ISIS చీఫ్ బాగ్దాదీని వెంటాడిన కుక్క ఇదే…ఫొటో షేర్ చేసిన ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : October 29, 2019 / 08:05 AM IST
ISIS చీఫ్ బాగ్దాదీని వెంటాడిన కుక్క ఇదే…ఫొటో షేర్ చేసిన ట్రంప్

ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబు బకర్‌ అల్‌ బాగ్దాదీని తన చివరి గడియల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు తరిమి తరిమి వెంటాడాయి. అయితే ఈ వేటలో ఓ జాగిలం స్వల్ప గాయాలపాలైంది. కానీ తనకిచ్చిన డ్యూటీని మత్రం పక్కాగా పూర్తి చేసింది. ఓ కరడుగట్టిన ఉన్మాది.. ఇక తనకు ఈ లోకంలో నూకలు లేవని భావించి ఆత్మాహుతి చేసుకునే వరకూ వెంటాడింది. చికిత్స తర్వాత కోలుకుని… విధుల్లో చేరింది. ప్రపంచాన్నే వణికించిన ఉగ్రనేత బాగ్దాదీని చివరిక్షణాల్లో భయంతో పరుగులు పెట్టించిన శునకం ఫొటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్​ ద్వారా షేర్ చేశారు. అయితే… ఆ కుక్క పేరు చెప్పడం మాత్రం కుదరదని ట్రంప్ తెలిపారు.

అమెరికా దళాలు విధుల్లో తమకు సహాయంగా బెల్జియం మాలినోయిస్‌ జాతికి చెందిన జాగిలాల్ని ఉపయోగిస్తుంటాయి. 2011లో ఇదే తరహాలో ఒసామా బిన్‌ లాడెన్‌ని హతమార్చిన ఆపరేషన్‌లో అమెరికా బలగాలు “కైరో” పేరు గల బెల్జియం మాలినోయిస్‌ జాతికి చెందిన శునకాన్ని ఉపయోగించారు. డీఎన్​ఎ పరీక్షల ద్వారా నిర్ధారణ…సొరంగంలో ఆత్మాహుతి దాడి చేసుకున్న బాగ్దాదీ మృతదేహానికి అమెరికా సైనిక అధికారులు డీఎన్​ఏ పరీక్షలు చేయించారు. బాగ్దాదీ హతంపై గతంలో అనేకసార్లు వార్తలు వచ్చిన సమయంలో అతడి మరణాన్ని ధ్రువీకరించేందుకు ఈ పని చేశారు. బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని ఆదివారం ట్రంప్ కన్ఫర్మ్ చేశాడు. బాగ్దాదీ మృతదేహానికి నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు అమెరికా సంయుక్త సైన్యాధిపతి జనరల్ మార్కె మిల్లే తెలిపారు. బాగ్దాదీ స్థావరంలో పట్టుబడ్డ ఇద్దరిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.లాడెన్​ మృతదేహాన్ని అమెరికా సైన్యం సముద్రంలో జారవిడిచింది. ఇప్పుడు బాగ్దాదీ శవాన్ని కూడ సముద్రంలో కలిపేనట్లు సమాచారం.

అయితే బాగ్దాదీ టార్గెట్ గా అమెరికా ఆపరేషన్ కి ముందు బాగ్దాదీ ధరించిన అండర్ వేర్(డ్రాయర్)ను ఓ సిరియన్ కుర్దు అండర్ కవర్ ఏజెంట్ దొంగిలించాడని,బాగ్దాదీ చనిపోయిన తర్వాత వాటి ఆధారంగా డీఎన్ఏ టెస్టు నిర్వహించి..చనిపోయింది బాగ్దాదీనేనని కన్ఫర్మ్ చేసుకున్నట్లు ఓ కుర్దు అధికారి తెలిపారు. అల్ బగ్దాదీని ట్రాక్ చేసేందుకు మే-15నుంచి అమెరికా సీఐఏతో కలిసి పనిచేస్తున్నామని,బాగ్దాదీ ప్రతీ కదలికను దగ్గరగా గమనిస్తూ వచ్చినట్లు తెలిపారు. చివరికి ఎట్టకేలకు శనివారం అమెరికా దళాలు దాడి చేయకముందే సూసైడ్ వెస్ట్ ధరించి ఆత్మహత్య చేసుకుని బాగ్దాదీ చనిపోయినట్లు తెలిపారు.