రిమాండ్ పొడిగింపు : 24 వరకు నీరవ్ మోదీకి చిప్పకూడే

  • Published By: madhu ,Published On : April 27, 2019 / 03:06 AM IST
రిమాండ్ పొడిగింపు : 24 వరకు నీరవ్ మోదీకి చిప్పకూడే

PNB బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయి అరెస్టయిన వజ్రాల వ్యాపారి నీవర్ మోదీకి మరో కొన్ని రోజుల పాటు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే లండన్ కోర్టు మే 24 వరకు రిమాండ్ విధించింది. నీరవ్ మార్చి నెలలో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇతడిని భారత్‌కు అప్పగించాలనే కేసు లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో నడుస్తోంది. అరెస్టయినప్పటి నుండి వాండ్స్‌వర్డ్ జైలులో ఉంటున్నాడు. 

ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం విచారణకు వచ్చింది. వెస్ట్‌మినిస్టర్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్ నాట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. మే 30వ తేదీన పూర్తిస్థాయి వాదనలు వినడం జరుగుతుందని తెలిపింది. మే 24వ తేదీన మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం జరుగుతుందని వెల్లడించారు. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే విషయంలో కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. 

నీరవ్ మోదీ ప్రముఖ వజ్రాల వ్యాపారి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఇతనిపై ఆరోపణలున్నాయి. 2018లో PNB బ్యాంకు స్కాంలో అతని పాత్ర ఉందనే అభియోగాలున్నాయి. దేశం విడిచి లండన్ పారిపోయాడు నీరవ్. తమకు అప్పగించాలని భారత్..బ్రిటన్‌ దేశానికి విజ్ఞప్తి కూడా చేసింది. ఇటీవలే ఈయన్ని ఓ పత్రిక ఇంటర్వూ చేసింది. ఖరీదైన అపార్ట్ మెంట్‌లో ఉంటున్నాడని..కొత్తగా వజ్రాల వ్యాపారం చేస్తున్నాడని ఆ పత్రిక ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. ఆ తరువాత జరిగిన పరిణామాల అనంతరం నీరవ్ మోదీని అరెస్టు చేశారు పోలీసులు.