నక్సలైట్లకు, నేరస్ధులకు తుపాకులు సప్లై చేస్తున్న వ్యక్తి అరెస్ట్

  • Published By: murthy ,Published On : December 8, 2020 / 08:14 PM IST
నక్సలైట్లకు, నేరస్ధులకు తుపాకులు సప్లై చేస్తున్న వ్యక్తి అరెస్ట్

NIA Arrests Arms Trafficker From Bihar’s Gaya : జబల్ పూర్ లోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో నుంచి ఏకే సిరీస్ ఆయుధాలను దొంగిలించి నక్సలైట్లకు, నేరస్ధుల ముఠాలకు అంద చేస్తున్న గయ జిల్లాకు చెందిన ఆయుధాల వ్యాపారిని జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు (NIA) మంగళవారం అరెస్ట్ చేశారు.

ఆయుధాల ఫ్యాక్టరీల నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లటం కొత్తేమి కాదు. 2018 లో కోల్‌కతా పోలీసులు భారతదేశం అంతటా నక్సలైట్‌లకు ఆయుధాలను సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయుధ డీలర్ల రాకెట్టును ఛేదించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఇషాపూర్‌లోని రైఫిల్ ఫ్యాక్టరీ నుంచి రైఫిల్స్‌ను అక్రమంగా రవాణా చేస్తూ….. భారత్‌తోపాటు నేపాల్‌లోని నిషేధిత సంస్థలకు సరఫరా చేయడానికి కొంత మంది వ్యాపారుల బృందం ఈ పనిలో ఉన్నట్లు ఈ కేసు దర్యాప్తులో తేలింది.


మావోయిస్టులకు INSAS రైఫిల్స్ సరఫరా చేసినందుకు మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి కేసు కూడా 2017 లో వెలుగులోకి వచ్చింది. తన కారులో ఆయుధాలను అక్రమంగా రవాణా చేసి బిహార్, జార్ఖండ్‌లోని నక్సల్ ప్రాబల్య ప్రాంతాలకు రవాణా చేసినందుకు ఇషాపూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారిని కూడా అరెస్టు చేశారు. ఆయుధాల బ్లూప్రింట్లు కూడా ఆయన ఉగ్రవాదులకు చేరవేశారని విచారణలో తేలింది.


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్‌ అధికారుల నివేదిక ప్రకారం ….. నక్సలైట్లు స్దానికంగా తమ సొంత ఆయుధ కర్మాగారాలను కలిగి ఉన్నారని భావిస్తున్నారు. ఈ కర్మాగారాల్లో చెడిపోయిన తుపాకులను రిపేరు చేయటం నుంచి …ఆధునాతన ఆయుధాల తయారీ కూడా చేస్తున్నారు అని IDSA నిపుణుడొకరు చెప్పారు.