బంగ్లా మహిళల అక్రమ రవాణా కేసులో NIA తొలి ఛార్జ్ షీట్

  • Published By: sreehari ,Published On : October 18, 2020 / 03:22 PM IST
బంగ్లా మహిళల అక్రమ రవాణా కేసులో NIA తొలి ఛార్జ్ షీట్

Bangladeshi human trafficking case : అంతర్జాతీయ బంగ్లాదేశీ మహిళల అక్రమ రవాణ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏడాది క్రితం అంతర్జాతీయ బంగ్లాదేశీ మానవ అక్రమ రవాణా ముఠాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసులో 9 మంది బంగ్లాదేశీయులతో పాటు 12 మంది పేరును ఛార్జ్ షీటులో దాఖలు చేసింది.



ఈ ఛార్జ్ షీటును ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించింది. బంగ్లాదేశీ యువతులను బంగ్లా నుంచి హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు ఛార్జ్ షీటులో పేర్కొంది. నకిలీ ఇండియన్‌ ఐడీ కార్డు సృష్టించి బంగ్లాదేశ్‌ నుంచి యువకులను అక్రమంగా తరలిస్తోంది ఈ గ్యాంగ్.



యువతులను గృహాల్లో బందించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ తరలించి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్ కు చెందిన బితీ బేగం అనే మహిళ ఈ ట్రాఫికింగ్ రాకెట్‌లో ప్రధాన సూత్రాధారిగా గుర్తించారు. ముందుగా నగరంలోని పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళల అక్రమ రవాణాపై కేసు నమోదు అయింది.



ఆ తరువాత ఎన్‌ఐఏకు బదిలీ అయింది. జల్పల్లి ప్రాంతంలో వ్యభిచార గృహాల్లో ఉన్న నలుగురు బంగ్లా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ షెల్టర్ హోమ్స్‌లో ఉంచారు. ఈ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ వెల్లడించింది.