మిస్టరీ : పోలీసులకు సవాల్‌గా మారిన రాధిక హత్య కేసు

10TV Telugu News

కరీంనగర్ జిల్లా విద్యానగర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థిని రాధిక హత్య కేసు మిస్టరీగా మారింది. జర్మన్‌ టెక్నాలజీ వాడినా… 8 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నా… అలాగే  పై అధికారులు సైతం సెలవులు రద్దు చేసుకుని హత్యకేసుపై ఫోకస్‌ పెట్టినా… ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. తెలిసిన వారే హత్య చేసి ఉంటారనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేకపోయినా… ఎవరీ దారుణానికి ఒడిగట్టారనే విషయంలో స్పష్టత రావడం లేదు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. హంతకుడికి సంబంధించి ఏ ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు. మరోవైపు 48 గంటల్లో చేధిస్తామంటూ 10 రోజుల క్రితం చేసిన సవాల్‌ అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది. 

2020, ఫిబ్రవరి 10వ తేదీన రాధిక దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య జరిగింది. గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశారు. హత్య తర్వాత ఏ ఒక్క క్లూ దొరక్కుండా జాగ్రత్త పడ్డారు నిందితులు. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చినా, అదెవరనే దానిపై క్లారిటీ లేదు. ఘటన జరిగి రెండు వారాలు అయినప్పటికీ… ఇంకా విచారణ పక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు… పలువురు అనుమానితులను అదపులోకి తీసుకొని విచారించినా ఫలితం లేకుండా పోయింది. విచారణ చివరి వరకు వచ్చినట్లే వచ్చి మళ్లీ మొదటికే చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నిందితుడెవరనే విషయం ఇంకా తెలియకపోవడంతో పోలీసులపై ఒత్తిడి ఎక్కువవుతోంది.  

రాధిక హత్యకు ప్రేమ తిరస్కరణే కారణమన్న కోణంలో పోలీసులు జరిపిన దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడలేదు. అయితే అనుమానాలు మాత్రం చాలానే వ్యక్తమవుతున్నా… వాటిని నిరూపించే ఆధారాలు దొరకడం లేదు. కాల్‌డేటా, యువతి తల్లిదంద్రులు, స్థానికులు మాటల ఆధారంగా నలుగురు అనుమానితులను అదపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపినా… ఎలాంటి ఏ ఒక్క క్లూ దొరకలేదు. 

హత్య జరిగిన విద్యానగర్‌ వెంకటేశ్వర కాలనీలోని రాధిక ఇంటి పరిసర ప్రాంతాలు, సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలించారు. అయినా నిందితుడికి సంబంధించిన ఏ విషయాలూ తెలియలేదని అర్థమవుతోంది. దీంతోపాటు అక్కడి వీధుల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు కాకుండా కొందరు ఇంటి యజమానులు సొంతంగా పెట్టుకున్న సీసీ కెమెరాల డీవీఆర్‌లను సైతం పరిశీలించినా నిందితుడి ఆచూకీ దొరకనట్లే తెలుస్తోంది. 

రాధిక హత్య కేసు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హత్య జరిగి రెండు వారాలు గడుస్తున్నా… నిందితుడు దొరక్కపోవడంతో పోలీసులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కడ్ని పట్టుకోవడానికి ఇన్నిరోజులా అంటూ మండిపడుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులకు ప్రెజర్ ఎక్కువవుతోంది.  

10TV Telugu News