ముహూర్తం ఖరారు : 20న నిర్భయ దోషులకు ఉరిశిక్ష

  • Published By: chvmurthy ,Published On : March 5, 2020 / 11:42 PM IST
ముహూర్తం ఖరారు : 20న నిర్భయ దోషులకు ఉరిశిక్ష

నిర్భయ దోషులను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన దారులు ముగిశాయి కాబట్టి ఉరి తేదీ ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. దోషుల్లో ఒకడైన పవన్‌ ఇటీవల రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోవడం.. దాన్ని రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరి తేదీలు ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును చేరింది. దీంతో  ఈ నెల 20న ఉదయం గం.5-30కు  ఉరి తీయాల్సిందిగా అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా తెలిపారు.

దీనికి ఎలాంటి నోటీసు అవసరం లేదని ప్రాసిక్యూషన్‌ లాయర్‌ తెలిపారు. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి స్పందిస్తూ.. ఈ నెల 20 ఉదయం తమ జీవితాల్లో వెలుగు నింపే ఉదయమని చెప్పారు. దోషుల మరణాన్ని చూడాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

మరణశిక్షను తప్పించుకునేందుకు,వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ (32) ఇప్పటికే పలుమార్లు ప్రయత్నిస్తూ వచ్చారు.  చట్టంలోని లొసుగులను దోషులు చక్కగా ఉపయోగించుకుంటున్నారని, ఏది జరగకూడదో అదే జరుగుతోందని శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్నా లో వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజలు కోర్టుల మీద నమ్మకం కోల్పోరని భావిస్తున్నట్లు చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఖరారు చేశాక అవి అమలు జరిగితీరాలని చెప్పింది.

న్యాయపరమైన అవకాశాల పేరిట వారు పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరి అమలు తేదీ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. తొలిసారి ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 1న రెండోసారి డెత్‌ వారెంట్లు జారీ అయినప్పటికీ ఉరి వాయిదా పడింది. మార్చి 3న మరోసారి ఉరితీయాలని డెత్‌వారెంట్లు జారీ అయినప్పటికీ పవన్‌ గుప్తా రాష్ర్టపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడంతో మరోసారి ఉరి అమలు వాయిదా పడింది. అతడి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఢిల్ల్లీ ప్రభుత్వం బుధవారం డెత్‌వారెంట్ల జారీపై పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషులకు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. 

నిర్భయ కేసు దోషులను ఒకేసారి ఉరితీయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 23న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఒకే నేరానికి సంబంధించిన దోషులను వేరువేరుగా ఉరి తీసే అంశంపై లోతుగా పరిశీలన జరుపుతామని చెప్పింది. ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు మార్చి 20న దోషులకు ఉరిని ఖరారు చేసిందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జస్టిస్‌ ఆర్‌ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు.

శిక్ష అమలును జాప్యం చేయడానికి దోషులు పలు ఎత్తుగడలు వేస్తూ న్యాయవ్యవస్థను పరిహసించారని ఆరోపించారు. వాదనలు విన్న జస్టిస్‌లు ఆర్‌ భానుమతి, అశోక్‌ భూషణ్‌, ఎస్‌ బోపన్నతో కూడిన సర్వోన్నత ధర్మాసనం.. మార్చి 23న విచారణ చేపడుతామని, దీనిపై ఎలాంటి వాయిదాల్ని అనుమతించబోమని తెలిపింది.

See Also | భర్తకు నైట్ డ్యూటీ ….14 ఏళ్ల బాలుడితో ఇంట్లో ఆంటీ రాసలీలలు