పనివాళ్లుగా చేరతారు, నమ్మకంగా ఉంటారు, అదను చూసి ఆహారంలో మత్తుమందు కలిపి దోపిడీ చేస్తారు.. హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్స్ కలకలం

  • Published By: naveen ,Published On : October 7, 2020 / 11:51 AM IST
పనివాళ్లుగా చేరతారు, నమ్మకంగా ఉంటారు, అదను చూసి ఆహారంలో మత్తుమందు కలిపి దోపిడీ చేస్తారు.. హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్స్ కలకలం

nepali gangs in hyderabad: ఇతర రాష్ట్రాల వ్యక్తులను మీ ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటున్నారా..? మీ ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు ఉన్నాయా..? పని వాళ్ల మీద నమ్మకంతో వాటిని ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తున్నారా..? అయితే ఇకపై కాస్త జాగ్రత్త. లేదంటే మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా పోవడమే కాదు…అప్పుడప్పుడు మీ ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లుతుంది.

సంపన్నులు నివసించే ప్రాంతాలే టార్గెట్:
మొన్న కోకాపేట.. నిన్న సైనిక్ పురి.. తాజాగా రాయదుర్గం.. ప్లేస్‌లు మాత్రమే వేరు..జరిగిన సీన్‌ ఒక్కటే.. నమ్మకంగా ఉన్నారు..నట్టేట ముంచేశారు.. సంపన్నులు నివసించే ప్రాంతాలే టార్గెట్‌.. సెక్యూరిటీ గార్డులు, పని వారుగా ఎంట్రీ.. కొద్ది రోజులు నమ్మకంగా ఉంటారు.. ఆ కొద్ది రోజుల సమయంలోనే సదరు ఇంటి పూర్తి సమాచారం…యజమానుల కదలికలు తెలుసుకుంటారు.. ఇంకేముంది..యజమానులకు మత్తు మందు పెడతారు..ఉన్నదంతా ఊడ్చుకుని ఉడాయిస్తారు..

యజమానులకు మత్తు మందు ఇచ్చి.. భారీ సొమ్ముతో పరార్:
2020 జనవరిలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట…ఆగస్టులో మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని సైనిక్‌ పురి.. తాజాగా రాయదుర్గం డిఎన్ఆర్ హిల్స్‌…ఈ మూడు చోట్ల దోపిడీకి పాల్పడింది నేపాలీ గ్యాంగ్స్‌. పని వాళ్లుగా చేరారు.. నమ్మకంగా ఉన్నారు..యజమానులకు మత్తు మందు ఇచ్చి..భారీ సొమ్ముతో కంటికి కన్పించకుండా మాయమయ్యారు.

యజమానికి మత్తుమందు ఇచ్చి రూ.15లక్షల నగదు, బంగారం చోరీ:
ఇదిగో ఈ ఇల్లు. బోర్‌వెల్ కాంట్రాక్టర్ మధుసూధన్‌రెడ్డి ఇల్లు. రాయదుర్గం డీఎస్‌ఆర్‌ హిల్స్‌లో ఈ ఇల్లు ఉంది. కొడుకు, కోడలు, భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సీన్‌ కట్‌ చేస్తే… మధుసుధన్‌రెడ్డి ఇంట్లో 15 లక్షల నగదు, బంగారం చోరీ జరిగింది. ఎవరా అని ఆరా తీయగా…ఇంట్లో పని చేసే నేపాలీ గ్యాంగ్‌ చేసినట్లు తేలింది.

