కొడుకు ప్రేమకు తండ్రి బలి 

  • Published By: murthy ,Published On : June 9, 2020 / 09:55 AM IST
కొడుకు ప్రేమకు తండ్రి బలి 

తమ కుమార్తెను తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువకుడి తండ్రిని హత్య చేసిన ఉదంతం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాంలో జూన్ 5వ తేదీన జరిగిన ఈ దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. 

జిల్లాలోని సంస్థాన్ నారాయణ పూర్  మండలం జనగాం కు చెందిన గడ్డం  నవనీత అదే గ్రామానికి చెందిన గొండిగళ్ల గాలయ్య కుమారుడు బాబును ప్రేమించింది.  ఈ విషయం ఆమె ఇంట్లో పెద్దవాళ్లకు తెలియటంతో ఇద్దరూ కలిసి గతేడాది అక్టోబర్ లో ఇంట్లో నుంచి పారిపోయారు. ఎక్కడో దూర ప్రాంతంలో జీవిస్తున్నారు. 

నవనీత బాబుతో లేచి పోవటంతో ఆమె కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. బాబు కుటుంబాన్ని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రేమించిన బాబుతోనే పెళ్లి చేస్తామని నమ్మించి కొన్నాళ్లకు నవనీత కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకు వచ్చారు.  

ఆమెకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వేరే యువకుడితో ఇచ్చి పెళ్ళి చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఫిబ్రవరి 15న నిశ్చితార్ధానికి ఏర్పాట్లు చేశారు. నవనీత ప్రేమ వ్యవహారం తెలిసిన మగపెళ్లివారు సంబంధం రద్దు చేసుకున్నారు.  

అనంతరం ఫిబ్రవరి 22న మరోసారి నవనీత, బాబు లు ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన నవనీత కుటుంబ సభ్యులలో మరింత కోపం పెంచింది. నవనీత అన్నలు  మరింత కక్ష పెంచుకున్నారు బాబు కుటుంబాన్ని  అంతం చేయాలనుకున్నారు. ఇందుకోసం పుట్టపాకకు చెందిన  తమ బంధువు లౌలేష్ తో  చర్చించారు.అంతా కలిసి హత్యకు పధకం రచించారు. 

బాబు తండ్రి గొండిగళ్ల గాలయ్య జూన్ 5వ తేదీన  బ్యాంకు పని నిమిత్తం నారాయణపురం వెళ్లాడు. గాలయ్య బ్యాంకుకు వెళ్లటం గ్రామ శివారులోని పాఠశాల వద్ద ఉండి గమనించిన నవనీత కుటుంబ సభ్యులు…గాలయ్య సాయంత్రానికి గ్రామానికి తిరిగి వస్తాడని భావించి అక్కడే కాపు కాశారు. 

సాయంత్రం గాలయ్య ఊళ్లోకి  రాగానే స్కూల్ వద్ద మాటువేసిన నవనీత అన్న సురేష్ తనవెంట తెచ్చుకున్న ముంజెలు నరికే కొడవలితో నరికి చంపాడు. తీవ్ర గాయాలపాలైన గాలయ్య అక్కడి కక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. 

ఈకేసులో ప్రధాన నిందితుడు సురేష్ తోపాటు అతడి కుటుంబానికి చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. మరోక నిందితుడు  దాసరిలౌలేలేష్ ను పుట్టపాకలో అరెస్టు చేశారు.  వారివద్దనుంచి  స్కూటీ,  ఓకత్తి స్వాధీనం చేసుకున్నారు.   నిందితులను సోమవారం నల్గోండ కోర్టులో  ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి  రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు. 

Read: సీఎం కేసీఆర్‌పై అనుచిత పోస్టులు, దుబాయ్‌లో ఉండే రాజుపై లుకౌట్ నోటీసు