బావిలో 9 మృతదేహాల కేసు, పోలీసుల అనుమానం దానిపైనే

  • Published By: naveen ,Published On : May 23, 2020 / 04:34 AM IST
బావిలో 9 మృతదేహాల కేసు, పోలీసుల అనుమానం దానిపైనే

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఓ బావిలో 9మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం సంచలనం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. వలస కార్మికుల మరణాలు మిస్టరీగా మారాయి. ఇవి హత్యలా? సామూహిక ఆత్మహత్యలా? అనేది అంతు చిక్కడం లేదు. గురువారం(మే 21,2020) 4 మృతదేహాలు వెలుగుచూడగా, శుక్రవారం(మే 22,2020) మరో 5 బయటపడ్డాయి. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన పశ్చిమ బెంగాల్‌ వాసులు కాగా, ఇద్దరు బీహార్‌, ఒకరు త్రిపురవాసిగా పోలీసులు గుర్తించారు. 

విష ప్రయోగంగా పోలీసుల అనుమానం:
ఒకే బావిలో అన్ని మృతదేహాలు దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఈ కేసుని సవాల్ గా తీసుకున్నారు. మిస్టరీని చేధించే పనిలో పడ్డారు. అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, విష ప్రయోగం జరిగి ఉంటుందా? అనే అనుమానం పోలీసులకు వచ్చింది. ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

బావి నుంచి గురువారం 4, శుక్రవారం 5 మృతదేహాలు వెలికితీత:
వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలోని ఇండస్ట్రియల్ ఏరియాలో బార్‌దాన్‌ గోడౌన్‌ ఆవరణలో ఉన్న బావిలో శుక్రవారం మరో 5 మృతదేహాలను బయటకు తీశారు. వీరిలో త్రిపురకు చెందిన షకీల్‌ కుటుంబం కొన్నేళ్ల నుంచి వరంగల్‌లోని శాంతినగర్‌లో నివాసం ఉంటోంది. మరో ఇద్దరు మృతులు షాబాద్‌, సోహైల్‌ ఇంతకుముందు ఇదే బావిలో చనిపోయిన మక్సూద్‌, నిషాల కుమారులు. మిగిలిన ఇద్దరు బీహార్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. 

మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు:
మక్సూద్‌ కుటుంబంలోని ఆరుగురు, బీహార్‌ కూలీలు ఇద్దరు ఈ గోడౌన్‌ ఆవరణలోని వేర్వేరు గదుల్లో నివసించేవారు. వరంగల్‌ సీపీ రవీందర్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. షకీల్‌ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మిగతా 8 మృతదేహాలను ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, వరంగల్‌ సీపీ రవీందర్‌, వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ హరిత వేర్వేరుగా ఎంజీఎంలోని మృతదేహాలను పరిశీలించారు.

సామూహిక ఆత్మహత్యలా?
గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో చోటుచేసుకున్న ఈ విషాదం అందరినీ షాక్ కు గురి చేసింది. అసలు ఈ తొమ్మిది మంది మరణానికి గల కారణాలేమిటి ? వలస కార్మికులు కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో స్వస్థలాలకు వెళ్ళలేక సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారా ? ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ఇప్పటివరకు మృతి చెందిన వారి వివరాలు చూస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఎండీ మక్సూద్ ఆలం(50), అతని భార్య నిషా(45), కుమార్తె బూస్రా(20), మూడేళ్ల వయసున్న బూస్రా కొడుకు, మక్సూద్ ఇద్దరు కొడుకులు షాబాద్ ఆలం(22), సోహెల్ ఆలం, త్రిపురకు చెందిన షకీల్ గా గుర్తించారు. ఇక వీరితోపాటు బీహార్ కు చెందిన శ్రీరాం, శ్యాం లుగా గుర్తించారు.

హత్యలా? ఆత్మహత్యలా?
మొత్తం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, అలాగే బీహార్ కు చెందిన ఇద్దరు గీసుగొండ మండల పరిధిలోని గొర్రెకుంట ప్రగతి ఇండస్ట్రియల్ ఏరియాలో పని చేస్తున్నారు. ఈ కేసులో మొదట బీహార్ యువకులను అనుమానించిన పోలీసులకు వారి మృతదేహాలు కూడా లభ్యం కావటంతో ఈ కేసు పెద్ద చిక్కుముడిలా తయారైంది. గన్నీ సంచుల గోదాం యజమానిని అడిగి పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. గొర్రెకుంటలోని గన్నీ సంచుల తయారీ గోదాంలో మక్సూద్ కుటుంబం పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వీరు కనిపించడం లేదని గోదాం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి ఫోన్లు కూడా స్విచ్చాఫ్ వచ్చాయి. అనూహ్యంగా మక్సూద్ కుటుంబం అనుమానాస్పదంగా చనిపోవడం కలకలం రేపుతోంది. కుటుంబ పెద్ద ఎండీ మక్సూద్ 20 ఏళ్ల కిందటే కుటుంబంతో సహా బతుకుదెరువు కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వరంగల్‌కు వచ్చాడు. గొర్రెకుంటలో గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో ఈ దారుణం జరిగింది.

మిస్టరీగా మారిన మరణాలు:
లాక్‌డౌన్ వల్ల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని గత నెలన్నర రోజులుగా గోదాంలోనే 2 గదుల్లో మక్సూద్, భార్య, ఇద్దరు కుమారులు, భర్త నుంచి విడిపోయిన కూతురు బుస్ర ఆమె మూడేళ్ల కుమారుడు ఉంటున్నారు. వీరితో పాటు బీహార్ యువకులు శ్రీరాం, శ్యాం కూడా స్థానికంగా మరో గదిలో ఉంటున్నారు. కాగా, మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ప్రాథమికంగా ఆత్మహత్యగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read: గొర్రెకుంట ఘటనలో షాకింగ్ ట్విస్ట్..చక్కెర పొంగలిలో విషం కలిపి తొమ్మిదిమందిని చంపేశారా?