ఇల్లు, ఇంటి యజమాని, కుటుంబసభ్యుల పూర్తి వివరాలు సేకరణ:
కొన్ని రోజులుగా మధుసూదన్ రెడ్డి ఇంట్లో…నేపాల్‌కు చెందిన మనోజ్, జానకి, రాజు, సీత..అనే నలుగురు వ్యక్తులు పని వాళ్లుగా చేస్తున్నారు. ఇన్నాళ్లు నమ్మకంగా ఉన్న ఆ నలుగురు.. ఆ ఇల్లుతో పాటు ఇంటి యజమాని, కుటుంబసభ్యుల గురించి పూర్తిగా తెలుసుకున్నారు. అలాగే ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో..కూడా పసిగట్టారు. అదును చూసి బంగారం, నగదు కొట్టేసి సెటిల్‌ అవ్వాలని ప్లాన్ వేసుకున్నారు.

కుటుంబం మొత్తానికి డిన్నర్‌లో మత్తు మందు:
నగదు, నగలను కొట్టేసేందుకు ప్లాన్‌ వేసిన ఆ రెండు జంటలు‌..సోమవారం(అక్టోబర్ 5,2020) రాత్రి పథకాన్ని రచించారు. కుటుంబం మొత్తానికి రాత్రి డిన్నర్‌లో మత్తు మందు కలిపారు. వారంతా మత్తులోకి జారుకున్నాక.. రూ.15 లక్షల నగదు, బంగారం తీసుకుని రాత్రికి రాత్రే జంప్‌ అయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు…నగరంలోని రైల్వే స్టేషన్‌లు, బస్‌స్టేషన్‌లు, ఎయిర్‌పోర్ట్‌తో సహా జల్లెడ పడుతున్నారు.

సైనిక్ పురిలో రూ.2కోట్ల సొత్తుతో ఉడాయించిన వాచ్ మెన్ దంపతులు:
ఇక అంతకుముందు…ఆగస్టులో సేమ్‌ టు సేమ్‌..ఇలాంటి ఘటనే..మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని సైనికపురిలో చోటు చేసుకుంది. సైనికపురిలో నరసింహారెడ్డి అనే వ్యాపారి ఇంట్లో నేపాలీ గ్యాంగ్‌ భారీ దోపిడీకి పాల్పడింది. ఆ ఇంటికి నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. భార్యతో కలిసి అక్కడే ఉండేవాడు. అదును చూసి ఆ దంపతులు ఏకంగా రెండు కోట్ల రూపాయల సొత్తును దోచుకుని ఉడాయించారు. ఈ భారీ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…గంటల వ్యవధిలోనే వాచ్‌మెన్‌ దంపతులే దొంగలని తేల్చారు.

కోకాపేటలో విల్లాలో బంగారు ఆభరణాలతో పారిపోయిన పని మనుషులు:
జనవరిలోనూ ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. ఇంటి యజమానులకు మత్తు మందిచ్చి ఇల్లు గుల్ల చేసిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేపాల్‌కు చెందిన ఓ జంట కోకాపేటలోని ఓ విల్లాలో పని మనుషులుగా చేరింది. వారం రోజులు అయిందో లేదో ఇంటి యజమానులకు ఆహారంలో మత్తుమందు కలిపిచ్చి బంగారు ఆభరణాలతో ఉడాయించింది. ఓ వైపు కోకాపేట..,మరోవైపు సైనికపురి దోపిడీ ఘటనల్లో దర్యాప్తు కొనసాగుతుండగానే…తాజాగా రాయదుర్గంలోని డిఎన్‌ఆర్ హిల్స్‌లో మరో దోపిడీ జరగడం కలకలం రేపింది.

ఇతర రాష్ట్రాల వాళ్లను పనిలో పెట్టుకునే ముందు జాగ్రత్త:
చూశారుగా నమ్మకంగా ఉంటూ.. చివరకు ఎలా నట్టేట ముంచుతున్నారో.. సో… ఇతర రాష్ట్రాల వాళ్లను పనిలో పెట్టుకునే ముందు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వారి పూర్తి వివరాలు, గత చరిత్ర తెలుసుకున్న తర్వాతే పనిలోకి తీసుకోండి. లేదంటే తెలిసిన వాళ్లను పనిలో పెట్టుకోండి. అలాగే మీ మీ ఇళ్లలోని పనివాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండండి.