టికెట్ లేకుండా మెట్రోలో వెళ్ళండి: నుమాయిష్ అగ్నిప్రమాదం ఎఫెక్ట్

  • Published By: chvmurthy ,Published On : January 30, 2019 / 05:08 PM IST
టికెట్ లేకుండా మెట్రోలో వెళ్ళండి: నుమాయిష్ అగ్నిప్రమాదం ఎఫెక్ట్

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మోజాంజాహీ మార్కెట్ వైపు నుంచి ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసారు. ఎగ్జిబిషన్‌కు వచ్చిన సందర్శకులు నాంపల్లి స్టేషన్ వద్ద టికెట్ లేకుండా ఐనా మెట్రో రైలు ఎక్కి తమ గమ్య స్ధానాలకు చేరుకోవచ్చని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సందర్శకుల సౌకర్యం కోసం ఎల్బీనగర్ వైపు 5 మెట్రో రైళ్ళను అధికారులు ఏర్పాటు చేశారు. మెట్రో సర్వీసులను కూడా వేగంగా నడుపుతూ ఎగ్జిబిషన్ ఏరియా నుంచి జనాలను తరలిస్తున్నారు.

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ సహయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గాయాలైన వారిని సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇంతవరకు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేగదని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. నుమాయిష్‌లో మొత్తం 2వేల 500 స్టాల్స్‌ ఏర్పాటు చేయగా, ప్రమాద సమయంలో అక్కడ 20వేల మంది ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు.