ప్రేమించలేదని క్లాస్ మేట్ ను కాల్ గర్ల్ గా చిత్రీకరించిన విద్యార్ధి

ప్రేమించలేదని క్లాస్ మేట్ ను కాల్ గర్ల్ గా చిత్రీకరించిన విద్యార్ధి

MBA student shares classmate morphed photos in dating site : ఇష్టపడిన యువతి తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఆమె ఫోటోలను డేటింగ్  వెబ్ సైట్ లో  కాల్ గర్ల్ గా పోస్టు చేసిన విద్యార్ధిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కింగ్ కోఠీలో  నివసించే సమీర్ అనే యువకుడు ఇబ్రహీంపట్నం సమీపంలోని ఎంఆర్‌ఎం కళాశాలలో ఎంబీఎ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

తన క్లాస్‌మేట్‌ అయిన విద్యార్ధినితో అతనికి పరిచయమయ్యింది. ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. రోజూ చాటింగ్‌ చేసుకునేవారు. కొన్నాళ్ళకు   సమీర్‌ ఆ యువతితో ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించక అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న సమీర్ ఆమెను ఇబ్బందులు పెట్టాలనుకున్నాడు. తన స్మార్ట్ ఫోన్ ద్వారా కొత్త జీ మెయిల్ ఎకౌంట్ క్రియేట్ చేసాడు.  దాని ద్వారా లోకాంటో డేటింగ్ వెబ్ సైట్ లో నకిలీ ఖాతా తెరిచాడు.

ఇంటర్నెట్   ద్వారా అశ్లీల ఫోటో ఒకటి డౌన్లోడు చేసుకుని దాన్ని ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టాడు. ప్రొఫైల్ కు తన స్నేహితురాలి పేరు పెట్టి, ఆమెను కాల్ గర్ల్ గా క్రియేట్ చేసి ఆమె ఫోన్ నెంబరు పెట్టాడు. దీంతో ఆమెకు అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్లు రావటం మొదలైంది. విషయం తెలుసుకున్న యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం సమీర్ ను కింగ్ కోఠీలో అరెస్ట్ చేసారు. అతని వద్దనుంచి సిమ్ కార్డులు, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.