ఎన్నాళ్లీ డ్రామాలు ? తెరపడేదెప్పుడు ?

  • Published By: chvmurthy ,Published On : February 21, 2020 / 12:03 PM IST
ఎన్నాళ్లీ డ్రామాలు ? తెరపడేదెప్పుడు ?

నిర్భయ కేసులో దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు డ్రామాల మీద  డ్రామాలు ఆడుతున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహార్‌ జైల్లో  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి తీయాలని  కోర్టు జారీ చేసిన  డెత్‌వారెంట్‌ను తప్పించుకోవడానికి ఈ నాటకాన్ని మొదలుపెట్టాడు వినయ్‌ శర్మ. నిర్భయ దోషులు ఆడుతున్న నాటకాలకు.. కోర్టులే విస్తుబోతున్నాయి. 

న్యాయస్థానాలు డెడ్‌లైన్‌ విధించినా.. వాటిని కూడా నరరూప రాక్షసులు తప్పించుకుంటున్న తీరు  నివ్వెరపోయేలా చేస్తోంది. కోర్టులు శిక్షలు విధిస్తున్నా. చట్టంలోని లూప్‌హోల్స్‌తో హ్యాపీగా కాలం గడిపేస్తున్నారు. తీహార్‌ జైల్లో  నిర్భయ కేసు దోషులు చేసే చేష్టలు సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీని తలపిస్తున్నాయి. నిర్భయ దోషులు ఆడుతున్న నాటకాలతో అధికారులు నివ్వెర పోతున్నారు. ఉరిశిక్షను  తప్పించుకోవడానికి తల పగలగొట్టుకున్నాడు వినయ్‌ శర్మ.  జైలు సిబ్బందిపైనా నిర్భయ దోషుల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. 

మార్చి 3న ఉదయం 6 గంటలకు అమలు కావాల్సిన ఉరిశిక్షను తప్పించుకోవడానికి నిర్భయ దోషులు విఫలయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే.. ఈ నెల 16న జైల్లో గోడలకు తలను బాదుకుని గాయపరుచుకున్నాడు దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ.  అంతటితో  ఆగకుండా ఊచల మధ్య చెయ్యి పెట్టి విరగొట్టుకునేందుకు యత్నించాడు.  దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని ఆసుపత్రికి  తరలించారు. చికిత్స అనంతరం వినయ్‌ శర్మను డిశ్చార్జ్‌ చేశారు.

అటు.. వినయ్ శర్మ డ్రామాలను చూపించి.. కోర్టు నుంచి సానుభూతి పొందడానికి అతని లాయర్‌ ఏపీసింగ్ ప్రయత్నిస్తున్నారు. కొత్త డెత్‌ వారెంట్‌ జారీ అయినప్పటి నుంచి దోషి వినయ్ శర్మ మానసిక పరిస్థితి సరిగ్గా  లేదంటున్నారు. అయితే.. ఏపీ సింగ్‌ వాదనను తీహార్‌ జైలు అధికారులు  తోసిపుచ్చారు. వినయ్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు.

కొత్త డెత్‌ వారెంట్ జారీ అయినప్పటి నుంచి దోషుల ప్రవర్తనలో చాలా మార్పు  వచ్చినట్లు జైలు వర్గాలు గుర్తించాయి. జైలు వార్డెన్‌, సిబ్బందితో నిర్భయ దోషులు చాలా దురుసుగా  ప్రవర్తిస్తున్నారు… భోజనం కూడా మానేసినట్లు సమాచారం. ఎలాగైనా అనారోగ్యం  పాలు కావాలని దోషులు చూస్తున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే ఉరిశిక్ష అమలవుతుంది కాబట్టి.. తమను తాము గాయపరుచుకుంటున్నారు. అటు.. ఉరితీత తేదీ దగ్గరపడుతుండడంతో జైలు  అధికారులు దోషులపై మరింత నిఘా పెట్టారు. వారున్న జైలు గదుల్లో సీసీటీవీ కెమెరాల  ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

