అదిరిపోయే ఆఫర్లు, ఊరించే డిస్కౌంట్లు.. చీప్‌గా వస్తోందని కొందామనుకుంటే అడ్డంగా మోసపోతారు.. OLX కేటుగాళ్లు, ఇలా చీట్ చేస్తారు

  • Published By: naveen ,Published On : October 1, 2020 / 01:30 PM IST
అదిరిపోయే ఆఫర్లు, ఊరించే డిస్కౌంట్లు.. చీప్‌గా వస్తోందని కొందామనుకుంటే అడ్డంగా మోసపోతారు.. OLX కేటుగాళ్లు, ఇలా చీట్ చేస్తారు

olx fraud: వారు చదివింది ఏడు నుంచి పదిలోపే. అయితేనేం..అత్యాధునిక టెక్నాలజీ వారి సొంతం. అడ్డదారుల్లో డబ్బు సంపాదన వారి లక్ష్యం. అమాయక ప్రజలు టార్గెట్‌. OLX వెబ్‌సైట్‌ వారి అడ్డా. దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేశారు. పోలీసులు పట్టుకోవాలని చూస్తే దాడులు చేస్తారు..ఒక్కోసారి ప్రాణాలు సైతం తీస్తారు. అలాంటి ఓ కరుడుగట్టిన ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు.

ఓఎల్‌ఎక్స్‌లో ఆకర్షించే ఆఫర్లు.. తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులు.. వాహనాలపై అదిరిపోయే డిస్కౌంట్‌లు.. ఆఫర్స్‌ బాగున్నాయి..చీప్ గా వస్తున్నాయని..కొనేద్దామనుకుంటున్నారా..? నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బుక్‌ చేసేస్తున్నారా..? అయితే అడ్డంగా మోసపోవడం ఖాయం.

ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌ అడ్డాగా మోసాలు:
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌ను అడ్డాగా చేసుకొని వస్తువుల క్రయవిక్రయాల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేశారు. ఇంత పెద్ద ఎత్తున మోసం జరుగుతున్నా ఏ రాష్ట్ర పోలీసులూ ఇంత వరకు వారిని పట్టుకున్న దాఖలాలు లేవు. ఎవరైనా పట్టుకోవాలని చూస్తే ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడరు ఈ కేటుగాళ్లు. అలాంటి కరడుగట్టిన భరత్‌పూర్‌ దొంగల ఆటకట్టించారు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు.

ఆర్మీ అధికారులం అంటూ దగా:
ఈ మాయగాళ్లు కార్లు, బైక్‌లు, ఇతర వస్తువుల ఫొటోలు ఓఎల్‌ఎక్స్‌లో పెడతారు. ఆ వస్తువులను తక్కువ ధరకు అమ్ముతున్నట్లు ప్రకటనలు పోస్టు చేస్తారు. కస్టమర్లు నమ్మడానికి తమని తాము ఆర్మీ అధికారులుగా ప్రకటించుకుంటూ నకిలీ ఐడీకార్డులు, ఆర్‌సీలు పోస్టు చేస్తారు. కొనుగోలు చేయడానికి ఫోన్‌ చేసిన కస్టమర్లను బురిడీ కొట్టిస్తారు. వారిని మాయమాటలతో నమ్మించి ముందుగానే డబ్బులు దండుకుంటారు. ఇలా వేలాది మందిని మోసం చేసి లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇతరులు ఎవరైనా వస్తువులు అమ్మకానికి పెట్టినా, కొనుగోలు దారులుగా నమ్మించి దోచేస్తారు. వాళ్లే నకిలీ ఫొటోలు అప్‌లోడ్‌ చేసి వస్తువులు అమ్మకానికి పెట్టినట్లు నమ్మించి దోచేయడం ప్రత్యేకత.

