బీఫార్మశీ విద్యార్ధిని బలవన్మరణంలో కొత్త ట్విస్ట్

బీఫార్మశీ విద్యార్ధిని బలవన్మరణంలో కొత్త ట్విస్ట్

New Twist in B.Pharmacy Student ends her life  : బీ ఫార్మశీ విద్యార్ధిని ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. 10 రోజుల క్రితం కిడ్నాప్, అత్యాచారం డ్రామా ఆడిన బీ ఫార్మశీ విద్యార్ధిని తాను ఆడిన డ్రామా బయటపడటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. మంగళవారం మధ్యాహ్నమే తన తండ్రి వాడే షుగర్ టాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ వైద్యులు వైద్యం అందించి వెంటనే ఇంటికి పంపించి వేశారు. విద్యార్ధిని చాలా నీరసంగా ఉందని ఆమెకు పూర్తి స్ధాయిలో రెస్ట్ కావాలని చెప్పి వైద్యులు ఇంటికి పంపించినట్లు తెలిసింది. ఇంటికి వచ్చిన తర్వాత విద్యార్ధిని తిరిగి రాత్రి ఇంకోసారి షుగర్ టాబ్లెట్ల్ వేసుకుంది.

అది గమనించిన  కుటుంబ సభ్యులు తమ కుమార్తెను సమీపంలోని ఘట్ కేసర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు వైద్యం అందిస్తున్న సమయంలో ఆరోగ్యం మరింత విషమించి విద్యార్ధిని కన్నుమూసింది.

ఫిబ్రవరి 10న  సాయంత్రం వేళ…తనను ఎవరో కిడ్నాప్ చేశారని బీఫార్మశి విద్యార్ధని  తల్లిదండ్రులకు చెప్పింది. యువతి తల్లి 100 నంబర్‌కు కాల్ చేయడంతో పోలీసులు తక్షణం రంగంలోకి దిగారు. యువతి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా యువతి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాలేజీ నుంచి షేర్ ఆటోలో ఇంటికి వస్తున్న తనను నలుగురు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం జరిపారని యువతి ఫిర్యాదుచేసింది.

యువతి ఫిర్యాదు ఆధారంగా నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే యువతి, ఆటోడ్రైవర్ల మాటలకు పొంతన కుదరకపోవడంతో..మరింత లోతుగా సీసీటీవీలు పరిశీలించారు పోలీసులు. ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేశారని చెప్పే సమయంలో యువతి…స్నేహితునితో కలిసి వెళ్తున్నట్టు సీసీటీవీలో రికార్డయింది. ఆ దృశ్యాల ఆధారంగా యువతిని గట్టిగా ప్రశ్నించగా…ఇంటికి వెళ్లడం ఆలస్యం కావడంతో తల్లి తిడుతుందన్న భయంతో..కిడ్నాప్ చేశారని చెప్పానంటూ యువతి అంగీకరించింది.

లాక్‌డౌన్ సమయంలో చిల్లర విషయంలో ఆటో డ్రైవర్‌తో జరిగిన గొడవ కారణంగా అతని పేరును పోలీసులకు చెప్పినట్టు వెల్లడించింది. యువతి వాంగ్మూలం స్వీకరించిన తర్వాత పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజీని చూపిస్తూ వాస్తవంగా జరిగిన విషయాలను వివరించారు. ఆటో డ్రైవర్లను అనుమానించినందుకు ఈ నెల 13వ తేదీన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆటో డ్రైవర్ల యూనియన్‌కు క్షమాపణలు చెప్పారు.

కిడ్నాప్ వ్యవహారం అంతా ఫేక్‌ అని తేలడంతో యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించడం, పరువు పోవడం, బంధువులను, స్నేహితులను  కలిసే పరిస్థితి లేకపోవడం యువతిని తీవ్రంగా వేధించాయి. తన మూలంగా కుటుంబం పరువు కూడా పోయిందని యువతి ఆవేదన చెందింది. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు యువతిపై  కేసు నమోదయింది. ఈ పరిస్థితుల్లో బయటకు తిరగలేనని భావించే.. ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డ్రామా వ్యవహారం బయట పడిన  తర్వాత బాలిక తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఆమెకు కొందరి నుంచి విమర్శలు వచ్చాయి. అనంతరం పోలీసు ఇన్వెస్టిగేషన్ లోనూ  పోలీసులు తన వాంగ్మూలం పూర్తిగా తీసుకోలేదనే భావన వ్యక్త పరిచిన ఆడియో క్లిప్పింగ్ ఒకటి వైరల్ అవుతోంది. తాను చెప్పాలనుకున్న దానిని పూర్తిగా పోలీసులు రికార్డు చేయలేదని తెలుస్తోంది. కిడ్నాప్ డ్రామా అయిన తర్వాత ఆమె పడ్డ మానసిక ఒత్తిడి ఏమిటి ? ఎవరైనా ఆమెను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ చేశారా అనే అనేక అంశాలు తేలాల్సి ఉంది.