మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న కేసులో 5 ఏళ్లు జైలు శిక్ష

  • Published By: murthy ,Published On : June 25, 2020 / 07:55 AM IST
మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న కేసులో 5 ఏళ్లు జైలు శిక్ష

మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న కేసులో ఒక వ్యక్తికి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది ముంబై లోని స్థానిక కోర్టు. ముంబై లోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న 30 ఏళ్ల నిందితుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముంబైలో మైనర్  పిల్లల రక్షణ కోసం ఉద్దేశించిన పోక్సో చట్టం కింద వచ్చిన తొలితీర్పు ఇది.

ముంబైలోని అంటోప్ హిల్ కాలనీలోని మురికివాడలో నివసించే ఒక ఎనిమిదేళ్ల బాలిక  జూన్29, 2018న… రాత్రి సమయంలో  అక్కడ ఉన్న ఉమ్మడి మరుగుదొడ్ల కాంప్లెక్స్ కు వెళ్లింది. ఆ మురికి వాడలో రాత్రి పూట వీధి దీపాలు కూడా లేకపోవటంతో ఆమె సోదరుడు సెల్ ఫోన్ టార్చ్ లైట్  తీసుకుని ఆమెకు తోడుగా వచ్చాడు. 

ఆమె అక్కడ తన పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా …అక్కడే చీకటిలో మరుగుదొడ్డి కోసం ఎదురు చూస్తున్న….అదే  ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ (30) అనే వ్యక్తి ఆ బాలికను దగ్గరకు లాక్కోని పెదాలపై ముద్దు పెట్టాడు. ఊహించని పరిణామంతో.. షాక్ కు గురైన బాలిక అతడిని విదిలించుకుని, ఏడ్చుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రికి విషయం చెప్పింది. 

కోపంతో ఊగిపోయిన బాలిక తండ్రి అబ్దుల్ రెహమాన్ ని నిలదీసేందుకు ఇంటికి వెళ్ళగా అక్కడ అతని భార్య మాత్రమే ఉంది. బాలిక తండ్రి వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి రెహమాన్ పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసారు. కేసుపై కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. 

ఈ  కేసులో ముద్దాయిని కుట్ర పూరితంగా ఇరికించారని…ఆ నేరం చేసింది రెహమాన్ కాదని…చీకట్లో బాలిక నిందితుడిని గుర్తించ లేకపోయిందని అతని తరుఫు లాయర్లు వాదించారు. కానీ ఈ కేసులో నిందితుడు కంటే బాధితురాలు ఎక్కువ బాధ పడుతున్నందున బాలిక అబధ్ధం చెప్పడానికి ఎటువంటి కారణం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతా శర్మ వాదించారు.  

పోలీసులు,డాక్టర్, మెజిస్ట్రేట్ ముందు బాధితురాలు స్ధిరంగా తన స్టేట్ మెంట్ ఇచ్చిందని….అమాయకంగా ఒక వ్యక్తిని  తప్పుగా కేసులో ఇరికించే ఉద్దేశ్యం బాధితురాలికిలేదని  గీతా శర్మ వాదించారు.  8 ఏళ్ల బాలిక కోర్టులో నిందితుడిని కూడా గుర్తించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను పరిశీలించి… నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష, బాధితురాలికి చెల్లించేందుకు రూ.5 వేల జరిమానా విధించింది. 

Read: హీరోయిన్ కు బెదిరింపులు-నలుగురు అరెస్ట్