ఇతరుల బ్యాంక్‌ ఖాతాలు, సిమ్‌కార్డులు:
సైబర్‌ నేరగాళ్లు అమాయకుల డబ్బులు కొల్లగొట్టడానికి తమ సొంత బ్యాంకు ఖాతాలు వినియోగించరు. కొంతమంది ఏజెంట్ల సహకారంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి బ్యాంకు ఖాతాలు, వేరే రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వారి పేర్లతో సిమ్‌కార్టులు సంపాదిస్తారు. ఒక్క బ్యాంకు ఖాతాకు 10 వేలు, ఒక్క సిమ్‌కార్డుకు 5వేలు చెల్లిస్తారు. అంతేకాదు.. సైబర్‌ నేరగాళ్లు తమకింద కొంతమంది యువకులను పెట్టుకుంటారు. వీళ్లు..ఖాతాలో డబ్బులు జమ కాగానే వెంటనే డ్రా చేస్తుంటారు.

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఓఎల్‌ఎక్స్‌ అడ్డాగా సైబర్‌ నేరాలు:
రాజస్థాన్‌ రాష్ట్రంలోని మారుమూల జిల్లా భరత్‌పూర్‌. ఆ జిల్లాలోని 6 డివిజన్లు, 12 పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని 600లకు పైగా గ్రామాల్లో వందలాది సైబర్‌ ముఠాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఓఎల్‌ఎక్స్‌ అడ్డాగా సైబర్‌ నేరాలు చేయడమే వారి పని. ప్రతిరోజు ఒక్కో యువకుడు తక్కువలో తక్కువ 5 నుంచి 10 మందిని మోసం చేస్తాడు. రోజుకు 50 వేల నుంచి లక్ష వరకు దోచుకుంటాడు. నేరస్థుల ఊరికి ఎవరైనా కొత్తవాళ్లు గానీ, పోలీసులు గానీ వస్తే వారికి వెంటనే సమాచారం అందుతుంది. దాంతో ఆడామగ తేడా లేకుండా చుట్టుముట్టి రాళ్లతో దాడి చేస్తారు.

ఖాకీ సినిమాను తలపించే రీతిలో.. హైదరాబాద్ పోలీసుల సాహసం:
కేవలం ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే ఓఎల్‌ఎక్స్‌ మోసాలతో ఈ సైబర్‌ నేరగాళ్లు గతేడాది రూ.15 కోట్లకు పైగా కొల్లగొట్టారు. దీంతో..మోస్ట్ వాంటెడ్‌, కరడుగట్టిన భరత్‌పూర్‌ సైబర్‌ దొంగలను పట్టుకోవడాన్ని సైబరాబాద్‌ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ వెళ్లిన పోలీస్‌ బృందం…నెలరోజుల పాటు మకాం వేసింది. ఖాకీ సినిమాను తలపించే విధంగా నేరస్థుల గురించి అన్ని ఆధారాలు సేకరించారు.

అక్కడి పోలీస్‌ అధికారులు ఏర్పాటు చేసిన సత్రంలో ఉన్నారు. పగలంతా సైబర్‌ నేరగాళ్ల కోసం ఆరా తీసి, రాత్రంతా గ్రామాల సరిహద్దుల్లో రెక్కీ నిర్వహించేవారు. అక్కడి పోలీస్‌ అధికారుల సాయం తీసుకున్నారు. నేరగాళ్లను పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు నేరగాళ్ల రాళ్లదాడికి దిగారు. అయినా పోలీసులు పట్టు వదలకుండా ఐదుగురు ప్రధాన సైబర్‌ నేరగాళ్లను పట్టుకున్నారు. లోకల్‌ పోలీసుల సహకారంతో సైబరాబాద్‌ పోలీసులు చాకచక్యంగా బయటపడ్డారు.

ఇకపై ఓఎల్‌ఎక్స్‌లో షాపింగ్ చేసే ముందు..కాస్త ఆలోచించి చేయండి. లేదంటే మీరు కొనాలనుకున్న వస్తువు రాకపోవడమే కాదు..మీ డబ్బు కూడా పోతుంది.