నిర్భయ కేసు వాయిదాల పర్వం..ఉరి శిక్షలు పడేనా

  • Published By: madhu ,Published On : February 13, 2020 / 06:19 PM IST
నిర్భయ కేసు వాయిదాల పర్వం..ఉరి శిక్షలు పడేనా

నిర్భయ కేసులో వాయిదాల పర్వం కొనసాగుతోంది.  నిర్భయ దోషులకు కొత్తగా డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ నిర్భయ పేరెంట్స్‌ పిటిషన్‌పై పటియాల కోర్టు విచారణ జరిపింది. వినయ్‌ శర్మ పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండడంతో దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం చివరి ఊపిరి ఉన్నంత వరకు దోషులు తమకున్న న్యాయపరమైన హక్కులను వినియోగించుకునే అవకాశం ఉందని విచారణ సందర్భంగా పటియాల కోర్టు వ్యాఖ్యానించింది.

నిర్భయకు న్యాయం చేయాలంటూ పటియాల కోర్టు ఆవరణలో నిర్భయ మద్దతు దారులు ప్లకార్డులను ప్రదర్శించారు. నిర్భయ కేసులో వాదించడానికి పవన్‌ తరపు న్యాయవాది ఏపీ సింగ్‌ తప్పుకోవడంతో పటియాల కోర్టు మరో న్యాయవాది రవి కాజీని నియమించింది. పవన్ తరపున వాదించడానికి సీనియర్‌ న్యాయవాది అంజనా ప్రకాశ్‌ను ఎమికస్‌గా సుప్రీంకోర్టు నియమించగా పవన్‌ తిరస్కరించాడు. దీంతో పటియాల కోర్టు రవి కాజీని నియమించింది.

రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మరో దోషి వినయ్‌ శర్మ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వినయ్‌ ఆరోగ్యం, మానసిక స్థితి సరిగా లేదని, అతని మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదు శిక్ష విధించాలని దోషి తరపు లాయర్‌ ఏపీ సింగ్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే వినయ్‌ ఆరోగ్యం బాగానే ఉందని, రొటీన్‌గా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని సోలిసిటరీ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రాష్ట్రపతి వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేశారని ఎస్జీ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు  తీర్పును రిజర్వ్‌ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది.

మరోవైపు నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరితీయాలన్న కేంద్రం పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. దోషులను వేర్వేరుగా ఉరి తీయాలన్న కేంద్రం పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు విచారణ జరపనుంది. కొత్త డెత్‌వారెంట్‌ ఇష్యూ చేసినా… అది అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరణశిక్ష వాయిదా వేసేందుకు దోషులు అన్ని యత్నాలు చేస్తున్నారు.