నిర్భయ కేసులో వినయ్ శర్మ సహా… నలుగురు దోషులకూ… మార్చి 3న ఒకేసారి  ఉరిశిక్ష అమలు చేయాలని పటియాలా హౌస్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఉరిశిక్ష  అమలు రెండుసార్లు వాయిదా పడింది. అయితే ఉరి వేసే సమయంలో దోషులకు అన్ని  వైద్య పరీక్షలూ చేస్తారు. వారికి ఎలాంటి అనారోగ్యం లేదని తేలాకే ఉరి తీస్తారు. ఈ  కేసులో నలుగురికీ ఒకేసారి ఉరిశిక్ష అమలు చెయ్యాల్సి ఉంది.. నలుగురిలో ఒకరు  గాయపడినా… ఉరి శిక్ష అమలు వాయిదా వేయాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకునే  దోషి వినయ్‌ శర్మ ఆత్మహత్యయత్నానికి తెరలేపినట్లు తెలుస్తోంది. నిర్భయ దోషులు ఆడుతున్న ఈ దొంగ నాటకాలకు.. తీహార్‌ జైలు అధికారులు ఎలా తెర వేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిగా ఉంది.

ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు  అన్ని యత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి 2013 సెప్టెంబర్ 10నే  ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషులకు ఉరిశిక్ష విధించింది..కానీ చట్టపరమైన లొసుగులతో మార్చి 15, 2014న కేసులోని ఇద్దరు హంతకులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తాలు స్టే తెచ్చుకోవడంతో ఈ వాయిదాల డ్రామా  ప్రారంభమైంది.. ఆ తర్వాత రెండో వాయిదా జూన్ 2, 2014న పడింది.. అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలు తాము ఈ కేసులో అమాయకులమంటూ అప్పీల్ చేసుకోవడంతో శిక్ష అమలు మరోసారి వాయిదా పడింది.. అలా విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటూ ఎట్టకేలకు సుప్రీంకోర్టు కూడా 2017 మే, 5న నలుగురు దోషులనూ ఉరితీయాలంటూ తీర్పు ఇచ్చే వరకూ సాగింది..

ఐతే ఆతర్వాతే అసలు డ్రామాకి తెరలేచింది.. 2017లో శిక్ష నిర్ధారిస్తే.. 2018లో కానీ పవన్ గుప్తా, ముఖేష్ , వినయ్ శర్మలు రివ్యూ పిటీషన్ దాఖలు చేయలేదు. తాము చేసిన తప్పిదానికి మరణశిక్ష తగదని రివ్యూ పిటీషన్లు వేసుకున్నారు…అది కాస్తా  జులై 9, 2018న తిరస్కరణకు గురైంది..అలా నిర్భయ దోషులు కేసులో మూడోసారి తప్పించుకున్నారు.. ఆ తర్వాతైనా శిక్ష అమలవుతుందనుకుంటే.. అప్పుడూ ఆలస్యమే చోటు చేసుకుంది.. అలా కేసులో నాలుగోసారి శిక్ష వాయిదా పడింది..

ఆ తర్వాత మరో ఏడాదిన్నరకి కానీ మిగిలిన అక్షయ్ కుమార్ రివ్యూ పిటీషన్ వేయలేదు.. నవంబర్ 2019లో అక్షయ్ రివ్యూ పిటీషన్ వేసాడు. ఎందుకింత తీరిగ్గా రివ్యూ పిటీషన్ దాఖలైందన్నఆలోచన కేంద్రానికో.. ఢిల్లీ రాష్ట్రానికో అప్పుడే వచ్చి ఉంటే కేసు ఇక్కడిదాకా వచ్చేది కాదు. ఓ వైపు కోర్టులు శిక్షలు విధిస్తున్నా… మరోవైపు ఈ నలుగురూ మాత్రం తమ వాయిదాల డ్రామాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేస్తూ… చట్టంలోని లూప్ హోల్స్‌ని తమకు అనుకూలంగా వాడుకున్నారు. దాంతో నిర్భయదోషులు ఐదోసారి తప్పించుకున్నారు..

