Social Media Friend : కొత్త కాపురంలో చిచ్చు రేపిన సోషల్ మీడియా

Social Media Friend : కొత్త కాపురంలో చిచ్చు రేపిన సోషల్ మీడియా

Social Media Friend

Social Media Friend :  ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా స్నార్ట్  ఫోన్లు ఉంటున్నాయి. గతేడాది కరోనా లాక్ డౌన్ నుంచి వీటి వాడకం బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో ఎక్కడెక్కడి వారో ఫ్రెండ్స్ అవుతున్నారు. కొత్త పరిచయాలు.. వారితో టైమ్ పాస్ చేసేస్తున్నారు.  పక్కన ఏంజరుగుతోందో కూడా పట్టించు కోనంతగా ప్రజలు వీటిలో తలమునకలై పోతున్నారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్, వాట్సప్.. అంటూ  ఫోన్లతోనే  కాలక్షేపం చేస్తున్నారు. వీటిమీద ఎన్ని సైటైర్ల్ వేసినా జనం మాత్రం వాళ్ల అలవాటు మానుకోవటం లేదు. తెలిసీ తెలియక   ఫేస్‌బుక్ లో ఓ వివాహిత  చేసిన స్నేహం.. అపరిచిత వ్యక్తిపై ఆమె చూపించిన ప్రేమ… చివరికి ఆమె కొత్త కాపురంలో చిచ్చు పెట్టింది. నాలుగు నెలల వైవాహిక జీవితం చిక్కుల్లో పడింది.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ఓ యువతికి నాలుగు నెలల క్రితం వివాహమైంది.   భర్తతో కొత్త కాపురం మొదలు పెట్టిన యువతికి  భర్త ఆఫీస్ కి వెళ్ళాక సెల్ ఫోనే లోకమయ్యింది.  మళ్లీ   భర్త సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగివచ్చే దాకా సెల్ ఫోన్ తో కాలక్షేపం చేస్తూ ఉండేది.

ఈ క్రమంలోనే ఆమెకు వనపర్తి జిల్లాకు చెందిన సందీప్ అనే యువకుడు సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు.  గ్రామంలో ట్రాక్టర్ నడుపుకుని జీవనం సాగిస్తున్న సందీప్‌ ఆమెతో చాలా క్లోజ్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు.  క్రమేపి  వీరి పరిచయం చాటింగ్ స్ధాయి నుంచి  వీడియో కాల్స్ వరకు వెళ్ళింది.సందీప్ మాటలకు మైమరచిపోయిన యువతికి అతనే లోకం అయ్యాడు.

భర్త ఆఫీస్ కి వెళ్లడం ఆలస్యం వివాహిత సందీప్ తో గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఆమె భర్తకు షాక్ ఇచ్చింది. భర్తను వదిలి ప్రియుడు కోసం అతడు ఉంటున్న ఊరు వెళ్లింది. తనకు  ఫేస్‌బుక్ ప్రియుడే కావాలంది. అతనితోనే కలిసి జీవిస్తానంది.

ఇది తప్పు అని వారించాల్సిన సందీప్ సైతం ఆమెను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. గత 20 రోజులనుండి వారిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని తెలుసుకున్న వివాహిత తల్లి ఇంటికి రమ్మని పిలిచినా,  భర్తకు నచ్చచెప్పి అతని దగ్గరకు పంపిస్తామని  కోరినా   ఆమె నిరాకరించింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.