Pedavegi SI Suspended : ఏలూరులో తల్లీకూతుళ్ల ఆత్మహత్య కేసు.. పెదవేగి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు

ఏలూరు జిల్లా పెదవేగి ఎస్ఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. తల్లీకూతుళ్ల సూసైడ్ కేసులో అలసత్వం వహించారంటూ సత్యనారాయణపై వేటు వేశారు డీఐజీ బాలరాజు.

Pedavegi SI Suspended : ఏలూరులో తల్లీకూతుళ్ల ఆత్మహత్య కేసు.. పెదవేగి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు

Pedavegi SI Suspended : ఏలూరు జిల్లా పెదవేగి ఎస్ఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. తల్లీకూతుళ్ల సూసైడ్ కేసులో అలసత్వం వహించారంటూ సత్యనారాయణపై వేటు వేశారు డీఐజీ బాలరాజు. కేసు దర్యాఫ్తులో ఎస్ఐ సత్యనారాయణ అలసత్వం వహించారని తేలడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. పెదవేగి మండలం వేగివాడలో తల్లీ కూతుళ్లు రోజుల వ్యవధిలో చనిపోయారు. ఎస్ఐ సత్యనారాయణ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడగం వల్లే ఈ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుల కుటుంబం ఆరోపించింది.

అసలేం జరిగిందంటే..
వేగివాడకు చెందిన బాలిక (17) పదో తరగతి చదివి ఇంటి దగ్గర ఉంటోంది. దెందులూరు మండలం కొత్తపల్లికి చెందిన తాపీ పనులు చేసే చిట్టిబాబుతో బాలికకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే చిట్టిబాబు ఈనెల 12న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్‌పై ఏలూరుకు తీసుకెళ్లాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. 13వ తేదీ సాయంత్రం బాలికను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. బాలిక చిట్టిబాబు బైక్ ఎక్కి వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉంది. నిందితుడి వేధింపులతో భయపడిపోయిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. ఈ ఘటనపై బాలిక బంధువులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మైనర్ బాలికకు లైంగిక వేధింపులపై పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయకపోగా ఎస్ సత్యనారాయణ వారిని అవమానించాడు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడానికి బదులుగా, నువ్వే కూతుర్ని పంపించావు అని అన్నారని, ఎస్‌ఐ తమను దుర్భాషలాడాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందని, ఎస్ఐ సైతం న్యాయం చేకపోగా దూషించారని తీవ్ర మనస్తాపం చెందిన తల్లీకూతుళ్లు ఈనెల 16వ తేదీన కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

చికిత్స కోసం మొదట ఏలూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ ప్రాణాలు దక్కలేదు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం బాలిక, శనివారం ఉదయం ఆమె తల్లి చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయకపోగా, కేసు నమోదు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఐ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబం, బంధువులు డిమాండ్ చేశారు.

దీన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు పెదవేగి ఎస్ఐ సత్యనారాయణపై విచారణకు ఆదేశించారు. నివేదిక అందాక చర్యలు తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎస్ఐపై సస్పెన్షన్ వేటేశారు.

పెదవేగి ఘటనపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో రక్షకభట నిలయాలు భక్షకభట నిలయాలుగా మారాయని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లే బాధితులకు న్యాయం దొరకడం లేదని వాపోయారు. సీఎం జగన్ న్యాయానికి సంకెళ్లు వేసి, పోలీసులను వీధుల్లోకి విచ్చలవిడిగా వదిలేశారని మండిపడ్డారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని.. దీంతో సదరు బాలిక, ఆమె తల్లి ఆత్మహత్య చేసుకున్నారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని ఆమె మండిపడ్డారు. న్యాయం జరగక చాలామంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఏం చేస్తున్నారని అనిత ప్రశ్నించారు. తల్లీకూతుళ్ల మృతికి కారణమైన పెదవేగి ఎస్ఐపై పోక్సో కేసు నమోదు చేయాలని అనిత డిమాండ్ చేశారు.