ఐతే 2019 డిసెంబర్ వచ్చేసరికి..నిర్భయ నేరస్థులలో చావుభయం పెరిగిపోవడంతో పాటు..తెలివితేటలూ దొంగనాటకాలూ ఎక్కువైపోయాయ్. .డిసెంబర్ 16 తర్వాత ఉరికి ఏర్పాట్లనే ప్రచారం సాగడంతో..దోషుల్లో టెన్షన్ పెరిగిపోయింది.. సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ ముందు వినయ్ శర్మ, ముఖేష్ సింగ్‌  క్యూరేటివ్ పిటీషన్లు దాఖలు చేసారు. ఈ కేసులో శిక్ష అమలు కాకుండా ఆరోసారి అలా క్యూరేటివ్ పిటీషన్ల అండతో తప్పించుకున్నారు. 

దీంతో జనవరి 7, 2020న కానీ పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయలేకపోయింది. జనవరి 22న ఉరిశిక్ష అమలు అవుతుందనుకునేలోపే.. ముఖేష్ సింగ్ మెర్సీ పిటీషన్  పెండింగ్ ఉందనే సాకు చూపించడంతో జనవరి 17న డెత్ వారెంట్‌ని పాటియాలా కోర్టు రద్దు చేసింది. అలా మెర్సీ పిటీషన్ సాకుతో దోషులు ఏడోసారి తప్పించుకున్నారు.. 

ఈ మధ్యలోనే పవన్ గుప్తా … తాను మైనర్‌ని అనే వాదనని ఢిల్లీ హైకోర్టు పట్టించుకోలేదంటూ సుప్రీంకోర్టుకి వెళ్లాడు.  అది ఫలించలేదు కానీ.. నిర్భయ దోషులలో అక్షయ్ కుమార్ రాష్ట్రపతికి మెర్సీ పిటీషన్ పెట్టుకున్నాడు..ఇది జనవరి 30 వరకూ సస్పెన్స్‌లో ఉన్నా…జనవరి 31న  పాటియాలా కోర్టులో జైలు రూల్స్ ని సాకుగా చూపుతూ డెత్ వారెంట్ రద్దు అయింది. దీంతో మరోసారి నిర్భయ దోషులు ఎనిమిదోసారి ఉరిశిక్ష నుంచి తప్పించుకోగలిగారు.

ఐతే పాటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ ఎప్పుడనేది కూడా ప్రకటించలేదు. దీంతో నిర్భయ నేరస్తులు తొమ్మిదోసారి ఉరిశిక్ష అమలు కాకుండా నాటకమాడారు. దీనిపైనే అటు కేంద్రం..ఇటు నిర్భయ తల్లిదండ్రులు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా..పాటియాలా కోర్టుకి వెళ్లాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం సూచించింది. నిర్భయ పేరెంట్స్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన పటియాల కోర్టు ఎట్టకేలకు కొత్త డెత్‌వారెంట్‌ జారీ చేసింది. మార్చి 3 న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులకు ఒకేసారి ఉరితీయాలని కోర్టు ఆదేశించింది.

నలుగురు దోషుల్లో ఇప్పటికే ముగ్గురికి న్యాయపరమైన అవకాశాలు మూసుకుపోయాయి. పవన్‌కు మాత్రమే క్యూరేటివ్‌ పిటిషన్‌ వేసుకునే ఛాన్స్ ఉంది. అయితే దోషులకు న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి హైకోర్టు ఇచ్చిన వారం రోజుల గడువు ఎపుడో ముగిసిపోయింది. దోషి పవన్‌కు కోర్టు ఛాన్స్‌ ఇస్తుందా….లేక దోషులందరిని ఉరి తీస్తుందా…అనేది సస్పెన్స్‌గా మారింది. అటు వినయ్‌ శర్మ చేసుకున్న గాయం ప్రభావం ఎంత అన్న దాన్ని బట్టీ.. ఉరిశిక్ష అమలవుతుందా లేదా అన్నదీ తేలనుంది.