నార్కో ప్రెగెన్సీ : కడుపులో డ్రగ్స్ దాచి స్మగ్లింగ్.. మహిళ అరెస్ట్

  • Edited By: sreehari , November 14, 2019 / 02:54 PM IST
నార్కో ప్రెగెన్సీ : కడుపులో డ్రగ్స్ దాచి స్మగ్లింగ్.. మహిళ అరెస్ట్

ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల రూపంలో ప్రతి ఏడాది బిలియన్ల డాలర్లలో నార్కోటిక్స్ ట్రేడ్ చేతులు మారుతోంది. లాటిన్ అమెరికా దేశాలైన అర్జెంటైనా, మెక్సికో దేశాల్లోనే భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం కూడా దీనికి తోడై ఎక్కువ సంఖ్యలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుత సాంకేతికత ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు ఎన్నో ట్రిక్స్ ఫాలో అవుతున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే సమయాల్లో కస్టమ్స్ అధికారులను ఫూల్స్ చేసేందుకు స్మగ్లర్లు కొత్త దారుల్లో ప్రయత్నించి అడ్డంగా దొరికిపోతున్నారు. 

కొన్నిరోజుల క్రితం గంజాయిని అక్రమ రవాణా చేసే ఓ యువతి అర్జెంటైనా అధికారులకు పట్టుబడింది. నిండు గర్భిణీలా నటిస్తూ తన కడుపులో డ్రగ్స్ దాచిపెట్టింది. యువతి కడుపు మరింత బరువుగా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు కస్టడీలోకి తీసుకుని తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆమె కడుపులో 5 కేజీల బరువైన గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే యువతిని అరెస్ట్ చేశారు. 5కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అర్జెంటైనా పౌరులను అరెస్ట్ చేసినట్టు మినిస్టరీ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ నేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. 

గంజాయి తరలిస్తున్న మహిళ కడుపు కింద 15 ప్యాకెట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆమె భాగస్వామి లగేజీల నుంచి మరో రెండు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తం 5.5 కేజీల వరకు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అర్జెంటైనా సరిహద్దు అయిన చీలే సమీపంలోని మెండోజా ప్రాంతం బోర్డర్ చెక్ పాయింట్ దగ్గర అధికారులు తనిఖీలు చేశారు. అదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న దంపతులను తనిఖీ చేయగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు తేలింది.