మారుతీరావు సూసైడ్..పోలీసుల ఒత్తిడి కారణం కావొచ్చు – శ్రవణ్

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 08:14 AM IST
మారుతీరావు సూసైడ్..పోలీసుల ఒత్తిడి కారణం కావొచ్చు – శ్రవణ్

మారుతీరావు ఆత్మహత్యకు పోలీసుల ఒత్తిడే కారణం కావచ్చన్నారు ఆయన సోదరుడు శ్రవణ్. ప్రణయ్‌ హత్య కేసు ట్రయల్‌ దశకు వచ్చిందని.. ఈ సమయంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని పోలీసులు ఒత్తిడి పెంచారని.. ఆ టెన్షన్‌తోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చెప్పారు. తమ కుటుంబంలో ఆస్తి తగాదాలు లేవన్నారు. తానెప్పుడు తన అన్న ఆస్తికోసం ఆశ పడలేదన్నారు.

దాదాపు ఏడాది కాలంగా తామిద్దరం మాట్లాడుకోవడంలేదని.. ప్రణయ్‌ హత్య కేసు తర్వాత తమ మధ్య విభేదాలు వచ్చాయని అన్నారు. ఇదిలా ఉంటే…కన్నకూతురిపై ఉన్న ప్రేమే మారుతీరావు ప్రాణాలు తీసిందంటున్నారు బంధువులు. ఎన్నో కష్టాలకోర్చి ఎదిగిన మారుతీరావు.. ఇలా చనిపోవడం బాధాకరమంటున్నారు. అమృత ప్రేమ పెళ్లి తర్వాత తీవ్రంగా మదనపడ్డాడని చెబుతున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు కాసేపటి క్రితం పోస్టుమార్టం చేసి… మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. డెడ్‌బాడీని మిర్యాలగూడకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు… ఆస్పత్రిలో మారుతీరావు  కుటుంబసభ్యుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. 

ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడటం  కలకలం రేపింది. శనివారం ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చిన మారుతీరావు… విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే… దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లాయర్‌ను కలిసేందుకు మారుతీరావు నిన్న తన డ్రైవర్‌తో కలసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సాయంత్రం 6.40కి డ్రైవర్‌తో కలిసి ఆర్యవైశ్య భవన్‌కు వచ్చిన మారుతీరావు.. రెండ్రోజుల కోసం రూమ్‌ బుక్‌ చేసుకున్నాడు. 306 గదిలో బసచేశాడు. ఏడున్నరకు డ్రైవర్‌ను పిలిపించిన మారుతీరావు గారెలు తినాలనిపిస్తుందని… తీసుకురమ్మని పంపాడు. రేపు ఉదయం లాయర్‌ దగ్గరకు వెళ్లాలి 8గంటలకల్లా రూమ్‌కు రమ్మని డ్రైవర్‌కు చెప్పాడు. అతడిని కారులోనే పడుకోమని చెప్పి 5వందల రూపాయలు కూడా ఇచ్చాడు. కాసేపటి తర్వాత వైట్‌పేపర్‌ తెప్పించుకున్నాడు.

ఆ తర్వాత తన భార్యతో ఫోన్‌లో మాట్లాడి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆదివారం ఉదయం ఏడున్నరకి మారుతీరావు కోసం గదికి వెళ్లిన డ్రైవర్‌… డోర్‌ ఓపెన్‌ చేయకపోవడంతో ఆర్యవైశ్య భవన్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే సమయంలో మారుతీరావు భార్య తన భర్తకు ఫోన్‌ చేసింది. అతడి ఫోన్ కలవకపోవడంతో డ్రైవర్‌కు కాల్‌ చేసింది. దీంతో ఆర్యవైశ్య భవన్‌ సిబ్బంది సాయంతో పోలీసులకు ఫోన్‌ చేశారు. వారు తలుపులను పగలగొట్టేసరికి మారుతీరావు శవమై కనిపించాడు. 

మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన సైఫాబాద్ పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు మారుతీరావు రాసిన సూసైడ్‌ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేను చనిపోయాక నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లిపో అని ఆ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు మారుతీరావు. మరోవైపు… మారుతీరావు చనిపోయిన తీరుపై క్లూస్‌ టీమ్‌ వివరాలు సేకరిస్తోంది.

Read More : తెలంగాణ బడ్జెట్ : ఆర్టీసీకి రూ. 1000 కోట్లు, రిటైర్ మెంట్ వయస్సు పెంపు