IST
మారుతీరావు ఆత్మహత్యకు వీలునామానే కారణమా ? 

2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోటానికి దారి తీసిన పరిస్ధితులపై ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. మారుతీరావు సంపాదించిన వందల కోట్ల ఆస్తి పంపకమే ఆయన ఆత్మహత్యకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.  వీలునామా విషయంలో సోదరుడు శ్రావణ్ తో  విభేదాలే కారణమనే ప్రచారం జరుగుతోంది.(భర్త పోయాడు.. తండ్రీ పోయాడు.. అమృత సంచలన నిర్ణయం!)

వందలకోట్ల రూపాయల ఆస్తి పరుడైన మారుతీరావు తన కూతురు అమృత ఒక దళిత యువకుడి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న కోపంతో అతనిని అతి దారుణంగా హత్య చేయించాడు. ఆ కేసులో అరెస్టై కొద్దిరోజుల తర్వాత మారుతి రావు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ప్రణయ్ హత్యకు ముందే తన తదనంతరం ఆస్తి మొత్తం తన తమ్ముడు శ్రవణ్‌కు చెందేలా మారుతీరావు వీలునామా రాశాడు.  జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీలునామాను మారుతీరావు తిరగ రాశాడు. వీలునామా నుంచి తన తమ్ముడి పేరును తొలగించాడు. 

అంతేకాకుండా కూతురు అమృతతో సయోధ్య కోసం కొంత కాలంగా మారుతీరావు సంప్రదింపులు జరిపిన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మారుతీరావు ఆత్మహత్య వెనుకు ఆస్తి తగాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు  విచారిస్తున్నారు. మారుతీరావు వీలునామా మార్చడానికి దారి తీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, తాను చెబితేనా తన అన్న మారుతీరావు వీలునామా మార్చాడని సోదరుడు శ్రవణ్ చెబుతున్నాడు.

మారుతీరావు తన యావదాస్తిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని అతని భార్యకు ఇచ్చాడు. ఇక రెండవ భాగాన్ని ఒక ట్రస్ట్ పేరిట రాయగా చివరిదైన మూడో భాగాన్ని తన ఏకైక సోదరుడి యొక్క కొడుకులకు పేరు మీద రాసిచ్చేశాడట. దీనిని బట్టి చూస్తే మారుతీరావు తన ఆత్మహత్యకు ముందునుంచే ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అతనితో ఉన్నా కూడా అతని భార్య ఆస్తిని అనుభవించవచ్చు. కానీ అతని చావు గురించి అతనికి ముందే తెలుసు కాబట్టి మారుతీరావు తన భార్యకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందే ఆస్తిని రాసి ఇచ్చినట్లు పలువురు అనుకుంటున్నారు

కాగా….మారుతీరావు ఆత్యహత్యకు సోదరుడు శ్రవణ్‌తో విభేదాలే కారణమని ప్రచారం జరుగుతోంది. కుమారులపై ఆస్తి రాయాలని ఒత్తిడి తీసుకురావడంతో సూసైడ్ చేసుకున్నారనే ఊహాగానాలను శ్రవణ్ తోసిపుచ్చారు. చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించానని శ్రవణ్ వాపోయాడు. ప్రణయ్ హత్య కేసులో తనకు సంబంధం లేదని.. కానీ 7 నెలల 15 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తన సోదరుడు ఆత్మహత్య చేసుకుంటే తనపై నిందలు వేయడం సరికాదన్నారు. 

చేయని తప్పుకు జైలు జీవితం అనుభవించానని.. మీడియా ప్రతినిధులు వాస్తవాలు నిర్ధారించుకొని వార్త రాయాలని కోరారు.  ఏప్రిల్‌లో జైలు నుంచి బయటకు వచ్చామని.. తర్వాత మారుతీరావుతో పెద్దల వద్ద పంచాయతీ జరిగిందని శ్రవణ్ చెప్పారు. ప్రణయ్ హత్య కేసులో తనను ఇరికించారని గొడవ పడ్డానని చెప్పారు. జరిగిందెదో జరిగిందని పెద్దలు సర్దిచెప్పి పంపించారని తెలిపారు. మే 15వ తేదీ  తర్వాత తన అన్న మారుతీరావుతో మాట్లాడలేదని ఆయన చెప్పారు.  ఈ పరిస్ధితుల్లో తాను ఆస్తి రాయాలని కోరానని చెప్పటం బాధ కలిగిస్తోందన్నారు.

ఎవరి భూములు జాగాలు వారి పేరు మీద ఉన్నాయని శ్రవణ్ పేర్కొన్నారు. తన వయస్సు 57 ఏళ్లు అని.. తాము చిన్న పిల్లలమా..? ఆస్తి కోసం గొడవ పడేందుకు అని ప్రశ్నించారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తే.. తనకేం జరిగినా పిల్లలు అనాధలు అయిపోతారని పేర్కొన్నారు. తన పిల్లలపై 2018 మార్చిలో వీలునామా రాశారని శ్రవణ్ చెప్పారు. ఆస్తిలో 50 శాతం వారికే దక్కుతోందని రాయగ.. పెద్ద మనుషులతో బలవంతం చేసి వద్దని చెప్పానని పేర్కొన్నారు. దీంతో వీలునామా క్యాన్సిల్ చేసుకున్నారని పేర్కొన్నారు. కానీ తాను మాత్రం వీలునామా చూడలేదని మీడియాకు శ్రవణ్ పేర్కొన్నారు. తాను సంపాదించుకున్నదే ఉందని.. ఆస్తి కోసం గడ్డి తిననని స్పష్టంచేశారు. మారుతీరావు ఆస్తి అతని భార్యకే చెందుతోందని పేర్కొన్నారు.

మరో వైపు జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత కూతురు అమృతతో సయోధ్య కోసం మారుతీరావు మధ్యవర్తిత్వం పంపినట్లుగా కూడా తెలుస్తోంది. తన ఇంటికి వచ్చేస్తే ఆస్తి కూతురికి రాసిస్తానని, అంతేకాక, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేలని కూడా మారుతీరావు అమృతను కోరినట్లు తెలుస్తోంది. మధ్యవర్తిత్వానికి పంపినా తన కూతురు ద్వేషించుకోవటం మారుతీరావు  జీర్ణించుకోలేక పోయాడని తీవ్రమైన  మానసిక ఒత్తిడికి గురైనట్లు మారుతీరావు సన్నిహితులు చెపుతున్నారు.  కూతురుని కోల్పోయాననే తీవ్రమైన మనస్థాపంతో  అతడు బాధపడే వాడని కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు చెబుతున్నారు.