Murder For Assets : ఆస్తి కోసం… ప్రియుడితో కలిసి కోడలి దురాఘతం

మనిషిలో బంధాలు, అనుబంధాలు కనుమరుగు అవుతున్నాయి. డబ్బు మీద మోజు మనిషిని కసాయిలా మారుస్తోంది. కాసుల కోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా దిగజారిపోతున్నాడు.

Murder For Assets : ఆస్తి కోసం… ప్రియుడితో కలిసి కోడలి దురాఘతం

Murder For Assets

Murder For Assets : మనిషిలో బంధాలు, అనుబంధాలు కనుమరుగు అవుతున్నాయి. డబ్బు మీద మోజు మనిషిని కసాయిలా మారుస్తోంది. కాసుల కోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా దిగజారిపోతున్నాడు. ఆస్తి కోసం రక్త సంబంధీకులను సైతం చంపేస్తున్నాడు. తాజాగా ఆస్తి కోసం ఓ కోడలు ఘోరానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి అత్తను కడతేర్చింది. అత్త హత్య కేసులో కోడలే సూత్రధారి అని తెలిసి బంధువులు విస్తుపోయారు.

సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంలో వృద్ధురాలి(లలితమ్మ) హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కోడలే ప్రియుడితో కలిసి అత్తను చంపించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన కుసుమ లలిత అలియాస్‌ లలితమ్మకు ఇద్దరు కూతుళ్లు(వెన్న చంద్రకళ, ముప్పని సూర్యకళ), ఒక కొడుకు(మధుసూదన్‌రెడ్డి) ఉన్నారు. పెళ్లి సమయంలో ఒక్కో కూతురికి కట్నం కింద రెండెకరాల భూమి ఇచ్చింది. మిగిలిన 3.24 గుంటల వ్యవసాయ భూమి లలితమ్మ భర్త వీరారెడ్డి పేరుపై ఉంది. రెండేళ్ల క్రితం లలితమ్మ భర్త వీరారెడ్డి అనారోగ్యంతో చనిపోయాడు. వీరారెడ్డి పేరిట ఉన్న భూమిని కొడుకు మధుసూదన్‌రెడ్డి సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా మధుసూదన్‌రెడ్డికి మూర్చ రోగం ఉంది. మధుసూదన్ రెడ్డి భార్య విజయలక్ష్మి కొన్నేళ్లుగా వ్యవసాయ భూమి విషయంలో అత్తతో ఘర్షణ పడుతోంది. అత్త తన దగ్గరున్న నగదుతో పాటు భూమిలో పండుతున్న పంటను బిడ్డలకు పెడుతోందని కోపం పెంచుకుంది.

వ్యవసాయ భూమిని తన భర్త పేరుపై మార్చాలని కోడలు విజయలక్ష్మి అత్తతో గొడవ పడుతుండేది. అందుకు అత్త ఒప్పుకోలేదు. దీంతో అత్తను చంపైనా ఆస్తి దక్కించుకోవాలని కోడలు నిర్ణయించుకుంది. ఇందుకోసం తన భర్త వ్యవసాయ భూమిలో కూలి పనులకు వచ్చే పెన్‌పహాడ్‌ మండలం అనాజిపురం గ్రామానికి చెందిన నూకల సైదులు సాయం తీసుకుంది. ఇద్దరూ కలిసి స్కెచ్ వేశారు. అతడితో తన అత్త లలితమ్మను హత్య చేయించింది కోడలు విజయలక్ష్మి.

గ్రామంలోని తన ఇంట్లో లలితమ్మ ఒంటరిగా ఉంటుంది. ఈనెల 9న ఇంట్లో రక్తపు మడుగులో ఆమె పడి ఉంది. తోడి కోడలు గమనించి కొడుక్కి సమాచారం ఇచ్చింది. కోడలు విజయలక్ష్మి అత్త హత్య విషయం తనకేమీ తెలియనట్లుగా నటిస్తూ వచ్చింది. మర్డర్ మిస్టరీగా మారింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేపట్టారు. నూకల సైదులుపై వారికి అనుమానం వచ్చింది. ఈ నెల 10న అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమ స్టైల్ లో సైదులును విచారించగా, అతడు నిజం కక్కేశాడు. లలితమ్మను హత్య చేసింది తానే అని ఒప్పుకున్నాడు. కోడలు విజయలక్ష్మి చెప్పినట్టే తాను కత్తితో దాడి చేసి లలితమ్మను చంపినట్లు పోలీసులతో చెప్పాడు. ఈ కేసులో కోడలే సూత్రధారి అని తెలిసి అంతా విస్తుపోయారు. పోలీసులు వెంటనే విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.