ఫేస్ బుక్ ప్రేమ…గడప దాటిన మైనర్ బాలిక

ఫేస్ బుక్ ప్రేమ…గడప దాటిన మైనర్ బాలిక

Moinabad police Rescue Minor girl after missing home : కరోనా లాక్ డౌన్ కాలంలో కూతురు ఆన్ లైన్ క్లాసులకు అవసరం అవుతుంది కదా అని కొనిచ్చిన స్మార్ట్ ఫోన్ తో ఆ బాలిక అత్యుత్యాహంతో సోషల్ మీడియా వెబ్ సైట్లను సెర్చ్ చేసింది. ఫేస్ బుక్ లో తన ప్రోఫైల్ క్రియేట్ చేసుకుంది. అందులో కరీంనగర్ కు చెందిన ఒక బాలుడు చెప్పిన మాయ మాటలకు ఆకర్షితురాలై ఇల్లు వదిలి కరీనగర్ చేరుకుంది. తల్లి తండ్రులు అలర్ట్ అవటంతో పోలీసులు ఆ బాలికను క్షేమంగా ఇంటికి చేర్చారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలానికి చెందిన బాలిక (13) స్ధానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో తండ్రి కొని ఇచ్చిన స్మార్ట్ ఫోన్ లో ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఫేస్ బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. అందులో కరీంనగర్ కు చెందిన ఒక బాలుడు (16) పరిచయం అయ్యాడు.

బాలిక క్లాసులు వినటంతో పాటు అతడితో చాటింగ్ కూడా మొదలెట్టింది. ఈ క్రమంలో ఆ బాలుడు 6నెలలుగా బాలికతో ప్రేమాయణం మొదలెట్టాడు. అతడు చెప్పే మాటలకు ఆకర్షితురాలైన బాలిక సోమవారం డిసెంబర్ 21 మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కరీంనగర్ బయలుదేరింది. ఇంట్లోంచి బయటకు వచ్చినేరుగా హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ కు చేరుకుంది.

తన వద్ద ఉన్నడబ్బులు అయిపోవటంతో బస్టాండ్ లోని బేకరీ యజమాని ఫోన్ నుంచి కరీంనగర్ లోని బాలుడికి విషయం చెప్పింది. అతని ద్వారా బేకరీ యజమాని ఫోన్ కు ఫోన్ పే ద్వారా రూ.400 తెప్పించుకుంది. ఆ డబ్బులు తీసుకుని రాత్రి 10 గంటల సమయంలో కరీంనగర్ చేరుకుంది. అనంతరం బాలుడు బాలికను తన ఇంటికి తీసుకువెళ్లాడు.

మరోవైపు మధ్యాహ్నం నుంచి ఇంట్లో బాలిక కనిపించకపోవటంతో తల్లితండ్రులు బాలిక కోసం చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనపడకపోయే సరికి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు రంగంలోకి దిగి బాలిక ఫోటోను అన్ని పోలీసు స్టేషన్లకు పంపించారు.

కరీంనగర్ స్నేహితుడితో మాట్లాడటానికి ముందు బేకరి యజమాని ఫోన్ నుంచి బాలిక గ్రామంలోని తన స్నేహితురాలితో మాట్లాడింది. బాలిక కనిపించట్లేదని తెలుసుకున్న స్నేహితురాలు తనకు ఫోన్ చేసిన విషయం చెప్పి ఆ నెంబర్ ఇచ్చింది. పోలీసులు వెంటనే ఫోన్ చేసి బేకరి యజమానిని సంప్రదించగా అదే బాలిక కరీంనగర్ ఫోన్ చేసిన విషయాన్ని, ఆ నెంబర్ ను పోలీసులకు ఇచ్చాడు.

మొయినాబాద్ ఏఎస్సై శ్రీశైలం తన బృందంతో జూబ్లీ బస్టాండ్ కు చేరుకుని బాలిక ఫోటోను బేకరి యజమానికి చూపించగా బాలికను గుర్తించాడు, పోలీసులు అదే రోజు రాత్రి కరీంనగర్ చేరుకుని బాలుడి ఇంటికి వెళ్లి బాలికను క్షేమంగా మొయినాబాద్ తీసుకువచ్చి తల్లి తండ్రులకు అప్పగించారు.