సకుటుంబ సపరివార సమేతంగా… అందరూ దొంగలే

సకుటుంబ సపరివార సమేతంగా… అందరూ దొంగలే

northzone task force cops arrested gold robbery gang : సకుటుంబ సపరివార సమేతంగా… అందరూ దొంగలే…ఇదేదో తెలుగు సినిమా టైటిల్ అనుకుంటున్నారా…..కాదు కాదు సుమీ… ఆ ఇంట్లో జీవిస్తున్న అందరూ దొంగతనమే వృత్తిగా చేసుకుని బతుకుతున్నారు. అదీ బంగారం షాపుల్లో మాత్రమే దొంగతనం చేస్తారు. ప్రకాశం జిల్లాకు చెందిన రేణుక ఆమె సమీప బంధువులు ఎం.కిరణ్, వై.రాజు, అతడి భార్యలు తులసి, శ్వేత, మరో బంధువు రాణి   15 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి బతుకు తెరువు కోసం వచ్చారు.

హయత్ నగర్ ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని జీవిస్తున్న వీళ్లు కొన్నాళ్లు చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగించారు. తర్వాత  కాలంలో డబ్బుమీద ఆశ పుట్టి తేలిగ్గాడబ్బు సంపాదించాలనే ఆలోచన  పుట్టింది. అందుకు దొంగతనాలు మార్గంగా ఎంచుకున్నారు.ఈ ఐదుగురూ కలిసి కిరణ్ ఆటోలో నగరంలో తిరుగుతూ చోరీ చేసి పారిపోవటానికి అనువుగా ఉండే బంగారం  షాపులను ఎంచుకుంటారు.

వినియోగదారులుగా  షాపులోకి  వెళ్లి ఒకరు నగలు  వస్తువులు చూపించమని అడుగుతారు.  యాజమాని ఆపనిలో ఉండగా అతడి దృష్టి మళ్లించి చేతికి అందిన బంగారం వెండి వస్తువులను చోరీ చేస్తారు. దాన్ని తమ వస్త్రాల లోపలి భాగాల్లో ప్రత్యేకంగా కుట్టించిన అరల్లో  పెట్టుకుని షాపు నుంచి బయటకు వస్తారు. అంతా కలిసి అదే ఆటోలో ఉడాయిస్తారు.

కొన్నాళ్లకు  చోరీ చేసిన సొత్తును అమ్మి వాటాలుగా పంచుకుంటారు. ఇదే తరహాలో చిక్కడపల్లిలోని  రామ్‌స్వరూప్‌ జ్యువెలర్స్‌ నుంచి 600 గ్రాముల వెండి ఆభరణాలు, నాచారంలోని ఓమ్‌సాయి జ్యువెలర్స్‌ నుంచి 50 తులాల వెండి ఆభరణాలు, తుకారామ్‌గేట్‌లోని  త్రిషాల్‌ జ్యువెలర్స్‌ నుంచి 400 గ్రాముల వెండి దొంగిలించారు.

తుకారాం గేట్ లోని త్రిషాల్ జ్యువెలర్స్ కేసు విచారించేందుకు  రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు  ముఠాను గుర్తించారు. సోమవారం వీరు ఆరుగురిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి ఆటోతో పాటు 1070 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

నిందితులపై ఇప్పటికే పలు పోలీసుస్టేషన్లలో కేసులున్నాయన్నారు పోలీసులు. ఈ ముఠాకు చెందిన రేణుకపై గతంలో వివిధ పోలీసుస్టేషన్లలో 13 కేసులు, కిరణ్‌పై 3, తులసిపై 8, శ్వేతపై 3, రాజుపై 2 కేసులు ఉన్నట్లు తెలిపారు. కొన్ని పోలీసుస్టేషన్లలో వీళ్లు వాంటెడ్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులు ఆరుగురిని తుకారాం గేట్ పోలీసుస్టేషన్ లో అప్పగించారు.