బాలిక గ్యాంగ్ రేప్, హత్య.. అట్టుడుకుతున్న వెస్ట్ బెంగాల్, హింసాత్మకంగా మారిన నిరసనలు

  • Published By: naveen ,Published On : July 20, 2020 / 08:38 AM IST
బాలిక గ్యాంగ్ రేప్, హత్య.. అట్టుడుకుతున్న వెస్ట్ బెంగాల్, హింసాత్మకంగా మారిన నిరసనలు

బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనతో వెస్ట్ బెంగాల్ అట్టుడుకుతోంది.‌ ఉత్తర దీనాజ్‌పూర్‌ జిల్లాలోని చోప్రాలో ఈ ఘటన జరిగింది. బాలికపై హత్యాచారాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వారు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆవేశానికి లోనైన గ్రామస్థులు కోల్‌కత్తా నుంచి నార్త్ బెంగాల్ ను కలిపే జాతీయ రహదారిని బ్లాక్ చేసే ప్రయత్నం చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు ఆందోళనకారులు యత్నించారు. పోలీసు వాహనాలు, ప్రభుత్వ బస్సులకు నిరసనకారులు నిప్పంటించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. హింసకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఘటనాస్థలికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందోనని అంతా భయపడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Massive outrage erupts after missing minor found dead

ప్రభుత్వ బస్సులకు, పోలీసు వాహనాలకు నిప్పు:
ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని చోప్రా పోలీస్‌స్టేషన్ కు ఆదివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. వాళ్లు ఏదో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ చేస్తున్నారేమో అని పోలీసులు అనుకున్నారు. ఇంతలో వాళ్లు… పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. అటుగా వెళ్తున్న ప్రభుత్వ బస్సులను ఆపి… వాటికి కూడా నిప్పంటించారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా అగ్ని జ్వాలలతో నిండిపోయింది. మైనర్‌పై జరిగిన రేప్, హత్యను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.

రేప్ చేసి హత్య చేశారని గ్రామస్తులు.. విషం తాగి చనిపోయిందని డాక్టర్లు:
దీనంతటికీ కారణం 15 ఏళ్ల బాలిక అనుమానాస్పద మరణమే. రాయ్ గంజ్ లోని మార్కెట్ జంక్షన్ లో బాలిక ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈ ఘటన గత వారం జరిగింది. ఆ తర్వాత బాలికకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టు గ్రామస్తులను ఆగ్రహానికి గురి చేసింది. స్థానికులేమో బాలికను రేప్ చేసి చంపేశారని అంటుంటే… పోస్టుమార్టం రిపోర్టులో విషం తాగి చనిపోయిందని ఉంది. బాలిక దేహంపై ఎలాంటి గాయాలు లేవని రిపోర్టులో ఉంది. ఆ బాలిక… ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరైంది. ఇంట్లో నుంచి బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు మూడు బస్సులు, రెండు పోలీసు వాహనాల్ని తగలబెట్టారు. ఇతర వాహనాల్ని ధ్వంసం చేశారు. తమకు న్యాయం కావాలని నినాదాలు చేశారు.

అధికార తృణమూల్ కాంగ్రెస్ గూండాల పని అంటున్న బీజేపీ:
ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలకు పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారని… ప్రతిపక్ష బీజేపీ నేతలు ఆరోపించడంతో… స్థానికులు మరింత రెచ్చిపోయారు. ఒక్కసారిగా వెళ్లి… పోలీసులపై దాడి చేశారు. దాంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఎవరు ఎవర్ని కొడుతున్నారో, ఎవరు దెబ్బలు తింటున్నారో అంతా అయోమయం. సాయంత్రానికి కాస్త సద్దుమణిగింది. అప్పటికే… 30 మంది గాయపడ్డారు. వారిలో పోలీసులూ ఉన్నారు.

నివురుగప్పిన నిప్పులా చోప్రా:
బాలిక గ్యాంగ్‌ రేప్, హత్య కేసులో నిందితుల్ని తక్షణం అరెస్టు చేయాలనే డిమాండ్‌తో పెద్దఎత్తున ఆందోళనకారులు రోడ్డెక్కారని..ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయిస్తామని నచ్చజెబుతున్నా వినలేదని పోలీసులు తెలిపారు. కొన్ని రాజకీయపార్టీల జోక్యంతో పరిస్థితి చేయి దాటిందని పోలీసులు చెప్పారు. పరిస్థితిని అదుపు చేయడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల్ని రంగంలో దించారు.